breaking news
Tragery office
-
ఆగిన ఆర్థిక సేవలు
సాక్షి, కడప : రాష్ట్ర విభజన నేపధ్యంలో ట్రెజరీ కార్యాలయంలో జూన్ 2వ తేదీ వరకు కార్యకలాపాలు స్తంభించనున్నాయి. ఆంధ్రప్రదేశ్ సంయుక్త రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్ల ఆఖరి వేతనం వారం రోజుల ముందే అందింది.ట్రెజరీలో బిల్లులు మంజూరు చేసేందుకు గడువు శనివారంతో ముగిసింది. ఆ బిల్లులను సోమవారం లోపు క్లియర్ చేయాలని బ్యాంకర్లను ఆదేశించారు. జూన్ 2వ తేదీన రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌గా విడిపోనుండటంతో జిల్లాలోని 30 వేల మందికి పైగా ఉద్యోగులు, 27 వేల మందికి పైగా రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన జీతభత్యాలు, పింఛన్ల చెల్లింపులు, డీఏ బకాయిలు, ఆఫీసు నిర్వహణ ఖర్చులు, ఎన్నికల ఖర్చులు, సమైక్యాంధ్ర సమ్మెకాలంలో ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవుల బిల్లుల చెల్లింపులు ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్థికశాఖ ఆదేశించింది. ఆ మేరకు జిల్లాలో దాదాపు రూ. 100 కోట్ల మేర బిల్లులను ఖజానా శాఖ పాస్ చేసింది. బిల్లుల చెల్లింపు గడువు శనివారంతో ముగిసింది. జిల్లాలోని ట్రెజరీ కార్యాలయంతోపాటు 13 సబ్ ట్రెజరీలకు వచ్చిన అన్ని బిల్లుల చెల్లింపులను పూర్తి చేశారు. ఏవైనా మిగిలిపోయిన బిల్లులు కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత తదుపరి ఆదేశాల మేరకే చెల్లింపులు జరగనున్నాయి. అపాయింట్‌డే వరకు పరిపాలనకు సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థల రోజువారీ ఆర్థిక లావాదేవీలు క్షేత్ర స్థాయిలో స్తంభించనున్నాయి. తిరిగి కొత్త రాష్ట్రంలో నూతన మార్గదర్శకాలు వెలువడిన తర్వాతే లావాదేవీలు ప్రారంభం కానున్నాయి. శాఖల కుదింపు కొత్త రాష్ట్రాలు ఏర్పడనున్న నేపధ్యంలో హెడ్అకౌంట్లతోపాటు కొన్ని శాఖల పద్దులను కుదించే అవకాశం ఉందని ట్రెజరీ వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో మంజూరై ప్రస్తుతం జరుగుతున్న పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపులుకూడా రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తయిన తర్వాతే పునః ప్రారంభయ్యే అవకాశం ఉందని అధికారులు స్పష్టంచేస్తున్నారు. ఇందులో భాగంగా ట్రెజరీ శాఖకు సంబంధించిన సర్వర్లను కూడా పూర్తిగా లాక్ చేస్తున్నట్లు సమాచారం. చెల్లింపులు పూర్తి జిల్లాలో ఉద్యోగుల జీతభత్యాలు, అన్ని రకాల బిల్లులకు సంబంధించి దాదాపు రూ. 100 కోట్లకు పైగా చెల్లింపులు జరిగాయి. మొత్తం చెల్లింపులకు సంబంధించి గడువు శనివారంతో ముగిసింది. బ్యాంకర్ల చెల్లింపులకు మాత్రం 26వ తేదీ వరకు గడువు ఉంది.మొత్తం పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ చేశాం. జూన్ 3వ తేదీన తిరిగి ఆర్థిక సేవలు ప్రారంభం కానున్నాయి. అంతవరకు ఎటువంటి లావాదేవీలు జరగవు. - రంగప్ప, ట్రెజరీ డీడీ -
లాకప్పా.. లాకరా
ఈ ఫొటోలో ఉన్నది బద్వేలు పోలీస్‌స్టేషన్‌లోని లాకప్ గది. అక్కడ టేబుల్‌పై సీల్‌వేసిన ఒక బాక్స్ ఉంది కదూ.. అందులో అక్షరాలా రూ. 25 లక్షలు ఉన్నాయి. ఇదేమిటి లాకప్‌లో దొంగలు, నిందితులు ఉంటారు గానీ రూ.లక్షలు ఉంటాయా అని అనుకుంటున్నారా.. అవును నిజమే.. నెల కాదు రెండు నెలలు కాదు మూడేళ్లుగా రూ. 25 లక్షలు ఉన్న బాక్స్ లాకప్ గదిలోనే మగ్గుతోంది.శుక్రవారం ఈ బాక్స్‌ను కోర్టు స్వాధీనం చేసుకుంది. బద్వేలు, న్యూస్‌లైన్: బద్వేలు ట్రెజరీ కార్యాలయంలో కృష్టంరాజు అనే జూనియర్ అకౌంటెంట్ 2010లో విధులు నిర్వహించేవారు. పలువురు ఉద్యోగులకు చెందిన రుణాలు, పదవీ విరమణ సమయంలో వచ్చిన నగదును చాకచక్యంగా ఇతరుల అకౌంట్లకు మార్పు చేశాడు. కృష్ణంరాజు తల్లి ఈశ్వరి పెన్షనర్‌గా ట్రెజరీ నుంచి పెన్షన్ పొందుతుండేవారు. ఈమె అకౌంట్‌కు రూ.6.37లక్షలు, సుధ పేరుతో ఉన్న అకౌంట్‌కు రూ. 19.28 మళ్లించాడు. అనంతరం మొత్తం రూ.25.65 లక్షలను డ్రా చేసుకుని స్వాహా చేశాడు. ఐదారు నెలల అనంతరం ఈ విషయం బయటపడింది. దీనిపై ఉన్నతాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. విచారించిన పోలీసులు 2010 డిసెంబరులో నిందితుడు కృష్ణంరాజు నుంచి రూ.25.65లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఈశ్వరి, సుధలకు సంబంధం లేదని తేల్చి వారిని కేసు నుంచి తొలగించారు. పోలీసులు పంచాయతీ చేసి నిందితుడిని తప్పించేందుకు సహకరించారనే విమర్శలు ఉన్నాయి. నిందితుడిని విలేకరులకు కూడా చూపించకుండా జాగ్రత్త పడ్డారు. దాదాపు రూ.5లక్షలు చేతులు మారాయనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. నిందితుడితో పాటు నగదును కోర్టులో ప్రవేశపెట్టారు. పోలీస్‌స్టేషన్‌లోనే నగదు ఉంచాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఆ నగదుకు సీలు వేసి పట్టణ పోలీస్‌స్టేషన్‌లోని లాకప్‌లో ఉంచారు. నిందితుడు మాత్రం కేసు నుంచి తప్పించుకుని మళ్లీ ఉద్యోగంలో చేరినట్లు సమాచారం. కాగా బద్వేలు పోలీస్‌స్టేషన్‌లోని లాకప్‌లో మూడేళ్లుగా మూలుగుతున్న రూ.25లక్షల నగదు శుక్రవారం కోర్టుకు చేరింది. కోర్టు ఆదేశాల మేరకు స్థానిక స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియాలోని ప్రభుత్వ ఖాతాలో దీనిని జమ చేశారు.