‘పెద్ద’రికం కోసం ఇంటిపోరు | local leaders figthing for rajya sabha seat | Sakshi
Sakshi News home page

‘పెద్ద’రికం కోసం ఇంటిపోరు

Jan 25 2014 2:32 AM | Updated on Sep 2 2017 2:57 AM

పెద్దల సభ (రాజ్యసభ)కు వెళ్లేందుకు తహతహలాడుతున్న అధికార, ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఇంటిపోరుతో సతమతమవుతున్నారు.

  కాంగ్రెస్ నుంచి నాలుగో అభ్యర్థిగా పోటీకి సై అంటున్న చైతన్యరాజు
  అదే అవకాశాన్ని ఆశిస్తున్న మంత్రి గంటా శ్రీనివాసరావు  
  తెలుగుదేశం నుంచి బరిలో దిగాలనుకుంటున్న చిన రాజప్ప
  అదే పార్టీ నుంచి ముచ్చట పడుతున్న మాజీ మంత్రి మెట్ల
 
 సాక్షి ప్రతినిధి, కాకినాడ : పెద్దల సభ (రాజ్యసభ)కు వెళ్లేందుకు తహతహలాడుతున్న అధికార, ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఇంటిపోరుతో సతమతమవుతున్నారు. విభజన నిర్ణయాన్ని తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానంపై తిరుగుబాటు అభ్యర్థిగా బరిలోకి దిగాలనుకున్న ఎమ్మెల్సీ చైతన్యరాజుకు  పొరుగునున్న విశాఖ జిల్లాకు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు నుంచి పోటీ ఏర్పడింది. ఈ పోటీలో చివరకు ఎవరు బరిలో నిలుస్తారనేది జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.  రాష్ట్ర శాసనసభలో ఉన్న సంఖ్యాబలం ఆధారంగా కాంగ్రెస్ నుంచి ముగ్గురు రాజ్యసభకు ఎన్నికవడం ఖాయం. ఎటొచ్చీ ఉత్కంఠను రేకెత్తిస్తున్న నాలుగో సీటుపైనే అందరి చూపూ కేంద్రీకృతమైంది. ఆ నాలుగో స్థానం కోసం అధిష్టానాన్ని సైతం ధిక్కరించి మరీ బరిలోకి దిగాలనుకుంటున్న చైతన్యరాజుకు  ఇప్పటికే జేసీ దివాకరరెడ్డి అడ్డుపడుతుండగా, కొత్తగా గంటా తెరపైకి రావడంతో బరిలో ఉంటామంటున్న ముగ్గురిలో చివరకు ఎవరు మిగులుతారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
 
 రాజ్యసభ బరిపైకి గంటా రాకముందు వరకు ఆయన సొంత జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చింతలపూడి వెంకట్రామయ్య, అవంతి శ్రీనివాస్, పంచగర్ల రమేష్, కన్నబాబు తదితరుల నుంచి చైతన్యరాజు మద్దతుపై హామీ పొందారని తెలిసింది. తీరా ఇప్పుడు గంటా బరిలోకి రావడంతో చైతన్యరాజుకు మద్దతు విషయంపై ఆ జిల్లా ఎమ్మెల్యేలు పునరాలోచనలో పడ్డారంటున్నారు. గంటాతో పాటు వారంతా కలిసి ఒక జట్టుగా ఉండటం, సామాజిక, ప్రాంతీయ సమతూకాల నేపథ్యంలో చైతన్యరాజుకు మద్దతు ఇవ్వడం కష్టమని జిల్లా నేతలు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించే ముగ్గురు అభ్యర్థులకు పోలయ్యే ఓట్లు తీసేయగా మిగిలే ఓట్లతో పాటు ‘ఆత్మప్రబోధానుసారం’ తెచ్చుకోగలిగే ఓట్లు, ఇతర పార్టీల్లోని రెండో ప్రాధాన్య ఓటింగ్‌పై చైతన్యరాజు దృష్టి పెట్టినటు ఆయన అనుచరులు చెబుతున్నారు. జిల్లా నుంచి పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే చైతన్యరాజుకు లోపాయికారీగా మద్దతు ఇచ్చారని చెబుతున్నారు. కొందరు ఎమ్మెల్యేలైతే బేరసారాలకు కూడా తెర తీశారని విశ్వసనీయంగా తెలిసింది. సమైక్యాంధ్ర నినాదంతో బరిలోకి దిగుతున్నానని, జిల్లా ఎమ్మెల్యేలంతా సహకరిస్తున్నారని చైతన్యరాజు నమ్మకంగా చెబుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో కూడా ఇదేరకంగా చైతన్యరాజు సంప్రదింపులు జరుపుతున్నారు. ఆయన ప్రయత్నాలు ఫలిస్తాయనుకుంటేనే బరిలోకి దిగుతారంటున్నారు. ఈ విషయం తేలాలంటే మరో నాలుగు రోజులు (నామినేన్‌ల దాఖలుకు గడువు ఈ నెల 28) నిరీక్షణ తప్పదని అంటున్నారు.
 
 ‘దేశం’లోనూ ఆశావహులు ఎక్కువే
 అధికార కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి ఇలా ఉండగా తెలుగుదేశంలోనూ సీటు కోసం పోటీ నెలకొంది. అందరికంటే ముందుగా మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు పోటీకి సై అంటూ పార్టీ అధినేత చంద్రబాబును కూడా కలిసి వచ్చారు. కాగా చిక్కాల సామాజికవర్గం నుంచే జిల్లా పార్టీ అధ్యక్షుడు నిమ్మకాయల చినరాజప్ప బరిలోకి దిగాలని ఆశిస్తున్నారు. పార్టీకి రికార్డు స్థాయిలో 18 సార్లు జిల్లా అధ్యక్షుడిగా పనిచేయడంతో చంద్రబాబు సానుకూలత వ్యక్తం చేస్తారనే ఆశాభావంతో ఉన్నారు. పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం బీసీల్లో శెట్టిబలిజ సామాజికవర్గం నుంచి అవకాశం లభిస్తుందని ఆశిస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్ స్థాయిలో ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మరోవైపు మాజీ మంత్రి డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు కూడా పెద్దల సభకు వెళ్లాలని ఆశిస్తున్నారు. కోనసీమలో పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న తనకు ఈ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement