
‘బెల్ట్’కు బదులు సర్కారీ కిక్
‘నీ ఎడమ చేయిని తీయి.. నా పుర్ర చేతిని వాడతా’ అన్నట్టుంది ప్రభుత్వ నిర్వాకం. మా కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న బెల్టుషాపులను తొలగించండి
ఏలూరు రూరల్ : ‘నీ ఎడమ చేయిని తీయి.. నా పుర్ర చేతిని వాడతా’ అన్నట్టుంది ప్రభుత్వ నిర్వాకం. మా కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న బెల్టుషాపులను తొలగించండి ‘బాబూ’ అని మహిళలు ఆందోళన చేస్తుంటే.. వాటి స్థానంలో తానే మద్యం దుకాణాలను తెరిచి పేదల ఆరోగ్యాలతో వ్యాపారం చేస్తానంటోంది. జిల్లాలో బాగా ఆదాయం వస్తున్న ఎనిమిది బెల్టుషాపులను గుర్తించి వాటిని టేకోవర్ చేసుకోవడానికి సిద్ధమైంది. మరోపక్క బెల్టుషాపులను పూర్తిగా అరికట్టకపోవడంతో గ్రామాల్లో యథేచ్ఛగా అమ్మకాలు సాగుతున్నాయి.
ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు బెల్ట్‌షాపులు ఎత్తేస్తానని చెప్పిన మాటల అంతరార్థం ఇప్పుడు తెలుస్తోంది. గ్రామాల్లో బెల్ట్‌షాపుల స్థానంలో సర్కారీ మద్యం దుకాణాలు వెలుస్తున్నాయి. ఇళ్ల ముందు వెలసిన బెల్ట్‌షాపుల కారణంగా మా కుటుంబాలు ఛిద్రమౌతున్నాయని మహిళలు ఆందోళన చేశారు. వీరి అందోళనను ఓట్లుగా మలుచుకునేందుకు చంద్రబాబునాయుడు ఎన్నికల్లో బెల్ట్‌షాపులు ఎత్తేస్తానని హామీ ఇచ్చారు. నమ్మిన మహిళలు ఓట్లు వేశారు. అధికారం హస్తగతం చేసుకున్న చంద్రబాబు బెల్ట్‌షాపులను తొలగించకపోగా వాటిని ప్రభుత్వ మద్యం దుకాణాలుగా మార్చుతున్నారు. మరోపక్క బెల్ట్‌షాపులు యథేచ్ఛగా నడు స్తూ పేదల కష్టాన్ని దోచుకుంటున్నాయి.
ప్రభుత్వ దుకాణం పేరుతో బెల్ట్‌షాపు
ఇప్పటి వరకూ పూరిపాకలు, కిళ్లీకొట్టుల్లో దొంగచాటుగా నడిచిన బెల్ట్‌షాపులు ఇప్పుడు విచ్చలవిడిగా అమ్మకాలు సాగించేందుకు సిద్ధమౌతున్నాయి. జిల్లాలో లక్షలాది పేద కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న బెల్ట్‌షాపులను అధికారులు గుర్తించారు. ప్రాంతాల వారీగా బెల్ట్‌షాపుల ఆదాయాన్ని లెక్కగట్టారు. ఈ ఆదాయం ప్రభుత్వానికి వచ్చేలా చేసి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వద్ద మార్కులు కొట్టేయాలని నిర్ణయించారు.
అనధికారికంగా 8 షాపులు
జిల్లాలో ఇప్పటికే రోజుకి సుమారు రూ. 50 వేల ఆదాయం వచ్చే ఎనిమిది బెల్ట్‌షాపులను గుర్తించారు. ఇవన్నీ పేదల కష్టార్జితాన్ని దోచుకుంటున్నవే. రెక్కాడితే గాని డొక్కాడని పేదల రోజువారీ కూలీలో 80 శాతానికి పైగా ఈ బెల్ట్‌షాపుల నిర్వాహకులు దోచుకుంటున్నారు. జిల్లాలో ఇప్పటికే 8 ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు చేసేందుకు ఎక్సైజ్ అధికారులు ప్రయత్నాలు చేపట్టారు. ఈ షాపులకు టెండర్లు పిలిచారు. టెండర్లు రానిచోట అధికారులే షాపులు ఏర్పాటు చేస్తున్నారు. ఏలూరు మండలంలో చాటపర్రు, బూరాయిగూడం, మల్కాపురంలో మూడు బెల్ట్‌షాపులను ప్రభుత్వ దుకాణాలుగా మార్పు చేశారు.
తిరగబడుతున్న మహిళలు
బెల్ట్‌షాపుల స్థానే ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దుకాణాలు తొలగించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాలు ఇస్తున్నారు.