రాజధానికి కుచ్చుటోపి | limited funds Assigned in ap Capital Project | Sakshi
Sakshi News home page

రాజధానికి కుచ్చుటోపి

Mar 16 2017 5:21 AM | Updated on Aug 18 2018 3:49 PM

రాజధానికి కుచ్చుటోపి - Sakshi

రాజధానికి కుచ్చుటోపి

ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తాం అంటూ నిత్యం ఊదరగొడుతున్న రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో మాత్రం దానికి నామమాత్రపు

రూ.1,061 కోట్లు మాత్రమే కేటాయించిన ప్రభుత్వం
అరకొర నిధులతో రాజధాని ప్రాజెక్టులెలా?


అమరావతి: ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తాం అంటూ నిత్యం ఊదరగొడుతున్న రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో మాత్రం దానికి నామమాత్రపు నిధులు కూడా విదల్చలేదు. రూ.వేల కోట్లతో ప్రతిపాదనలు తయారు చేయిస్తూ చివరికి అందులో పది శాతం కూడా కేటాయించకపోవడం గమనార్హం. అమరావతిలో వివిధ ప్రాజెక్టులకు రూ.1,061 కోట్లు మాత్రమే కేటాయించారు. అవి ఏ మూలకూ సరిపోవని స్వయంగా ఆర్థిక మంత్రే తన ప్రసంగంలో పేర్కొన్నారు.

రాజధాని నిర్మాణం మాట అటుంచితే కనీసం భూములిచ్చిన రైతులకు కౌలు, పేదలకు పెన్షన్లు, లేఔట్ల రూపకల్పన వంటి వాటికి సైతం ఈ నిధులు సరిపోవు.  అమరావతి రాజధాని నగర అభివృద్ధి ప్రాజెక్టు కోసం రూ.500 కోట్లు కేటాయించారు. ఇవికాకుండా భవిష్యత్తు అవసరాల నిధి కోసం రూ.169 కోట్లు, భూసమీకరణ పథకానికి రూ.247 కోట్లు, పెన్షన్లకు రూ.70.5 కోట్ల కేటాయింపులు చేశారు. అమరావతి ప్రాజెక్టు కోసం రూ.75 కోట్లు కేటాయించారు.

రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకే ప్రతిఏటా రూ.140 కోట్ల కౌలు చెల్లించాల్సి ఉంది. 20 గ్రామాల్లో రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్ల లేఔట్ల నిర్మాణానికే రూ.200 కోట్లకుపైగా ఖర్చు కానుంది. రాజధాని పరిధిలో ఉన్న గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు భారీ స్థాయిలో నిధులు అవసరం. వివిధ ప్రాజెక్టుల కోసం నియమించుకున్న కన్సల్టెన్సీలకు రూ.50 కోట్లకుపైగానే చెల్లించాల్సి ఉంది. నిర్మాణంలో ఉన్న సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుకు రూ.400 కోట్లు, టెండర్లు ఖరారైన కీలకమైన ఏడు ఆర్టీరియల్, సబ్‌ ఆర్టీరియల్‌ రోడ్లకు రూ.2,000 కోట్లు కావాలనిఇటీవలే అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వ పరిపాలనా నగరం డిజైన్లు తయారు చేసిన లండన్‌కు చెందిన నార్మన్‌ ఫోస్టర్‌ కంపెనీకి రూ.67 కోట్లు చెల్లించాల్సి ఉండగా, దాని నిర్మాణానికి రూ.3,000 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంది.

హైదరాబాద్‌ రహదారికి రాజధానిని అనుసంధానం చేస్తూ కృష్ణానదిపై నిర్మించే ఐకానిక్‌ బ్రిడ్జికి రూ.800 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఇవికాకుండా భవనాల డిజైన్లు, వాటి నిర్మాణానికి భారీగా నిధులు కావాలని సీఆర్‌డీఏ ప్రతిపాదనలు తయారు చేసింది. వీటితోపాటు మిగిలిన రాజధాని ప్రాజెక్టులు, అక్కడి పనుల కోసం మొత్తం రూ.41,235 కోట్లు కావాలని, అందులో ఈ ఒక్క సంవత్సరమే రూ.5,468 కోట్లు అవసరమని సీఆర్‌డీఏ ఒక నోట్‌ తయారు చేసింది. రూ.వేల కోట్లు అవసరమైన రాజధానికి బడ్జెట్‌లో ప్రభుత్వం మొండిచేయి చూపడంపై సీఆర్‌డీఏ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.

►అమరావతి మెట్రో రైలు ప్రాజెక్టును కూడా ఇందులోనే కలిపి రూ.100 కోట్లు   కేటాయించారు.
► ఆర్భాటంగా స్మార్ట్‌ నగరాలను ప్రకటించినా వాటికి కేవలం రూ.150 కోట్లే కేటాయించారు.
►పట్టణాల్లో సౌకర్యాల మెరుగు కోసం గొప్పగా చెబుతున్న అమృత్‌ పథకానికి రూ.197.72 కోట్లు విదిల్చారు.
►మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో మురికివాడల అభివృద్ధి పథకమైన వెలుగు ప్రాజెక్టుకు ఈసారి కేటాయింపులు తగ్గించారు. రూ.2,691 కోట్లు ఇచ్చారు.
► జాతీయ పట్టణ జీవనధార్‌ మిషన్‌కు రూ.16 కోట్లు కేటాయించారు.
► చిన్న, మధ్య తరహా పట్టణాల అభివృద్ధికి అసలు కేటాయింపులే లేవు.
►మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ (మడ)కి చాలా తక్కువగా కేవలం రూ.50 కోట్లు విదిల్చారు.
► మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో జీతాలు, ఇతర అలవెన్సులకు రూ.909 కోట్లు కేటాయించారు.
►మున్సిపల్‌ పాఠశాలల్లో ప్రాథమికమైన వసతుల కల్పనకు అసలు నిధులే ఇవ్వలేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement