
అభిప్రాయం
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మే 22న నిర్వహించిన ప్రెస్ మీట్‌లో అమరావతి పేరుతో జరుగు తున్న ఆర్థిక దోపిడీని ఆధా రాలతో సహా వివరించారు. ఇప్పటి వరకూ రాజధానిగా ఎటువంటి చట్టబద్ధత లేని అమరావతి పేరుతో చంద్రబాబు సుమారు రూ. ఐదు వేల కోట్లు ఖర్చు చేశారు. దీని నిర్మాణానికి ఒక్క పైసా కూడా అవసరం లేదనీ, ఇదో సెల్ఫ్ ఫైనాన్స్‌స ప్రాజెక్టు అంటూ ఒకవైపు ప్రచారం చేస్తూనే మరో వైపు ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు నుంచి రూ. 15 వేల కోట్లు, హడ్కో నుంచి రూ. 11 వేల కోట్లు, జర్మన్ బ్యాంకు నుంచి రూ. 5 వేల కోట్లు, సీఆర్‌డీఏ బాండ్ల జారీ ద్వారా 21 వేల కోట్లు అప్పులు చేసి అమరావతికి ఖర్చు చేస్తున్నారు.
ఏడాది బడ్జెట్‌లో అమరావతి కోసం రూ. 6 వేల కోట్లు కేటాయించారు. దీనికి తోడు అమరావతి కోసం మరో 50 వేల ఎకరాలు సమీకరించబోతు న్నామనీ, దానికి మరో రూ. 77 వేల కోట్లు అవసర మవుతాయనీ ఆర్థిక సంఘానికి తెలియజేశారు. ఇప్పటికే రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతింది, పన్నుల రాబడులు తగ్గాయి. ఏడాది కాలంలోనే లక్షా 50 వేల కోట్ల రూపాయల రుణాలు చేసి దేశంలోనే అప్పుల్లో అగ్రస్థానంలో ఏపీని నిలిపారు బాబు. అమరా వతిలో ఇప్పటికీ భూ సమీకరణ పూర్తి చేయలేక పోయారు. రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారంటూ ఇప్పటికీ తప్పుడు ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. నిజానికి ఇంకా 20 శాతం మంది రైతులు తమ భూములను సీఆర్‌డీఏకు అప్పగించి రిటర్నబుల్ ప్లాట్స్ పొందలేదు. రాష్ట్రం ఏమైపోయినా సరే తాము మాత్రం అమరావతిపై లక్షల కోట్లు కుమ్మరిస్తామంటున్నారు.
ఒక రాజధాని నగరాన్ని నిర్మించడం ఎంత కష్టమో ‘అటల్ నగర్– నవ రాయ్‌పూర్’ను చూస్తే అర్థమవుతుంది. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం 2006 నుంచి 20 వేల ఎకరాల్లో ఈ నగరాన్ని నిర్మించడానికి ఆప సోపాలు పడుతోంది. 41 గ్రామాల నుంచి సేకరించిన ఈ భూమిలో నిర్మాణాలు ప్రారంభించి 19 ఏళ్లయినా ఇప్పటికీ నగర నిర్మాణం పూర్తి కాలేదు. చంద్రబాబు మాత్రం లక్ష ఎకరాల్లో మహా నగరం నిర్మిస్తానంటూ ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కూడా అటల్ నగర్ నిర్మాణ విషయంలో ఎంతో ఆర్భాటం చేసింది.
ఇది ప్రపంచంలో మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ గ్రీన్ ఫీల్డ్ సిటీ అనీ, దేశంలో ప్రణాళికాబద్ధంగా నిర్మించిన ఆరో నగరమనీ, దేశంలో మొదటి జీరో వాటర్ డిశ్చార్జ్ సిటీ అనీ, 24 గంటల నిరంతరాయ విద్యుత్ సరఫరా చేస్తామనీ ప్రచారం చేశారు. చిన్న పిల్లలకు ఉచితంగా చికిత్స అందించే దేశంలోని అతిపెద్ద శ్రీసత్యసాయి సంజీవిని ఆస్పత్రి, ప్రపంచంలో నాల్గో అతి పెద్ద క్రికెట్ స్టేడియం, నాలుగు జాతీయ విద్యా సంస్థలు, పది కిలోమీటర్ల దూరంలోనే ఎయిర్ పోర్ట్, సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్, జెమ్స్ అండ్ జ్యూయలరీ సెంటర్, జూ, సఫారీ, గోల్ఫ్ విలేజ్, మ్యూజియం, బొటానికల్ గార్డెన్ , ఫిల్మ్ సిటీ, 5 స్టార్ హోటల్స్ ఏర్పాటు చేశారు. ఇన్ని ఏర్పాటు చేశామని చెబు తున్నప్పటికీ ఇది ఒక ఘోస్ట్ సిటీగా మారింది. 5.36 లక్షల జనాభా అవసరాల కోసం నిర్మించిన ఈ నగరంలో ప్రస్తుతం రెండు లక్షల 50 వేల మంది మాత్రమే నివసిస్తున్నారు. నగర జనాభా 5.36 లక్షలకు చేరాలంటే 2031 వరకూ వేచి చూడాల్సిందే అంటున్నారు నయా రాయ్‌పూర్ డెవలప్‌మెంట్ అధారిటీ అధికారులు.
ఎంత ప్రచారం చేసినా, ఎన్ని సదుపాయాలు కల్పించినా, అనేక రాయితీలు ప్రకటించినా నవ రాయ్‌పూర్‌కు పెట్టుబడులు రావడం లేదు, ఉపాధి కల్పన లేదు. ప్రజలు కూడా ఇక్కడ స్థిరపడటానికి ఆసక్తి చూపడం లేదు. రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవడం లేదు. 2022–23 లెక్కల ప్రకారం విజయవాడ, గుంటూరు నగరాల జీడీపీ విలువ రూ. 1,467 కోట్లు కాగా, విశాఖపట్నం జీడీపీ విలువ రూ.1,867 కోట్లు. వేలాది కోట్ల వ్యయంతో నిర్మించిన నవరాయ్‌పూర్ జీడీపీ కేవలం రూ. 270 కోట్లు. పక్కనే ఉన్న రాయ్‌పూర్ జీడీపీ రూ. 750 కోట్లు. నగర నిర్మాణం పేరుతో చేసిన అప్పులు తీర్చడానికి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం తంటాలు పడుతోంది.
ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవల 16వ ఫైనాన్స్ కమిషన్ సభ్యులను కలిసి రూ.4,131 కోట్లు ప్రత్యేక గ్రాంట్‌గా ఇవ్వాలని కోరారు. నూతన నగరాలను నిర్మించాలనుకునే వారికి ఇది ఒక హెచ్చరిక. నగర నిర్మాణాల ద్వారా సంపదను సృíష్టించవచ్చని చంద్ర బాబు అంటున్నారు. ఇది నిజం కాదని నవ రాయ్ పూర్ రుజువు చేస్తోంది.
అంతే కాదు, చైనాలో కొత్తగా నిర్మించిన అనేక నగరాలు, మలేషియా నిర్మించిన ఫారెస్ట్ సిటీ, పరిపాలనా నగరం ‘పుత్రజయ’ కూడా నిర్మానుష్య నగరాలుగా మారాయి. ఈ నగరాలు సంపద సృష్టించకపోగా అప్పులు, నిరర్థక ఆస్తులు మిగి ల్చాయి. ఇదే పరిస్థితి అమరావతికి ఏర్పడినా ఆశ్చర్య పోనక్కర లేదు!
వి.వి.ఆర్. కృష్ణంరాజు
వ్యాసకర్త ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్
ప్రెసిడెంట్ ‘ 89859 41411