
రాజధాని మలి విడత భూసమీకరణపై ఏం చేద్దాం?
ప్రజా వ్యతిరేకతతో మంత్రివర్గంలో నిర్ణయం వాయిదా
వైఎస్ జగన్ పర్యటనలకు భారీగా ప్రజలు రావడంపైనా చర్చ
అడ్డుకుంటున్నా అంతమంది ఎలా వస్తున్నారని అసహనం
మంత్రులపై ముఖ్యమంత్రి చంద్రబాబు రుసరుసలు
ప్రజలను మేనేజ్ చేయలేనివారికి పదవులు ఎందుకు?
ఇలాగైతే మార్చేస్తానని హెచ్చరికలు..
వైఎస్ జగన్ పర్యటనలు, వైఎస్సార్‌సీపీ నేతల మాటలను వివాదం చేయాలని సూచన
వైఎస్ జగన్‌ను సరిగా ఎదుర్కొనలేకపోతున్నారని మండిపాటు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి మలి విడత భూ సమీకరణపై తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఏం చేయాలనేదానిపై బుధవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో తర్జనభర్జనలు పడినట్లు తెలిసింది. వాస్తవానికి ఈ భేటీలోనే.. మలి విడత కింద 20 వేల ఎకరాలకు పైగా సమీకరణకు ఆమోదం తెలపాల్సి ఉంది. దీనికి కార్యరంగం సిద్ధమైంది. మున్సిపల్ మంత్రి నారాయణ సైతం భూ సమీకరణకు రైతులు సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు.
అయితే, రాజధాని రైతుల్లోనే ఆందోళన రావడం, తొలి విడత సమీకరణ చేసిన గ్రామాల్లో ఇంకా ఎలాంటి సౌకర్యాలు కలి్పంచకుండా, భూములిచ్చిన రైతులకు ప్లాట్లు తిరిగివ్వకుండా రెండో విడత సమీకరణ ఏమిటనే వాదన మొదలైంది. మలి విడత సమీకరణ ద్వారా రియల్ ఎస్టేట్ కోసమే చంద్రబాబు రాజధాని కడుతున్నారని ప్రస్ఫుటం అవుతోందని ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతుండటంతో ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు తెలిసింది. అందుకే భూ సమీకరణకు ఆమోదం తెలపకుండా.. మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి, అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాగా, రాజధాని మలి విడత భూ సమీకరణపై మంత్రుల కమిటీ రైతులతో మరింత సమగ్రంగా చర్చించడంతో పాటు ఎందుకు ఈ సమీకరణ చేస్తున్నదీ వివరించిన తరువాత ప్రతిపాదనలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచార శాఖ మంత్రి కె.పార్థసారథి మంత్రివర్గ సమావేశం అనంతరం చెప్పారు.
దీంతోనే మలి విడత భూ సమీకరణపై ప్రభుత్వం పునరాలోచనలో పడిందని తేలిపోయింది. ఇదంతాచూస్తే.. రాజధాని భూ సమీకరణలో ముందుకెళ్లాలని నిర్ణయించినా ప్రజా వ్యతిరేకత దృష్ట్యా చంద్రబాబు పునరాలోచనలో పడినట్లు సమాచారం. అలాగే ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం కరేడులో సోలార్ ప్రాజెక్టు కోసం 8 వేల ఎకరాలను తీసుకోవడంపైనా మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. ఈ అంశంపై ప్రభుత్వంపై విమర్శలు ఎక్కువయ్యాయని, మనం తప్పు చేస్తున్నట్లు స్పష్టమైందని, ప్రజలు దీనిపైనే మాట్లాడుకుంటున్నారని మంత్రులు అన్నట్లు సమాచారం.
దేనిపైనా సరిగా స్పందించడం లేదు
వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటనకు భారీగా ప్రజలు తరలిరావడంతో చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అన్ని ఆంక్షలు పెట్టినా అంతమంది ఎలా వచ్చారంటూ మంత్రులపై కోపం చూపించినట్లు తెలిసింది. మంత్రులు సరిగా పనిచేయడంలేదని, దేనిపైనా సరిగా స్పందించడం లేదని మండిపడ్డారని సమాచారం. తోతాపూరి మామిడి కొనుగోలులో సంబంధిత శాఖల మంత్రులు బాధ్యతగా వ్యవహరించలేదని, ఇలాగైతే మంత్రులను మార్చేస్తానని కూడా హెచ్చరించినట్లు సమాచారం.
పనిచేయనివారి స్థానంలో కొత్త వారిని పెడతానని అన్నట్లు తెలిసింది. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి విషయంలోనూ మంత్రులు చురుగ్గా వ్యవహరించలేదని, ఈ వ్యవహారంపై విచారణ జరిపిస్తామని చెప్పారు. ఏడాదిలో ఎన్నో అద్భుతాలు చేసినా మంత్రులు ప్రజలకు చెప్పలేకపోతున్నారని, ప్రజలను మేనేజ్ చేయలేని వారికి పదవులు ఎందుకని అన్నట్లు తెలిసింది. వైఎస్ జగన్‌ను నిలువరించడంలో మంత్రులు విఫలం అవుతున్నారని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇండోసోల్ భూముల విషయంలో వైఎస్ జగన్ వైఖరిపై మంత్రులు ఎవరూ సరిగా స్పందించలేదని అందువల్లే కూటమి ప్రభుత్వం తప్పు చేసినట్లు జనంలోకి వెళ్లిందని అన్నట్లు సమాచారం. వైఎస్ జగన్ పర్యటనలు, వైఎస్సార్‌సీపీ నేతలు మాట్లాడుతున్న అంశాలను వివాదాస్పదం, డైవర్షన్ చేయడంపై దృష్టిపెట్టాలని పరోక్షంగా సూచనలు చేసినట్లు తెలిసింది.