
నాలుగు అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణం
సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్‌డీఏ సమావేశంలో నిర్ణయం
రాజధాని నిర్మాణాల కోసం ఇసుక డిసిల్టేషన్‌కు అనుమతి
హైడెన్సిటీ రెసిడెన్షియల్ జోన్‌కు ఆమోదం
అమరావతిలో అల్లూరి, అమరజీవి స్మారక చిహ్నాలు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి పరిధిలో మరో 20,494 ఎకరాల భూసమీకరణకు సీఆర్‌డీఏ అథారిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పల్నాడు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురం, పెదమద్దూరు, యండ్రాయి, కార్లపూడి, గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని వడ్డమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమి గ్రామాల్లో భూసమీకరణకు ఆమోదం తెలిపింది. శనివారం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్‌డీఏ 50వ సమావేశం జరిగింది. ఏడు అంశాలను సీఆర్‌డీఏ అథారిటీ ఆమోదించింది.
మందడం, రాయపూడి, పిచుకలపాలెంలలో ఫైనాన్స్, స్పోర్ట్స్ సిటీల్లోని దాదాపు 58 ఎకరాల్లో హైడెన్సిటీ రెసిడెన్షియల్ జోన్, మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణానికి ఆర్‌ఎఫ్‌పీ(ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదన)ను ఆహ్వానించేందుకు అనుమతి ఇచ్చింది. రాజధానిలో నిర్మించే ఫైవ్ స్టార్ హోటళ్లకు సమీపంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కన్వెన్షన్ సెంటర్లు నిర్మించే ప్రతిపాదనలను అథారిటీ ఆమోదించింది. మందడంలో వివాంతా, హిల్టన్ హోటల్స్, తుళ్లూరులో హయత్ రీజెన్సీ, లింగాయపాలెం నోవోటెల్ సమీపంలో ఈ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి 2.5 ఎకరాల చొప్పున కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.
రాజధాని నిర్మాణ పనులకు కృష్ణా నది నుంచే ఇసుకను డ్రెడ్జింగ్ ద్వారా తీసుకునేందుకు సీఆర్డీఏకి అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం రాజధానిలో రూ.49,040 కోట్ల విలువైన పనులు జరుగుతున్న నేపథ్యంలో.. అవసరమైన ఇసుకను ప్రకాశం బ్యారే జీ ఎగువన డిసిల్టింగ్ ద్వారా సమకూర్చుకోవడానికి అనుమతి ఇవ్వాలని జలవనరుల శాఖను సీఆర్డీఏ కోరింది. ఇసుక డిసిల్టేషన్ ప్రక్రియకు రూ.286 కోట్లు అవుతుందని అధికారులు తెలిపారు. వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రుల సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలకూ సీఆర్‌డీఏ ఆమోదం తెలిపింది.
సీబీఐ(సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్)కి 2 ఎకరాలు, జీఎస్‌ఐ(జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా)కి 2 ఎకరాలు, స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు 5 ఎకరాలు, ఆంధ్రప్రదేశ్ కో–ఆపరేటివ్ బ్యాంక్‌కు 0.495 ఎకరాలు, పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీకి 12 ఎకరాలు, ఎంఎస్‌కే ప్రసాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీకి 12 ఎకరాలు కేటాయించింది.
ఆదాయ పన్ను శాఖకు 2 ఎకరాలు, ఏపీ గ్రామీణ బ్యాంక్‌కు 2 ఎకరాలు, సెంట్రల్ బ్యాంక్‌కు 0.40 ఎకరాలు, ఎస్‌ఐబీకి 0.50 ఎకరాలు, బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్‌కు 0.50 ఎకరాలు, కిమ్స్ ఆస్పత్రి, మెడికల్ కళాశాలకు 25 ఎకరాలు, బీజేపీకి 2 ఎకరాలు, బాసిల్ వుడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు 4 ఎకరాలు కేటాయించింది. గెయిల్, అంబికా గ్రూప్‌కు గతంలో కేటాయించిన 1.40 ఎకరాలను రద్దు చేసింది. మంగళగిరి సమీ పంలో ఈ–15 రహదారిపై నాలుగులేన్ల ఆర్వోబీ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. అల్లూరి సీతారామ రాజు, పొట్టి శ్రీరాములు స్మారక చిహ్నాల ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.