
సీఆర్‌డీఏ ఆఫీసు, మున్సిపల్ శాఖ నాలుగు పీఈబీ షెడ్ల కోసం విచ్చలవిడిగా ఖర్చు
సీఆర్‌డీఏ భవన నిర్మాణ వ్యయం రూ.335.36 కోట్లు.. చ.అడుగుకు ఏకంగా రూ.8,616.64
మున్సిపల్ శాఖకు చెందిన మూడు షెడ్ల పనులు ఇప్పటికే రూ.28.69 కోట్లతో ఎన్‌సీసీకి కట్టబెట్టిన సీఆర్‌డీఏ
షెడ్ల ఆర్కిటెక్చరల్ ఫినిషింగ్ వర్క్స్, విద్యుదీకరణ, ప్లంబింగ్ పనులూ రూ.40.35 కోట్లకు ఎన్‌సీసీకే
తాజాగా 37,200 చ.అడుగుల నిర్మిత ప్రాంతంలో నాలుగో షెడ్ల నిర్మాణ పనులకు టెండర్
నాలుగు షెడ్ల కాంట్రాక్టు విలువ రూ.134.59 కోట్లు
సీఆర్‌డీఏ భవనం, నాలుగు పీఈబీ షెడ్ల కోసం రూ.469.95 కోట్లు వెచ్చిస్తున్న వైనం
సచివాలయం, హెచ్‌వోడీల కోసం 52,20,496 చ.అడుగుల నిర్మిత ప్రాంతంతో నిర్మించే ఐదు భవనాల్లో మున్సిపల్ శాఖకు స్థలం కేటాయింపు
ఆ భవనాలు పూర్తయితే సీఆర్‌డీఏ భవనం, నాలుగు పీఈబీ షెడ్లకు చేసిన వ్యయం వృథానే అంటున్న అధికార వర్గాలు
అధిక వడ్డీలకు అప్పు తెచ్చిన నిధులు దుబారా చేస్తారా?
రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇచ్చే పనులు చేపట్టాల్సింది పోయి కమీషన్ల కోసం పనులు చేపడుతున్నారంటూ సర్వత్రా విమర్శలు
సాక్షి, అమరావతి: అమరావతిలో రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) కార్యాలయ భవనం, దానిపక్కనే మున్సిపల్ శాఖ విభాగాల (ఏపీయూఎఫ్‌ఐడీసీ, ఏపీ టిడ్కో, స్వచ్ఛాంద్ర కార్పొరేషన్, ఏపీయూజీబీసీ ఆఫీసు, ఏపీ రెరా అప్పిలేట్ అథారిటీ, డీటీసీపీ, రెరా ఆఫీసులు, మెప్మా, ఇతర విభాగాలు) కోసం పీఈబీ (ప్రీ–ఇంజనీర్డ్ బిల్డింగ్) పద్ధతిలో ఇప్పటికే మూడు షెడ్ల నిర్మాణ పనులను కాంట్రాక్టర్లకు ప్రభుత్వం అప్పగించింది.
తాజాగా సీఆర్‌డీఏ భవనానికి ఫర్నిచర్, ఇంటీరియర్స్, ఇతర పనులకు రూ.72.69 కోట్ల కాంట్రాక్టు విలువతో సీఆర్‌డీఏ శనివారం స్వల్పకాలిక టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. సీనరేజీ, జీఎస్టీ లాంటి పన్నుల రూపంలో రూ.20.71 కోట్లు రీయింబర్స్ చేస్తామని పేర్కొంది.
మున్సిపల్ శాఖ నిర్మాణాలకు విపరీత ఖర్చు..
ఇక మున్సిపల్ శాఖ విభాగాల కోసం 37,200 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో నాలుగో షెడ్డు నిర్మాణంతోపాటు ఇప్పటికే నిర్మిస్తున్న మూడు షెడ్లకు ఫర్నిచర్, సోలార్ ఫ్యానల్స్, బయట అభివృద్ధి పనులు చేపట్టడానికి రూ.49.63 కోట్ల అంచనా వ్యయంతో శనివారం సీఆర్‌డీఏ స్వల్పకాలిక టెండర్ నోటిపికేషన్ జారీ చేసింది. పన్నుల రూపంలో అదనంగా రూ.15.92 కోట్లు ఇస్తామంది. దీంతో సీఆర్‌డీఏ భవనం, మున్సిపల్ శాఖ కార్యాలయాల కోసం నాలుగు షెడ్ల నిర్మాణం కోసం రూ.469.95 కోట్ల వ్యయంతో పనులను కాంట్రాక్టర్లకు అప్పగించింది.
మరో వైపు అమరావతిలో వెలగపూడి వద్ద రూ.1,151 కోట్ల వ్యయంతో 6 లక్షల చ.అడుగుల నిర్మిత ప్రాంతంతో 2016లో తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించిన ప్రభుత్వం.. శాశ్వత సచివాలయం, హెచ్‌వోడీ కార్యాలయాల కోసం 52,20,496 చ.అడుగుల నిర్మిత ప్రాంతంలో ఐదు భారీ భవనాల నిర్మాణ పనులను రూ.4,688.82 కోట్లకు ప్రభుత్వం కాంట్రాక్టర్లకు ఇప్పటికే అప్పగించింది. అందులో మున్సిపల్ శాఖ కార్యాలయాల కోసం భారీగా స్థలం కేటాయించింది.
ఆ భవనాలు పూర్తయితే.. ఇప్పుడు నిర్మిస్తున్న సీఆర్‌డీఏ కార్యాలయం, మున్సిపల్ శాఖ కోసం నాలుగు పీఈబీ షెడ్లు వృథాగా మారుతాయని.. వాటి కోసం చేసే వ్యయం రూ.469.85 కోట్లు.. తాత్కాలిక సచివాలయం కోసం చేసిన వ్యయం రూ.1,151 కోట్లు మాదిరిగానే వృథా అవుతాయని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
అధిక వడ్డీలకు అప్పుగా తెచ్చిన నిధులను భారీ ఎత్తున వృథా చేస్తూ రాష్ట్రంపై తీవ్ర ఆర్థిక భారం మోపుతున్నారంటూ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూ సమీకరణ సమయంలో రైతులకు హామీ ఇచ్చిన విధంగా అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇచ్చేందుకు వీలుగా పనులు పూర్తి చేయకుండా కమీషన్ల కోసం షెడ్ల నిర్మాణ పనులు చేపడుతున్నారంటూ సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సీఆర్‌డీఏ భవనంలోనే కమాండ్ కంట్రోల్ ఆఫీసు, ఐదు భారీ మీటింగ్ హాళ్లు, సీఆర్‌డీఏ కార్యాలయం కోసం మూడు ప్లోర్లు, ఏడీసీఎల్ ఆఫీసు, సీడీఎంఏ ఆఫీసు, రెరా ఆఫీసు, డీటీసీపీ ఆఫీసు, పబ్లిక్ హెల్త్ ఈఎన్‌సీ ఆఫీసు, మున్సిపల్ శాఖ మంత్రి, శాఖ ముఖ్య కార్యదర్శి కార్యాలయాల కోసం స్థలం కేటాయించారు. మిగిలిన విభాగాల కోసం సీఆర్‌డీఏ ఆఫీసుకు సమీపంలోనే పీఈబీ పద్ధతిలో మూడు షెడ్ల నిర్మాణ పనులను మార్చి 29న రూ.28.69 కోట్లకు కాంట్రాక్టు సంస్థ ఎన్‌సీసీకి అప్పగించారు.
ఆ మూడు షెడ్లకు ఆర్కిటెక్చరల్ ఫినిషింగ్ పనులు, విద్యుదీకరణ, ప్లంబింగ్ పనులను ఎన్‌సీసీకే రూ.40.35 కోట్లకు అప్పగించారు. తాజాగా నాలుగో షెడ్డు నిర్మాణంతోపాటు ఇప్పటికే నిర్మిస్తున్న మూడు షెడ్లకు ఫర్నిచర్, సోలార్ ఫ్యానల్స్, బయట అభివృద్ధి పనులు చేపట్టేందుకు పన్నులతో కలిపి రూ.65.55 కోట్ల కాంట్రాక్టు విలువతో సీఆర్‌డీఏ స్వల్ఫకాలిక టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీన్ని బట్టి నాలుగు షెడ్ల కోసమే ఏకంగా రూ.134.59 కోట్లు వ్యయం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.
జీ+1 నుంచి జీ+7 స్థాయికి సీఆర్‌డీఏ కార్యాలయం విస్తరణ..
» రాజధానిలో సీఆర్‌డీఏ కార్యాలయ భవనం నిర్మాణ పనులకు తొలుత జీ+1 పద్ధతిలో 55,600 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో.. జీ+7 అంతస్తులతో భవనాన్ని నిర్మించేలా పునాది, డిజైన్ పనులకు రూ.39.80 కోట్ల అంచనాతో 2017, అక్టోబర్ 21న టెండర్లు పిలిచారు. ఆ పనులను 0.27 శాతం తక్కువకు అంటే రూ.39.69 కోట్లకు కోట్ చేసి ఎల్–1గా నిలిచిన ప్రీకా సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకుంది. ఇందులో 2019, మే నాటికే రూ.17.12 కోట్ల విలువైన పనులు పూర్తి చేసింది.
» ఆ తర్వాత జీ+1 నిర్మిస్తున్న భవనంపై అదనంగా ఆరు అంతస్తులు నిర్మించే పనులకు రూ.43.35 కోట్ల అంచనా వ్యయంతో 2018, మే 14న టెండర్లు పిలిచారు. ఈ పనులను 3.93 శాతం అధిక ధరకు అంటే రూ.45.05 కోట్లకు కోట్ చేసి ఎల్–1గా నిలిచిన ప్రీకా సొల్యూషన్స్ సంస్థే దక్కించుకుంది. ఇందులో 2019, మే నాటికే రూ.26.58 కోట్ల విలువైన పనులు పూర్తి చేసింది.
» సీఆర్‌డీఏ భవనంలో జీ+3 వరకూ లోపల, బయటా విద్యుదీకకరణ, ఫర్నిచర్ సహా ఇంటీరియర్ వర్క్స్, చిల్డ్ వాటర్ సిస్టమ్, ఐటీ, బీఎంఎస్ తదితర పనులకు 2019 జనవరి 12న రూ.38.19 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచింది. ఈ పనులను 4.48 శాతం అధిక ధరకు అంటే రూ.39.90 కోట్లకు కేపీసీ ప్రాజెక్ట్స్ దక్కించుకుంది.
» సీఆర్‌డీఏ కార్యాలయాన్ని లోపలా, బయటా కళాత్మకంగా తీర్చిదిద్దడంతోపాటు భవనం లోపల, బయట అభివృద్ధి పనులకు పరిపాలన అనుమతి తీసుకోకుండానే 2024, సెపె్టంబరు 18న రూ.129.69 కోట్ల అంచనా వ్యయంతో సీఆర్‌డీఏ టెండర్లు పిలిచింది. ఈ పనులను రూ.135.97 కోట్లకు కోట్ చేసి ఎల్–1గా నిలిచిన కేపీసీ ప్రాజెక్ట్స్ సంస్థే దక్కించుంది. ఆ పనులను కేసీపీ ప్రాజెక్ట్స్ సంస్థకు అప్పగిస్తూ 2024, అక్టోబర్ 16న సీఆర్‌డీఏ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
జీఎస్టీ, సీనరేజీ వంటి పన్నులతో కలిపి ఈ పనుల వ్యయం రూ.160 కోట్లు అవుతుంది. ఇదే రకమైన పనులను జీ+3 అంతస్థు వరకూ 2019, జనవరి 12న రూ.39.90 కోట్లకు ఇదే సంస్థకు కట్టబెట్టడం గమనార్హం. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున ముడుపులు చేతులు మారడం వల్లే అంచనాలు పెంచేసి గతంలో అప్పగించిన సంస్థకే మళ్లీ కొత్తగా పనులు అప్పగించారనే ఇంజనీర్లు చెబుతున్నారు.
» తాజాగా సీఆర్‌డీఏ భవనానికి ఫర్నీచర్, ఇంటీరియర్స్, ఇతర పనులకు పన్నులతో కలిపి రూ.93.4 కోట్ల వ్యయంతో టెండర్లు పిలిచింది. దీన్ని పరిగణలోకి తీసుకుంటే.. 3,89,200 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో చేపట్టిన సీఆర్‌డీఏ భవనం కోసం రూ.335.60 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. అంటే.. చదరపు అడుగుకు రూ.8,616.64 వ్యయం చేస్తున్నారు.
హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లో ఫైవ్‌స్టార్ వసతులతో కూడిన భవనాల నిర్మాణ వ్యయం సైతం రూ.4 వేల నుంచి రూ.4,500 లోపే ఉంటుందని ఇంజనీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సీఆర్‌డీఏ భవన నిర్మాణంలో భారీ ఎత్తున ముడుపులు చేతులు మారడం వల్లే నిర్మాణ వ్యయం భారీగా పెరిగిందని చెబుతున్నారు.