నౌకాదళం పటిష్టతకు కలసి పనిచేద్దాం

Lets work together to strengthen the navy says Rajnath Singh - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ పిలుపు

తూర్పు నౌకాదళ అభివృద్ధికి సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టీకరణ

నౌకాదళం ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రాజెక్టులపై సమీక్ష 

ప్రాజెక్టుల పురోగతిని అడిగి తెలుసుకున్న సీఎం వైఎస్‌ జగన్‌ 

నౌకాదళం, ఏపీ సర్కారు మధ్య సత్సంబంధాలను పెంపొందించుకోవాలని రాజ్‌నాథ్‌సింగ్‌ సూచన

సాక్షి, విశాఖపట్నం/సాక్షి,అమరావతి: నౌకాదళ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్‌లో మరింత బలీయమైన శక్తిగా రూపుదిద్దుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఎంతో అవసరమని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ స్పష్టం చేశారు. భారత నౌకాదళం, ఏపీ ప్రభుత్వం కలిసి పనిచేయాలని కోరారు. తూర్పు నౌకాదళ అభివృద్ధికి కావాల్సిన పూర్తి సహకారాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. భారత నావికాదళం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న వివిధ మౌలిక వసతుల ప్రాజెక్టులు, ఇతర ప్రతిపాదనలకు సంబంధించి విశాఖపట్నంలో తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలోని స్వర్ణజ్యోతి ఆడిటోరియంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజ్‌నాథ్‌సింగ్, జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. భారత నౌకాదళ వ్యవస్థను శత్రుదుర్భేద్యంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేయాలని నౌకాదళ అధికారులకు రాజ్‌నాథ్‌సింగ్‌ సూచించారు. 

తీర ప్రాంతంలో భద్రతపై జగన్‌ సమీక్ష 
భారత నౌకాదళం, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మధ్య సత్సంబంధాలను పెంపొందించుకోవాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ పిలుపునిచ్చారు. నావికా దళంలో తలెత్తే సమస్యలను వేగవంతంగా పరిష్కరించడానికి ఏపీ ప్రభుత్వ సహకారం తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా నౌకాదళం చేపడుతున్న వివిధ ప్రాజెక్టుల పురోగతి గురించి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి భారత నౌకాదళాధిపతి అడ్మిరల్‌ కరంబీర్‌ సింగ్, ఈఎన్‌సీ చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ అతుల్‌కుమార్‌ జైన్‌ను అడిగి తెలుసుకున్నారు. తీర ప్రాంతంలో భద్రతపై కూడా అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. దాదాపు అరగంటకు పైగా ఈ సమీక్షా సమావేశం జరిగింది. అనంతరం నౌకాదళ ప్రధాన కేంద్రంలోని కల్వరీ డైనింగ్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన మర్యాదపూర్వక విందులో రాజ్‌నాథ్‌సింగ్, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, పలువురు రాష్ట్ర మంత్రులు, నావికాదళ ప్రధాన అధికారులు పాల్గొన్నారు.

అనంతరం రక్షణ మంత్రితో సీఎం జగన్‌ మాట్లాడారు. ఆ తర్వాత నౌకాదళ అధికారులు ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను జగన్‌ తిలకించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి జగన్‌ తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయం నుంచి బయటకు వచ్చే సమయంలో స్వయంగా రాజ్‌నాథ్‌సింగ్‌ వాహనం వరకూ వచ్చి వీడ్కోలు పలికారు. అంతకుముందు నావికాదళం అధికారులు స్వయంగా ఎయిర్‌పోర్ట్‌కు వచ్చి గార్డ్‌ ఆఫ్‌ హానర్‌తో వైఎస్‌ జగన్‌కు స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వెంట డీజీపీ గౌతమ్‌ సవాంగ్, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి, మంత్రులు అవంతి శ్రీనివాసరావు, మోపిదేవి వెంకటరమణ, ప్రభుత్వ విప్‌ బూడి ముత్యాలనాయుడు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఉన్నారు.

తాడేపల్లి చేరుకున్న సీఎం 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హైదరాబాద్‌ పర్యటన ముగించుకొని శనివారం రాత్రి తాడేపల్లికి చేరుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశం కోసం గురువారం మధ్యాహ్నం ఆయన తాడేపల్లి నుంచి హైదరాబాద్‌కు వెళ్లారు. గురువారం రాత్రి హైదరాబాద్‌లోని దస్పల్లా హోటల్‌లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శామ్యూల్‌ కుమారుడి వివాహానికి హాజరయ్యారు. గోదావరి వరద జలాలను కృష్ణా బేసిన్‌కు తరలించే ప్రతిపాదన కోసం శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో కేసీఆర్‌తో జరిగిన భేటీలో పాల్గొన్నారు. శనివారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌ నుంచి బయలుదేరి రాత్రి 7 గంటలకు విశాఖపట్నం చేరుకున్నారు. 7.10 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయం ఆవరణలో వైఎస్సార్‌సీపీ శ్రేణులను కలుసుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రానికి చేరకున్నారు. అక్కడ ఈస్ట్రన్‌ నేవల్‌ కమాండ్‌(ఈఎన్‌సీ) సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం విశాఖపట్నం విమానాశ్రయం నుంచి విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. రాత్రి 10.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి జగన్‌మోహన్‌రెడ్డి వచ్చారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top