ప్ర‘దక్షిణలు’!


* అధికార పార్టీ నేతలను చుట్టేస్తున్న త్రిబుల్‌స్టార్లు

* పోట్లదుర్తికి క్యూ

* ఎంపీకి పత్రికా ప్రకటన ఇచ్చిన సీఐకి చిన్నచౌక్ ఖరారు

* కొన్ని సర్కిళ్లకు రూ.10 లక్షలు పలుకుతున్న వైనం


సాక్షి ప్రతినిధి, కడప: వారంతా ఉన్నతోద్యోగులు. సమాజంలో బాధ్యతాయుతంగా మెలగాల్సిన అధికారులు. అయితే కాసులు కురిపించే సర్కిళ్లలో  పోస్టింగ్ కోసం అధికార పార్టీ నేతల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. కోరుకున్న పోస్టింగ్ కోసం లక్షలను వెచ్చించేందుకు సైతం ఏమాత్రం వెనుకాడటం లేదు. త్వరలో పోలీసు ఇన్‌స్పెక్టర్ల బదిలీలు ఉంటాయనే సమాచారం రావడంతో పైరవీలను ముమ్మరం చేశారు.  గతంలో జిల్లాలో పనిచేసి బదిలీపై వెళ్లిన అధికారి ఒకరు ఏకంగా ఓ సర్కిల్ కోసం రూ.10 లక్షలు ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది.



తెలుగుదేశం పార్టీ నేతలకు జీఓ నెంబర్ 175 కలిసి వస్తోంది. ఆ ఉత్తర్వుల కారణంగా కాసుల వర్షం కురుస్తోంది. అవసరాన్ని బట్టి ఎగ్జిక్యూటివ్ అధికారుల నియామకాలు చేపట్టవచ్చని ఉత్తర్వులు వివరిస్తున్నాయి. దీంతో అధికారపార్టీ నేతలకు  డిమాండ్ పెరిగింది. కోరుకున్న పోస్టింగ్ కోసం పోలీసు ఇన్‌స్పెక్టర్లు అధికార పార్టీ నేతల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. ఆ క్రమంలో త్రిబుల్‌స్టార్ అధికారులు పోట్లదుర్తికి అధికంగా వెళ్తున్నట్లు సమాచారం. జిల్లాలో పనిచేసి వెళ్లిన కొంతమంది పోలీసు అధికారులు పాత పరిచయాలతో నేతలను మచ్చిక చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అందివచ్చిన అవకాశాన్ని సొమ్ము చేసుకునే ప్రయత్నంలో అధికార పార్టీ నేతలు ఉన్నారు.

 

ఎంపీకి శుభాకాంక్షలు చెప్పినందుకు.....

రాజ్యసభ సభ్యుడిగా సీఎం రమేష్‌కు అవకాశం దక్కడంతో ఓ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అప్పట్లో పోలీసు యూనిఫాంతో శుభాకాంక్షలు చెబుతూ పత్రికల్లో అడ్వర్‌టైజ్‌మెంట్ ఇచ్చారు. ఆయన కోరుకున్న చిన్నచౌక్ సర్కిల్‌లో పోస్టింగ్ ఖరారైనట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఇటీవల హోమంత్రి పర్యటనలో కాపులు నిర్వహించిన వనభోజన కార్యక్రమంలో ఖర్చులు భరించిన ఓ సీఐకి కడప అర్బన్ సర్కిల్ ఖరారైనట్లు సమాచారం.



అదే సర్కిల్‌లో తనకు అవకాశం ఇవ్వాలని అందుకోసం రూ.10లక్షల వరకూ ఇవ్వగలనని జిల్లా కేంద్రంలో పనిచేసి వెళ్లిన ఓ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ సర్కిల్ కుదరకపోతే యర్రగుంట్ల సర్కిల్‌లో అవకాశం ఇచ్చినా సమ్మతమే అన్నట్లుగా సమాచారం. డీఎస్పీలుగా పదోన్నతి పొందడంతో ఖాళీలు పడ్డ కడప రూరల్, వన్‌టౌన్ సర్కిళ్లకు పోటీ తీవ్రతరంగా ఉన్నట్లు సమాచారం. కాగా ప్రొద్దుటూరు, జమ్మలమడుగు నియోజకవర్గాల పరిధిలోని పోస్టింగ్‌లకు ఏకపక్షంగా పనిచేసే అధికారుల కోసం ఆన్వేషణ చేస్తున్నట్లు తెలుస్తోంది.

 

చెరొక సర్కిల్‌ను పంచుకున్న మహిళా నేతలు...

జిల్లాలోని మాజీ మహిళా ఎమ్మెల్యే, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నాయకురాలు ఇరువురు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ల నియామకాలలో పోటీ పడుతున్నారు. ఇటీవల ఇరువురు ఓ ఒప్పందానికి వచ్చినట్లు సమాచారం. వారి వారి నివాసాల పరిధిలోని సర్కిళ్లకు వారు సూచించిన అధికారిని నియమించుకోవాలని  నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు మాజీ ఎమ్మెల్యే తన హయాంలో హెడ్‌క్వార్టర్‌లో ఎస్‌ఐగాను, కొండాపురం సర్కిల్ సీఐగా పనిచేసి వెళ్లిన అధికారి పేరును సిఫార్సు చేసినట్లు సమాచారం.



మరోనేత ఎన్నికల్లో పనిచేసి వెళ్లిన అధికారితోపాటు, తన సామాజిక వర్గానికి చెందిన ఓ సీఐ పేరు సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. యాదవ  సామాజిక వర్గానికి చెందిన అధికారులకు అవకాశం ఇవ్వాలని మైదుకూరు, రిమ్స్ సర్కిళ్ల కోసం ఆయా ప్రాంతాలకు చెందిన ఇరువురు నేతలు పట్టుబడుతున్నారు. ఇలా ఎవరి పరిధిలో అధికారులు, నాయకులు పెద్ద ఎత్తున పైరవీలు చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top