ఒకవైపు రాజధాని వ్యవహారాల హడావుడి నడుస్తున్నా సీఆర్‌డీఏలో లంచాల పర్వం యథావిధిగా కొనసాగుతోంది.
లేఅవుట్లు, అపార్ట్‌మెంట్లకు భారీ వసూళ్లు
ప్లానింగ్ అధికారి పట్టుబడటంతో ఉలికిపాటు
విజయవాడ బ్యూరో : ఒకవైపు రాజధాని వ్యవహారాల హడావుడి నడుస్తున్నా సీఆర్‌డీఏలో లంచాల పర్వం యథావిధిగా కొనసాగుతోంది. పెద్దగా లేఅవుట్లు లేవంటూనే వెంచర్లలో, నిబంధనల హెచ్చరికలు చేస్తూనే అపార్టుమెంట్ల నిర్మాణ వ్యవహారాల్లో ప్లానింగ్ అధికారులు అందినకాడికి డబ్బు దండుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం సీఆర్‌డీఏ ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్న అధికారి రెహ్మాన్‌ను ఏసీబీ అదుపులోకి తీసుకోవడంతో అందులో జరుగుతున్న అవినీతి మళ్లీ చర్చ నీయాంశమైంది. సర్వేయర్ స్థాయి నుంచి పైస్థాయి వరకు అందరూ గుట్టుచప్పుడు కాకుండా లంచాలు మింగేస్తున్నారు. పైకి మాత్రం తమ చేతుల్లో ఏముందని బిల్డప్‌లు ఇస్తూనే తెర వెనుక నుంచి చేయాల్సిందంతా చేస్తూనే ఉన్నారు. కొత్తగా విధించిన నిబంధనల పేరుతో వెంచర్లకు గతంలో మాదిరిగా సులువుగా అనుమతులు ఇవ్వడంలేదు. అలాగని అందరికీ అదే రూలు పాటించకుండా తమకు కావల్సినంత డబ్బు సమకూర్చిన వారికి మాత్రం పచ్చజెండా ఊపి వెంచర్లకు అవకాశం ఇస్తున్నారనే ఆరోపణలు కొద్దిరోజుల నుంచి బాగా వినిపిస్తున్నాయి.
వెంచర్ల ద్వారా వచ్చే ఆదాయం తగ్గడంతో ప్లానింగ్ అధికారులు నగర శివార్లలోని అపార్టుమెంట్లు, గ్రూపు భవనాలు, భవనాలపై దృష్టి సారించారు. విజయవాడ, గుంటూరు నగర శివార్లలో లెక్కలేనన్ని అపార్టుమెంట్లు, భవనాలు పైకి లేస్తున్నాయంటే దానికి ప్లానింగ్ అధికారుల చేతివాటమే కారణం. గొల్లపూడి నుంచి ఇబ్రహీంపట్నం, కానూరు నుంచి కంకిపాడు, రామవరప్పాడు నుంచి గన్నవరం వరకు విజయవాడ చుట్టుపక్కల జాతీయ రహదారుల వెంబడి వందల కొద్దీ భారీ భవనాలు నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణమవుతున్నాయి. నిర్మాణం ప్రారంభానికి ముందే వారు తమ పలుకుబడిని ఉపయోగించి ప్లానింగ్ అధికారులను లొంగదీసుకుంటుకున్నారు.
వీటిపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే కొద్దిరోజులు హడావుడి చేస్తున్న అధికారులు మళ్లీ కొంత మొత్తం దండుకుని అనుమతులిచ్చేస్తున్నారు. గుంటూరు శివార్లలోనూ ఇదే పరిస్థితి. పలుకుబడి లేని వారి భవనాలు, అపార్టుమెంట్ల వద్ద సర్వేయర్లు, ఇతర అధికారులు హడావుడి చేసి మొదట్లో నిలిపివేసినా ఆ తర్వాత కావాల్సినవి సమకూర్చిన తర్వాత నిర్మాణానికి గేట్లు ఎత్తేస్తున్నారు. ఏసీబీ అధికారులు ఫిర్యాదు వచ్చిన ఒకరిద్దరిపైనే కాకుండా ప్లానింగ్ విభాగంలో పనిచేసే మరింత కీలక అధికారులు, సిబ్బందిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.