రైళ్లలో కొరవడిన పారిశుధ్యం | Sakshi
Sakshi News home page

రైళ్లలో కొరవడిన పారిశుధ్యం

Published Mon, Jul 20 2015 1:29 AM

రైళ్లలో కొరవడిన పారిశుధ్యం

- పుష్కర స్టేషన్లలోనూ అపరిశుభ్రతే
- మరుగుదొడ్లలోనూ నిలబడి ప్రయాణం
సాక్షి, విజయవాడ :
గోదావరి మహా పుష్కరాలకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది యాత్రికులు తరలిరావడంతో అటు రైళ్లు, ఇటు పుష్కర స్టేషన్లలోనూ పారిశుధ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రధానంగా రాజమండ్రి, కొవ్వూరు, గోదావరి స్టేషన్ల వరకు రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ప్రత్యేక రైళ్లు వేసినప్పటికీ  సరి పోవడం లేదు. ప్రతి రైలులోనూ రెట్టింపు సంఖ్యలో ప్రయాణం చేస్తున్నారు. మరుగుదొడ్ల వద్ద ఉన్న జాగాలోనూ కిక్కిరిసి ఉంటున్నారు.

కొందరైతే మరుగు దొడ్లలోనూ నిలబడి వెళుతున్నారు. ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో మరుగుదొడ్ల వాడకం బాగా పెరిగింది. దీంతో  దూర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లలో  నీటి కొరత ఏర్పడుతోంది.  రైళ్లు ఆలస్యంగా నడుస్తుండడంతో  మరుగుదొ డ్లను పూర్తిస్థాయిలో క్లీనింగ్ చేయకుండానే రైళ్లను స్టేషన్ నుంచి పంపివేస్తున్నారు.
 
స్టేషన్లలోనూ చెత్తాచెదారం
రాజమండ్రి, గోదావరి, కొవ్వూరు రైల్వేస్టేషన్లకు వేలాది మంది ప్రయాణికులు తరలిరావడంతో శానిటేషన్ సమస్యలు ప్రారంభమయ్యాయి. ప్రయాణికులు వాటర్ బాటిల్స్, వాటర్ ప్యాకెట్లు, టిఫిన్ ప్లేట్లు, ప్లాస్టిక్ కవర్లు, పండ్ల తొక్కలు, టీ, కాఫీ కప్పులను ప్లాట్‌ఫారాలపైన, రైల్వేట్రాక్‌లపైన పడవేస్తున్నారు. పాడైపోయిన ఆహార పదార్థాలను సైతం అక్కడే పడేయడంతో ఈగలు, దోమలు ముసురుతున్నాయి.
 
రంగంలోకి దిగిన అధికారులు
పారిశుధ్యం లోపిస్తే రోగాలు ప్రబలుతాయని భావిస్తున్న రైల్వే అధికారులు  రంగంలోకి దిగారు. డీఆర్‌ఎం అశోక్‌కుమార్, ఏడీఆర్‌ఎం ఎన్.సీతారాంప్రసాద్, పుష్కరాల ప్రత్యేక అధికారి రమేష్‌బాబు స్వయంగా రైళ్లను, పుష్కర స్టేషన్లను తనిఖీ చేస్తున్నారు.   రైల్వే శానిటేషన్ సిబ్బందితో మూడు షిప్టులలోనూ పనిచేయిస్తున్నారు. రైల్వే ట్రాక్, స్టేషన్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తున్నారు.  అవకాశాన్ని బట్టి బోగీలను శుభ్రం చేయిస్తున్నారు.

Advertisement
 
Advertisement