న్యూఢిల్లీ: బీహార్‌లో ఎన్నికల సందడి నెలకొన్న వేళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాందీ ఆ రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పండుగల సమయంలో బీహార్‌లో సామర్థ్యానికి మించిన రీతిలో రైళ్లను నడపడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పండుగల సీజన్‌లో ప్రయాణికులను రైళ్లలో అమానవీయ రీతిలో తీసుకెళుతున్నారని ఆయన ఆరోపించారు. ఎన్‌డీఏ మోసపూరిత విధానాలు, ఉద్దేశాలకు ఈ పరిస్థితి సజీవ నిదర్శమని రాహుల్ అభివర్ణించారు.
‘బీహార్‌లో రైళ్లు పూర్తిగా నిండిపోయాయి. టిక్కెట్లు దొరకడం అసాధ్యంగా మారింది. ప్రయాణం అమానవీయంగా తయారయ్యింది. చాలా రైళ్లు 200 శాతం సామర్థ్యంతో నడుస్తున్నాయి. ప్రయాణికులు రైలు తలుపుల దగ్గర వేలాడుతున్నారు’ అంటూ రాహుల్ ‘ఎక్స్’లో వీడియోను షేర్ చేశారు. కేంద్రంలోని బీజేపీ, బీహార్‌లో ఎన్‌డీఏ మిత్రపక్షం జేడీయూలు పండుగ రద్దీని తగ్గించేందుకు 12 వేల ప్రత్యేక రైళ్లు నడుపుతన్నట్లు ప్రకటించాయని, అన్ని రైళ్లు ఎక్కడని రాహుల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రతి ఏటా పరిస్థితులు ఎందుకు దిగజారిపోతున్నాయి? బీహార్ ప్రజలు ఇలాంటి అవమానకరమైన పరిస్థితుల్లో ఎందుకు ప్రయాణించాల్సి వస్తున్నదని రాహుల్ నిలదీశారు.
त्योहारों का महीना है - दिवाली, भाईदूज, छठ।
बिहार में इन त्योहारों का मतलब सिर्फ़ आस्था नहीं, घर लौटने की लालसा है - मिट्टी की खुशबू, परिवार का स्नेह, गांव का अपनापन।
लेकिन यह लालसा अब एक संघर्ष बन चुकी है। बिहार जाने वाली ट्रेनें ठसाठस भरी हैं, टिकट मिलना असंभव है, और सफ़र… pic.twitter.com/hjrYJJFJ0F— Rahul Gandhi (@RahulGandhi) October 25, 2025
రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు ఉంటే వారు వేల కిలోమీటర్ల దూరం తిరగాల్సిన అవసరం లేదని, వీరంతా నిస్సహాయ ప్రయాణికులు మాత్రమే కాదని, ఎన్‌డీఏ మోసపూరిత విధానాలకు సజీవ సాక్ష్యం అని రాహుల్ పేర్కొన్నారు. కాగా పండుగల సీజన్‌లో ప్రయాణికుల రద్దీని నిర్వహించేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ అక్టోబర్ ఒకటి, నవంబర్ 30 మధ్య 12,011 ప్రత్యేక రైలు ట్రిప్పుల షెడ్యూల్‌ను ప్రకటించింది. సగటున, దేశవ్యాప్తంగా ప్రతిరోజూ దాదాపు 196 ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి.


