బీసీ ద్రోహి చంద్రబాబు

Krishnaiah Fires On Chandra Babu - Sakshi

సాక్షి, కోరుకొండ (రాజానగరం): ఆంధ్రప్రదేశ్‌లో బీసీలకు అన్యాయం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బీసీ ద్రోహిగా చరిత్రలో మిగిలిపోయారని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య అన్నారు. కోరుకొండలో వైఎస్సార్‌ సీపీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి మార్గాని భరత్‌ ఆధ్వర్యాన శుక్రవారం నిర్వహించిన రోడ్డు షోలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాజ్యాధికారంలో వాటా కోసం చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏడాది కిందటే పార్లమెంట్‌లో బిల్లు పెట్టిందన్నారు. అంతేకాకుండా ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు 41, లోక్‌సభలో 7 సీట్లు కేటాయించడం హర్షించదగిన విషయమన్నారు.

వడ్డెర్లు, రజకులు, నాయీ బ్రాహ్మణులు, వాల్మీకి, కురుబ, మత్స్యకారుల్లాంటి అత్యంత వెనుకబడిన కులాలకు జగన్‌ అసెంబ్లీ టిక్కెట్లు ఇవ్వడం సాహసోపేతమైన నిర్ణయమన్నారు. బీసీల విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ, ఆర్థికాభివృద్ధికి అనేక పథకాలు ప్రవేశపెడుతున్నట్టు జగన్‌ ప్రకటించారన్నారు. బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు సాధించడడం జగన్‌తోనే సాధ్యమని చెప్పారు. చంద్రబాబు బీసీలకు వెన్నుపోటు పొడిచారని, ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీలో బీసీలకు గుర్తింపు లేదన్నారు. ఈ ఎన్నికల్లో బీసీలందరూ చంద్రబాబుకు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రాజానగరం అసెంబ్లీ అభ్యర్థి జక్కంపూడి రాజాను, రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి మార్గాని భరత్‌లను సీలింగ్‌ ఫ్యాన్‌ గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు మార్గాని నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top