నటకళా రంగానికి రంగస్థలమే ఊపిరి పోస్తోందని ప్రముఖ టీవీ, రంగస్థల కళాకారుడు కోట శంకరరావు అన్నారు. తాటిపర్తిలో జరుగుతున్న
గొల్లప్రోలు : నటకళా రంగానికి రంగస్థలమే ఊపిరి పోస్తోందని ప్రముఖ టీవీ, రంగస్థల కళాకారుడు కోట శంకరరావు అన్నారు. తాటిపర్తిలో జరుగుతున్న రాష్ట్రస్థాయి నాటక పోటీలకు వచ్చిన ఆయన మాట్లాడుతూ.. మంచి నాటకానికి ఎప్పుడూ ప్రజాదరణ ఉంటుందన్నారు. నందీ నాటకోత్సవాలు ప్రారంభమైనప్పటి నుంచి నాటకరంగంలో పోటీతత్వం పెరిగిందని చెప్పారు. కళాకారుల పోషణకు ప్రభుత్వం మరింతగా సహాయ సహకారాలు అందించాలన్నారు.
ఇప్పటివరకూ 80 సినిమాలు, 64 టీవీ సీరియల్స్‌లో తాను నటించానని, 500 పైగా నాటకాలు ప్రదర్శించానని వివరించారు. మూడుసార్లు నంది అవార్డు అందుకున్నానని చెప్పారు. బెంగళూరుకు చెందిన అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ సంస్థ తనకు 2014లో డాక్టరేట్ ప్రదానం చేసిందన్నారు. నా పేరు మీనాక్షి, కెవ్వుకేక, గుండెజారి గల్లంతయ్యిందే.. సీరియల్స్‌లో నటిస్తున్నానని తెలిపారు. అపర్ణా నాటక కళాపరిషత్ నాటకరంగానికి చేస్తున్న సేవ అభినందనీయమని శంకరరావు అన్నారు.
టీవీ రంగం అభివృద్ధితో కళాకారులకు ప్రోత్సాహం
పిఠాపురం టౌన్ : టీవీ రంగం అభివృద్ధితో ప్రతిభ ఉన్న కళాకారులకు ప్రోత్సాహం లభిస్తోందని శంకరరావు అన్నారు. పిఠాపురంలో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. నాటకరంగం మీద మక్కువతో ఎస్‌బీఐ డిప్యూటీ మేనేజర్ ఉద్యోగానికి స్వచ్ఛంద విరమణ తీసుకున్నానని తెలిపారు. తన పెద్దన్నయ్య కోట నరసింహరావు తనకు స్ఫూర్తి అని తెలిపారు.