దుర్గంలో కిడ్నాప్‌ కలకలం | Sakshi
Sakshi News home page

దుర్గంలో కిడ్నాప్‌ కలకలం

Published Tue, Nov 21 2017 7:42 AM

Kirosine Dealer Kidnap In Kalyanadurgam - Sakshi

కళ్యాణదుర్గం: స్థానిక కిరోసిన్‌ డీలర్‌ మురళీను సోమవారం మధాయ్‌హ్నం 12 గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు  కిడ్నాప్‌ చేశారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఆనంతపురంలో ఆయన ప్రత్యక్షమయ్యారు. ఈ ఘటన కళ్యాణదుర్గంలో సంచలనం రేకెత్తించింది. వివరాల్లోకి వెళితే.. సోమవారం ఉదయం స్థానిక రిక్రియేషన్‌ క్లబ్‌లో మురళీ క్యారెం బోర్డు ఆడి 12 గంటలకు బయలకు వస్తుండగా, గుర్తు తెలియని వ్యక్తులు అతని నోటికి చేతులు అడ్డుపెట్టి కార్లోకి నెట్టి తమ వెంట తీసుకెళ్లారు.

మంత్రి ప్రమేయం ఉందా?
మురళీ కిడ్నాప్‌ వెనుక జిల్లాకు చెందిన ఓ మంత్రి హస్తమున్నట్లు పట్టణంలో వదంతులు వ్యాపించాయి. గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేసినట్లు పోలీస్‌ స్టేషన్‌లో మురళీ భార్య అనిత ఫిర్యాదు చేశారు. అయితే పట్టణ సమీపంలోని ఒంటిమిద్ది రెవెన్యూ పరిధిలోని భూ వివాదం విషయంగా మురళీని కిడ్నాప్‌ చేసి ఉంటారని పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. భూ విషయంలో ముఖ్యుడైన అపిలేపల్లి రమేష్‌ను ఫోన్‌ ద్వారా ఎస్‌ఐ శంకరరెడ్డి సంప్రదించారు. తాను అనంతపురంలో ఉన్నానని సమాధానం ఇవ్వడంతో ఎస్‌ఐ సమీపంలోని పోలీసు స్టేషన్‌కు వెళ్ళి నిర్ధారణ చేయించాలని ఆదేశించారు. దీంతో అతను జిల్లా కేంద్రంలోని 1వ పట్టణ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని అక్కడి నుంచి పోలీసులతో మాట్లాడించారు. అతనిని అక్కడే ఉంచుకోవాలని ఎస్‌ఐ సూచించడంతో అనంత పోలీసులు రమేష్‌ను స్టేషన్‌లోనే ఉంచుకున్నారు.

ఫోన్‌లో అందుబాటులో..
మధ్యాహ్నం 12 గంటల తర్వాత మురళీ మొబైల్‌ ముగపోయింది. పలుమార్లు కుటుంబసభ్యులు ప్రయత్నించినా అతని ఫోన్‌ పనిచేయలేదు. అయితే రమేష్‌ను స్టేషన్‌లో నిర్బంధించిన కొద్ది సేపటి తర్వాత మురళీ శ్రేయోభిలాషులు మరోసారి అతని ఫోన్‌కు కాల్‌ చేశారు. ఆ సమయంలో మొబైల్‌లో అతను అందుబాటులోకి వచ్చాడు. తనను ఎవరూ కిడ్నాప్‌ చేయలేదని, సొంతపనిపై అనంతపురానికి వచ్చినట్లు తెలిపాడు. దీంతో పోలీసులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే కిడ్నాపర్ల బెదిరింపులతోనే మురలీ ఈ విధంగా సమాధానం చెబుతున్నట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్‌ఐ శంకర్‌రెడ్డి అనంతపురానికి చేరుకుని మురళీని వెంటబెట్టుకు వచ్చారు. అనిత ఫిర్యాదు మేరకు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 

Advertisement
Advertisement