కొత్తూరు మండల కేంద్రంలో సోమవారం రాత్రి ఆర్‌ఎంపీ (ఆయుర్వేదిక్) వైద్యుడిని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల
కొత్తూరు : కొత్తూరు మండల కేంద్రంలో సోమవారం రాత్రి ఆర్‌ఎంపీ (ఆయుర్వేదిక్) వైద్యుడిని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద కిడ్నాప్ చేశారన్న వార్త స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఘటన జరిగి 24 గంటలు గడిచినప్పటికీ సదరు వైద్యుడిని ఎవరు తీసుకువెళ్లారన్న విషయంలో స్పష్ట త కొరవడింది. మంగళవారం వైద్యుడి కుటుంబ సభ్యులు కొత్తూరు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించినట్టు తెలియవచ్చింది. ఈ ఆర్‌ఎంపీ వైద్యుడు ఎవరు ? ఆయన్ని ఎవరు కిడ్నాప్ చేశారన్న అంశంపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఈ విషయమై కొత్తూరు పీఎస్సై జనార్దనరావు వద్ద ప్రస్తావించగా.. కిడ్నాప్ ఘటనపై తమ కు ఎటువంటి ఫిర్యాదు అందలేదని స్పష్టం చేశారు.
హల్‌చల్ చేస్తున్న ఉదంతాలు...
ఇటీవల సీతంపేట ఏజెన్సీ దొనుబాయి కేంద్రంగా పురాతన రాగి నాణేలు క్రయ, విక్రయాల జరిగిన విషయం బయట పడటంతో పోలీసులు నిఘా పెంచారని వదంతులు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలోనే అనుమానితులను పోలీసులు ఆదుపులోకి తీసుకుంటున్నట్టు పలువురు భావిస్తున్నారు. ఆర్‌ఎంపీ వైద్యుడితో పాటు సీతంపేట, కొత్తూరు మండలాలకు చెందిన మరికొంత మందిని కూడా పోలీసులు ఆదుపులోకి తీసుకొన్నారని వందలు వినిపిస్తున్నాయి. వారి కుటుంబ సభ్యులు సైతం పాలకొండ, సీతంపేట, వీరఘట్టాం పోలీసు స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నట్టు ప్రచారం ఊపందుకుంది.