Sakshi News home page

డబ్బులు రాలె..

Published Sun, Jun 1 2014 2:17 AM

డబ్బులు రాలె.. - Sakshi

 నల్లగొండ, న్యూస్‌లైన్ :ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ), ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి కేంద్రాలకు ధాన్యం అమ్మిన రైతుల పరిస్థితి దైన్యంగా మారింది. ఓ వైపు ఖరీఫ్ కాలం ముంచుకొస్తున్నా, రబీధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన డబ్బులు చెల్లించకపోవడంతో రైతాంగంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. మద్దతు ధర కల్పించాలనే సదు ద్దేశంతో అనేకచోట్ల ప్రభుత్వం ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వ ర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసింది. వీటిద్వా రా ఈ సీజన్‌లో లక్ష్యానికిమించి వరిధాన్యం కొనుగోలు చేసి రాష్ట్రంలో మొదటిస్థానంలో నిలిచారు. కొనుగోలు చేసిన కేంద్రాలకు సకాలంలో డబ్బులు చెల్లించడం లేదు.
 
 ఈ విషయంలో పౌరసరఫరాల శాఖను సమన్వయం చేయడంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, పీఏసీఎస్‌లు వైఫ్యలం చెందినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో రైతు సహనానికి పరీక్ష పెడుతున్నాయి. జిల్లాలో ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఐకేపీ, పీఏసీఎస్, సివిల్ సప్లయీస్ కలిసి మొత్తం 3 లక్షల 44 వేల 782 టన్నులు ధాన్యం కొనుగోలు చేసింది. వాటి విలువ సుమారు రూ.463 కోట్లు ఉంటుంది. దీంట్లో రైతులకు రూ.354 కోట్లు చెల్లించారు. ఇంకా రూ.109 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించాల్సి ఉంది. ధాన్య కొనుగోలు చేసి రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆ మొత్తాన్ని విడుదల చేయడంలో అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారు.  
 
 పెట్టుబడుల కోసం రైతుల అగచాట్లు...
 రబీ ధాన్యం అమ్మకంతో వచ్చే మొత్తాలతోనే రైతులు తమ అవసరా లు తీర్చుకోవడంతో పాటు, ఖరీఫ్  సీజన్‌కు కావాల్సిన విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తారు. ఈ మొత్తాల కోసం ఐకేపీ కేంద్రాల చుట్టూ రైతులు నిత్యం ప్రదక్షిణలు చేస్తుండగా, నిర్వాహకులు సైతం చెల్లింపులు ఎప్పుడు చేస్తారన్న అంశాన్ని చెప్పలేకపోతున్నారు.
 
 చెల్లింపులకు మరింత సమయం...
 ఐకేపీ కేంద్రాల నుంచి ధాన్యం నిల్వలను ఎప్పటికప్పుడు తరలించి, మిల్లర్ల ద్వారా మిల్లింగ్ చేయించి, ఎఫ్‌సీఐకి లెవీ ద్వారా ఈ మొత్తాలు త్వరితగతిన చెల్లించేలా చూడాల్సిన బాధ్యత పౌరసరఫరాల సంస్థది. కానీ ఈ శాఖ చోద్యం చూస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఐకేపీ కేంద్రాల్లో ఇంకా 30వేల టన్నుల ధాన్యం నిల్వలుండగా, వాటిని సకాలంలో మిల్లులకు తరలించని కారణంగా ఐకేపీ కేంద్రాల్లోనే మొలకెత్తుతున్నాయి. మహిళా సంఘాలనుంచి ధాన్యం తీసుకున్న మిల్లర్లు ట్రక్‌షీట్లు వెంటనే ఇవ్వకపోవడం వల్ల డబ్బులు సకాలంలో విడుదల చేయలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు. ట్రక్‌షీట్లు ఇవ్వకుండా సంఘాలకు ముందుగా డబ్బులు చెల్లిస్తే ఆ తర్వాత లేనిపోని సమస్యలు వచ్చిపడతాయని.. ఆ కారణంగానే ధాన్యం డబ్బులు విడుదల చేయడం లేదని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. మరికొద్ది రోజుల్లో రైతుల డబ్బులు పూర్తిగా చెల్లిస్తామని వారు అంటున్నారు. ఇదిలాఉంటే కేంద్రాలకు వచ్చే ధాన్యం తగ్గుముఖం పడుతుండడంతో కొనుగోలు కేంద్రాలను మూసివేస్తున్నారు. ఇప్పటికే పీఏసీఎస్ కేంద్రాలు మూతపడగా...ఐకేపీ 130 కేంద్రాలను మూసివేశారు.
 

Advertisement
Advertisement