ఖరీఫ్ రైతుకు దోమపోటు | Kharif farmer mosquito attack | Sakshi
Sakshi News home page

ఖరీఫ్ రైతుకు దోమపోటు

Nov 27 2014 1:37 AM | Updated on Oct 1 2018 2:03 PM

ఖరీఫ్ రైతుకు దోమపోటు - Sakshi

ఖరీఫ్ రైతుకు దోమపోటు

ఈ ఏడాది ఖరీఫ్‌లో దోమపోటు రైతుల్ని నిలువునా ముంచింది. గతంలో ఎన్నడూ లేని విధంగా దీని తీవ్రత ఉందని రైతులు చెబుతున్నారు.

పెరిగిన వ్యయం..తగ్గనున్న దిగుబడి
గతంలో ఎన్నడూ చూడని స్థాయిలో తెగులు
తడిసి మోపెడైన ఖర్చులు నష్టాలు తప్పవంటున్న రైతన్నలు

 
గుడివాడ : ఈ ఏడాది ఖరీఫ్‌లో దోమపోటు రైతుల్ని నిలువునా ముంచింది. గతంలో ఎన్నడూ లేని విధంగా దీని తీవ్రత ఉందని రైతులు చెబుతున్నారు. నివారణ కోసం ఎన్ని మందులు వాడినా ఫలితం లేకపోయిందని ఆవేదన చెందుతున్నారు. దీని ప్రభావం వల్ల జిల్లావ్యాప్తంగా వరి దిగుబడిలో 10 నుంచి 20 శాతం తగ్గుదల ఉంటుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఎన్నో కష్టనష్టాలకోర్చి సాగుచేస్తే చివరికి దోమపోటు దెబ్బతీసిందని రైతులు వాపోతున్నారు.
 
నాట్లలో జాప్యం..  వాతావరణంలో మార్పుల వల్లే...

ఈ ఏడాది ఖరీఫ్ సాగు కోసం కాలువలకు సకాలంలో నీరు విడుదల చేయలేదు. వర్షాలు కూడా పడకపోవడంతో నాట్లు   జాప్యమయ్యాయి. ఆలస్యంగా విడుదల చేసిన కొద్దిపాటి సాగునీటిని పొలంలోకి ఎక్కించడానికి ఆయిలింజన్ల కోసం రైతులు వేలాది రూపాయలు ఖర్చు చేశారు. ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో కూడా నాట్లు వేయాల్సి వచ్చిందని రైతులు చెబుతున్నారు. దీనికితోడు అక్టోబర్‌లో పడిన వర్షాలు, వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల వరిలో దోమపోటు విపరీతంగా వచ్చి పంటను తీవ్రంగా నష్టపరిచిందని రైతులు వివరిస్తున్నారు. చేతికందిన పంట నోటికాడికి రాకుండా పోతుందనే ఆందోళనతో దోమపోటు నివారణకు ఎకరానికి సగటున రూ.3 వేలతో రసాయనాలు పిచికారీ చేశామని చెబుతున్నారు. దీంతో దోమపోటు కొంత అదుపులోకి వచ్చినా అన్నిచోట్లా దాదాపు 20 శాతం పంటను నాశనం చేసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీపీటీలు, 1061, 1010 రకాలు వేసిన రైతులు దోమపోటు వల్ల తీవ్రంగా నష్టపోయారు. 1010 రకం వేసిన రైతులకు దోమపోటుకు పచ్చపురుగు తోడై పంటను నాశనం చేస్తోందని చెబుతున్నారు. మొదటి నుంచి ఎలుకల నివారణకు ఎకరానికి దాదాపు రూ.2 వేలకు పైగా ఖర్చు చేశామని పేర్కొంటున్నారు. ఇప్పటికే ఎకరానికి ఎరువులు, పురుగు మందుల కోసం సాగు ఖర్చు ఎకరాకు దాదాపు రూ.20 వేలు దాటిందని రైతులు చెబుతున్నారు. ఇంత ఖర్చుచేసినా తెగుళ్ల కారణంగా దిగుబడి తగ్గితే లాభాల మాట దేవుడెరుగు కనీసం ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదని అంటున్నారు.
 
తగ్గనున్న దిగుబడి...


ఈ ఏడాది జిల్లాలో 5 లక్షల 77 వేల 630 ఎకరాల్లో ఖరీఫ్ వరిసాగు జరిగిందని వ్యవసాయ అధికారులు వివరిస్తున్నారు. దోమపోటు కారణంగా ఎకరానికి మూడు నుంచి ఐదు బస్తాల దిగుబడి తగ్గుతుందని వారు పేర్కొంటున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో ఎకరానికి 25 బస్తాల నుంచి 30 బస్తాల వరకు దిగుబడి రావచ్చని ప్రయోగాత్మక పంటల అంచనాలో నిర్ణయించినట్లు, దోమపోటు ప్రభావంతో ఇది మూడు బస్తాల నుంచి ఐదు బస్తాల మేర తగ్గనున్నట్లు చెబుతున్నారు. దోమ కారణంగా రసం పీల్చినందున కనీసం గడ్డి కూడా పనికి రాకుండా పోతుందని పేర్కొంటున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement