బాబు గొప్పల కోసం అప్పులు చేశారు

Karanam Dharmasri Slams Chandrababu In Tadepalli - Sakshi

సాక్షి, తాడేపల్లి: చోడవరం ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ నేత కరణం ధర్మశ్రీ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారంటూ బాబుపై మండిపడ్డారు. జేఏసీ ముసుగులో చంద్రబాబు టీడీపీ నేతలతో ఉద్యమం చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. తాడేపల్లిలో ఎమ్మె​‍ల్యే ధర్మశ్రీ సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాబుకు పోయేకాలం దగ్గరపడిందన్నారు. జోలు పడితే జాలి వస్తుందని విన్యాసాలు చేస్తున్నారని విమర్శించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అంటే బాబుకు ఎందుకంత కడుపు మంటని నిలదీశారు. చంద్రబాబు ఒక ఉన్మాదిలా ఉత్తరాంధ్రపై విషం కక్కుతున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్రలో బినామీ భూములు లేవని రాజధానిని వ్యతిరేకిస్తున్నారా? అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గతంలో ఉత్తరాంధ్ర బాబుకు అండగా నిలవలేదా అని ప్రశ్నించారు.

‘వైజాగ్‌ రాజధాని అయితే రాష్ట్రానికి ఆదాయంతో పాటు యువతకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. ముంబైతో సమానంగా విశాఖపట్నం అభివృద్ధి చెందుతుంది. రాయలసీమలో హైకోర్టు పెడితే నాలుగు జిరాక్స్ మిషన్లు వస్తాయని రాయలసీమ ప్రాంతాన్ని అవమాన పరుస్తున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గాజువాకలో ఓడిపోయాడు కాబట్టి ఉత్తరాంద్రపై విద్వేషం చూపిస్తున్నాడు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు వేర్వేరు కాదు. ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతున్నారు. గొప్పల కోసం అప్పులు చేసి అమరావతిలో గ్రాఫిక్స్ చూపించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడి ఉండటానికి కారణం చంద్రబాబే. బాబును తెలివిలేని వాడిగా ప్రజలు భావిస్తున్నారు. పరిపాలన అభివృద్ధి ద్వారా అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భావిస్తున్నార’ని కరణం ధర్మశ్రీ పేర్కొన్నారు.

చదవండి: చంద్రబాబు గోబ్యాక్‌..!

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top