మా ప్రభుత్వాన్నే విమర్శిస్తారా?

మా ప్రభుత్వాన్నే విమర్శిస్తారా? - Sakshi


గుమ్మఘట్ట : ‘టీడీపీ అధికారంలోకి వచ్చీరాగానే నిరుపేదల పింఛన్లకు కత్తెరేశారు. గిట్టనివారి ఫిర్యాదుల ఆధారంగా ఇష్టానుసారంగా చౌక దుకాణపు డీలర్లను తొలగిస్తున్నారు. నాణ్యతగా తయారు చేస్తున్న మధ్యాహ్న భోజన ఏజెన్సీలను తొలగించి వారికి ఇష్టమున్న వారికి కట్టబెడుతున్నారు. నేను ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక్క పింఛను కాని, కార్డుకాని, ఇతర సంక్షేమ పథకాలేవైనా తొలగించామేమో ఒక్కటి చూపండ’ని మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి.. తహశీల్దార్ అబ్జల్‌ఖాన్, ఎంపీడీఓ జీ మునయ్య వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.



గుమ్మఘట్ట తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి మాదవరెడ్డి, స్థానిక నాయకులతో కలసి సోమవారం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ప్రజా సమస్యలకు తోడు రుణమాఫీ విధి విధానాల వల్ల రైతులు నిత్యం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని, ఎన్నికల వాగ్దానానికి కట్టుబడి ముఖ్యమంత్రి ఆంక్షలు లేని రుణమాఫీ చేసి ఉంటే రైతులకు ఇబ్బందే ఉండేది కాదని మాజీ ఎమ్మెల్యే కాపు.. అధికారులతో చర్చిస్తుండగా, ఎంపీపీ గిరిమల్లప్ప, టీడీపీ కార్యదర్శి మారెంపల్లి ఉస్మాన్, కలుగోడు మాజీ ఎంపీటీసీ సభ్యుడు గోవిందుతో పాటు వారి వెంట వచ్చిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుతగిలారు.



తానేమీ తప్పు మాట్లాడలేదని కాపు ఓ వైపు చెబుతుండగానే టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. గంటకు పైబడి ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలకు సర్ది చెప్పారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కాపు.. విలేకరులతో మాట్లాడుతూ.. కార్యాలయాలన్నీ టీడీపీ నాయకుల చాంబర్లలా మార్చుకున్నారని, గంటల తరబడి తిష్టవేయడం వల్ల సామాన్యులు అధికారులను కలవడానికి ఇబ్బందిగా మారిందన్నారు. ఈ పద్ధతిలో మార్పు తేవాలని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.



ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు ప్రతిపక్షానికి ఉందని, దాన్ని కూడా గొంతు నొక్కాలని చూస్తే ప్రజలతో కలసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఎమర్జెన్సీ రోజులను తలపించేలా ప్రభుత్వ పాలన నడుస్తోందని, ఎలాంటి ఆంక్షలు లేకుండా డ్వాక్రా, రైతు రుణ మాఫీని అమలు చేయూలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై అధికారులతో మాట్లాడుతుంటే టీడీపీ నేతలు దౌర్జన్యం చేయడం తగదన్నారు. పింఛను, రేషన్ కార్డు, డీలర్‌షిప్, మధ్యాహ్న భోజన ఏజె న్సీ కోల్పోరుున వారి తరుఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు.



డీలర్లతో ఇష్టానుసారంగా వ్యవహరించిన ఆర్‌ఐపై చర్యలు చేపట్టాలని తహశీల్దార్‌కు విజ్ఞప్తి చేశారు. మాజీ ఎమ్మెల్యే కాపు వెంట వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా నాయకుడు నవీన్‌కుమార్‌రెడ్డి, పైతోట సంజీవ, బీటీపీ గోవిందు, గుమ్మఘట్ట రాజు, గోనబావి కురుబ రామాంజినేయులు, రంగచేడు లక్ష్మణ్ణ, భూ పసముద్రం పగాకుల గోవిందప్ప, కలుగోడు గోవిందు, గొల్లపల్లి సర్పంచులు ముసలిరెడ్డి, విజేంద్రతో పాటు వివిధ గ్రామాల కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top