పైవంతెన పరిస్థితేంటి?

Kanaka Durga Flyover Construction Pending - Sakshi

మూడున్నరేళ్లుగా సాగుతున్న కనకదుర్గ ఫ్లైఓవర్‌ నిర్మాణం

ఇప్పటి వరకూ 70 శాతం పనులు మాత్రమే పూర్తి

నిధులు లేవంటూ చేతులెత్తేసిన ప్రభుత్వం

ప్రాజెక్టు వదులుకునేందుకు కాంట్రాక్టర్‌ సిద్ధం!

నిరంతర ట్రాఫిక్‌తో కొనసాగుతున్న ప్రజల కష్టాలు

తొమ్మిది నెలల్లో పూర్తి చేస్తామన్నారు.. మూడున్నరేళ్లు పూర్తయినా ఓ కొలిక్కి రాలేదు. ప్రజల ట్రాఫిక్‌ కష్టాలకు ఇక ఉండవంటూ ప్రగల్బాలు పలికారు.. ట్రాఫికర్‌ మరింత పెరిగింది తప్ప..సమస్యకు పరిష్కారం లభించలేదు. విజయవాడకు మకుటాయమానంగా నిలుస్తుందనుకున్న కనకదుర్గ ఫ్లైఓవర్‌ ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం నిర్మాణానికి సంబంధించి నిధులు కూడా నిలిపివేయడంతో నిర్మాణం సందిగ్ధంలో పడింది. కాంట్రాక్టర్‌కూడా ప్రాజెక్టు పనులు కొనసాగించడంపై మీనమేషాలు లెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

సాక్షి, విజయవాడ: కనకదుర్గా ఫ్లైఓ వర్‌ నిర్మాణం ఎప్పటికీ పూర్తవుతుందో అధికారులే కాదు.. కాంట్రాక్టర్‌ కూడా చెప్పలేకపోతున్నారు. ఎన్నికల ప్రచార అస్త్రంగా ఉపయోగపడుతుందనుకున్న ఫ్లైఓవర్‌ సకాలంలో పూర్తికాకపోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ ప్రాజెక్టు గురించి పట్టించుకోవడమే మానేశారు.

70 శాతం పనులు మాత్రమే పూర్తి....
మూడున్నర ఏళ్లలో 70శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయని.. ఇంకా 30 శాతం పనులు పూర్తికావాల్సి ఉందని ప్రాజెక్టు ఇంజినీర్లు చెబుతున్నారు. ఫ్లైఓవర్‌లో వై పిల్లర్ల నిర్మాణం ఎంతో
కీలకదశ. మొత్తం ఫ్లైఓవర్‌లో ఆరు వై పిల్లర్లు నిర్మాణం చేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకు రెండు మాత్రమే పూర్తయ్యాయి. హెడ్‌ వాటర్‌ వర్క్స్‌ నుంచి దర్గా వరకు వీటిని నిర్మించాల్సి ఉంది. మరో రెండు వై పిల్లర్లు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటి నిర్మాణం పూర్తయిన తర్వాత మరో రెండు ప్రారంభిస్తారు. నాలుగునెలల క్రితం ప్రారంభమైన రెండు పిల్లర్ల నిర్మాణం ఇప్పటి వరకు ఓ కొలిక్కి రాలేదు. మిగిలిన రెండు పిల్లర్లు ఎప్పుడు ప్రారంభిస్తారో తెలీదు. దీనికి తోడు ఎండలు మండిపోతూ ఉండటంతో వర్కర్లు పనులు వేగవంతంగా చేయలేకపోతున్నారు. బీహార్‌ నుంచి తీసుకొచ్చిన కూలీలు.. ఎండలకు తట్టుకోలేక అనేక మంది అనారోగ్యం పాలు కాగా.. మరికొంత మంది తిరిగి స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు.

వదుల్చుకునేందుకు కాంట్రాక్టర్‌ సిద్ధం..!
ప్రస్తుతం ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్న కాంట్రాక్టింగ్‌ సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. మరోవైపు ప్రాజెక్ట్‌ సంబంధించి బిల్లులు సక్రమంగా రాకపోవడం.. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం తగిన విధంగా లేకపోవడంతో సదరు సంస్థ కాంట్రాక్ట్‌ నుంచి తప్పుకునేందుకు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి కాంట్రాక్టర్‌ లాభాల కంటే చేతి చమురు వదిలిపోతుందని అధికారులు చెబుతున్నారు. కాగా ఇప్పడు కాంట్రాక్టర్‌ తప్పుకుంటే తిరిగి కొత్త కాంట్రాక్టర్‌ను వెదకడం, పనులు పూర్తి చేయడానికి మరో రెండేళ్లు పడుతుందని భావించిన అధికారులు ఏదో విధంగా ఈ కాంట్రాక్టర్‌ చేతే పని పూర్తి చేయించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇదే కాంట్రాక్టర్‌ను కొనసాగిస్తే కనీసం మరో ఏడాదికైనా పనులు పూర్తవుతాయని అంటున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top