పోలీసుల తీరుపై న్యాయమూర్తి సీరియస్‌

Justice serious on police Behaviour - Sakshi

బాలునిపై దాడి సంఘటనలో ప్రొద్దుటూరు పోలీసులకు నోటీసులు

వృద్ధురాలి పరిస్థితిపై ఫిర్యాదు...కౌన్సెలింగ్‌తో పరిష్కారం

నేడు జిల్లా కోర్టు ఆవరణంలో స్వచ్ఛభారత్‌

లీగల్‌ (కడప అర్బన్‌) : ప్రొద్దుటూరు పోలీసుల తీరుపై జి ల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సే వాధికార సంస్థ చైర్మన్‌ గోకవరపు శ్రీనివాస్‌ తీవ్రంగా స్పందించారు. సోమవారం తమ చాంబర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ∙ప్రొద్దుటూరు పట్టణం త్రీటౌన్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో పసుపులేటి శ్రీను అనే పదవ తరగతి విద్యార్థిపై నాగరాజు అనే కానిస్టేబుల్‌ దాడి చేశాడని మూడు రోజులుగా మీడియాలో కూడా వస్తోందని, ఎవరికైనా ఫిర్యాదుచేస్తే ఎన్‌కౌంటర్‌ చేస్తానని లేదా రౌడీషీట్‌ ఓపెన్‌ చేస్తామని బెదిరిస్తున్నారని బాలుని తల్లి పద్మావతి జిల్లా ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. డీఎల్‌ఎస్‌ఏ పరిధిలో ఫిర్యాదును స్వీకరించి ప్రొద్దుటూరు త్రీటౌన్‌ ఎస్‌ఐ, బాధ్యులైన సిబ్బందికి నోటీసులు జారీ చేశామన్నారు. అలాగే మానవ హక్కుల ఉల్లంఘన, జువైనల్‌ జస్టిస్‌ యాక్టును ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

∙కడపలో ఎస్పీ డ్రైవర్‌గా పనిచేస్తూ పదవీ విరమణ పొంది మృతి చెందిన సుబ్బన్న భార్య రాజమ్మ (75) అనే వృద్ధురాలికి సంబంధించిన డబ్బును దాదాపు రూ. 10 లక్షలు కుటుంబ సభ్యులే తీసుకుని ఆమెను నిర్మల వృద్ధాశ్రమంలో చేర్పించారు. ఈ క్రమంలో వృద్ధురాలి బంధువుల ద్వారా వచ్చిన ఫిర్యాదును స్వీకరించి వారి మధ్య రాజీ కుదిర్చి లోక్‌ అదాలత్‌ ద్వారా సమస్యను పరిష్కరించామన్నారు. ఆమెకు సంబంధించిన డబ్బును రూ. 10 లక్షలు జిల్లా కోర్టులోని ఎస్‌బీఐలో డిపాజిట్‌ చేయించి ఆమె తదనంతరం ఆమె వారసులకు చెందేలా చేశామన్నారు.∙జమ్మలమడుగుకు చెందిన ఓ వృద్ధురాలిని ఇద్దరు కుమారులు పట్టించుకోలేదని, పక్కింటి వారు తమకు ఫిర్యాదు చేశారని, ఆ ఫిర్యాదును స్వీకరించి ఆమెను రిమ్స్‌లో చేర్పించేందుకు ప్రయత్నించామన్నారు. అంతలోనే ఆమె కుమారులు వచ్చి తాము చూసుకుంటామని చెప్పారన్నారు. తర్వాత  కౌన్సెలింగ్‌ ఇచ్చామన్నారు.  

నేడు జిల్లా కోర్టు ఆవరణంలో స్వచ్ఛ భారత్‌

లెవెన్త్‌ బెటాలియన్‌ కమాండెంట్‌ ఆధ్వర్యంలో వంద మంది ఏపీఎస్‌పీ కానిస్టేబుళ్లు మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 9.30 గంటల వరకు జిల్లా కోర్టు ఆవరణంలో స్వచ్ఛభారత్‌ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇందులో జిల్లా కోర్టులోని న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు స్వచ్ఛందంగా పాల్గొనాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోకవరపు శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top