
సాక్షి, అమరావతి/భవానీపురం(విజయవాడ పశ్చిమ): ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జితేంద్రకుమార్‌మహేశ్వరి విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 10.30 గంటలకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. కార్యక్రమానికి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న జస్టిస్ ప్రవీణ్‌కుమార్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వీ సుబ్రహ్మణ్యం, హైకోర్టు అడ్మిన్ రిజిస్ట్రార్ పురుషోత్తం, న్యాయమూర్తులు తదితరులు హాజరుకానున్నారు.
జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరితో పాటు.. ఆయన సతీమణి ఉమామహేశ్వరి, సుమారు 25 మంది కుటుంబ సభ్యులతో పాటు.. దాదాపు 120 మంది రాష్ట్రస్థాయి అతిథులు హాజరవుతారు. ఇదిలా ఉండగా కృష్ణా జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్.. విజయవాడ మున్సిపల్ కమిషనర్ ప్రసన్నవెంకటేష్‌తో కలిసి ఆదివారం ప్రమాణ స్వీకార ఏర్పాట్లను పరిశీలించారు. గవర్నర్, ముఖ్యమంత్రి, ఇద్దరు ప్రధాన న్యాయమూర్తుల వాహనాలనే కళాక్షేత్రం లోపలికి అనుమతిస్తామని చెప్పారు. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రొటోకాల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని ప్రొటోకాల్ డైరెక్టర్ కిషోర్‌కుమార్ తెలిపారు.