జూడాల ఆందోళన ఉద్రిక్తం

Judala anxiety is raging - Sakshi

ఎన్‌ఎమ్‌సీ బిల్లుకు వ్యతిరేకంగా విజయవాడలో జాతీయ రహదారి దిగ్బంధం

అనుమతి లేదు.. విరమించాలని కోరిన పోలీసులు

ట్రాఫిక్‌ పెరిగిపోవడంతో జూడాలు స్టేషన్‌కు తరలింపు

జూడాపై డీసీపీ దురుసు ప్రవర్తనతో వివాదం

క్షమాపణ చెప్పాలంటూ ప్రభుత్వాస్పత్రి ఆవరణలో నిరసన

లబ్బీపేట (విజయవాడ తూర్పు)/సాక్షి, అమరావతి/తిరుపతి తుడా: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎమ్‌సీ)ను రద్దు చేయాలని కోరుతూ విజయవాడలో జూనియర్‌ వైద్యులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఆరు రోజులుగా ప్రభుత్వాస్పత్రి, వైద్య కళాశాల ప్రాంగణంలో నిరసనలు తెలుపుతున్న జూడాలు బుధవారం జాతీయ రహదారిపైకి వచ్చి మహానాడు రోడ్డు జంక్షన్‌ను దిగ్బంధం చేశారు. వారి ఆందోళన అర్ధగంటకు పైగా సాగడంతో నాలుగు వైపులా కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. దీంతో సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ట్రాఫిక్‌ సమస్య దృష్ట్యా ఆందోళన విరమించాలని కోరారు. అందుకు జూడాలు నిరాకరించడంతో బలవంతంగా వాహనాల్లో ఎక్కించి భవానీపురం, వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌లకు తరలించారు. ఆ క్రమంలో ఓ జూడాపై డీసీపీ హర్షవర్ధన్‌ దురుసుగా ప్రవర్తిస్తూ చేయి చేసుకోవడం వివాదాస్పదంగా మారింది. 

ఐఎంఏ ప్రతినిధుల సంప్రదింపులు 
ఐఎంఏ ప్రతినిధులు డాక్టర్‌ టీవీ రమణమూర్తి, డాక్టర్‌ మనోజ్‌ తదితరులు వన్‌టౌన్, భవానీపురం పోలీసుస్టేషన్‌లకు వెళ్లి జూడాలను వదిలివేయాలని కోరారు. వారి భవిష్యత్‌తో కూడిన అంశం కావడంతో ఆందోళన చేస్తున్నారని తెలిపారు. ట్రాఫిక్‌ సమస్య సృష్టించాలని కానీ, ప్రజలను ఇబ్బంది పెట్టే ఉద్దేశం వారికి లేదని చెప్పడంతో కొద్దిసేపటి తర్వాత జూడాలను పోలీసులు వదిలివేశారు. అనంతరం ప్రభుత్వాస్పత్రికి చేరుకున్న జూడాలు.. తమ పట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీసు అధికారి క్షమాపణ చెప్పాలంటూ నిరసన దీక్షకు దిగారు. 
జూడాలను బూట్‌ కాలితో తన్నుతున్న టీటీడీ వీజీవో అశోక్‌కుమార్‌ గౌడ్‌   

మంత్రి, కార్యదర్శులకు వినతిపత్రాలు 
ఎన్‌ఎమ్‌సీని రద్దు చేసి, మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాను పునరుద్ధరించాలనే డిమాండ్‌తో కూడిన వినతిపత్రాలను జూనియర్‌ వైద్యుల సంఘ ప్రతినిధులు సచివాలయంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణప్రసాద్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి జవహర్‌రెడ్డికి సమర్పించారు. 

అలిపిరి వద్ద ఆందోళన.. రసాభాస 
ఎన్‌ఎమ్‌సీ బిల్లుకు వ్యతిరేకంగా తిరుపతిలో జూడాలు చేపట్టిన ఆందోళన రసాభాసగా మారింది. భక్తులు తిరుమలకు వెళ్లే అలిపిరి మార్గంలో రాస్తారోకో నిర్వహించడంతో మూడు గంటల పాటు రాకపోకలు ఆగిపోయాయి. దీంతో పోలీసులు, టీటీడీ సెక్యూరిటీ అండ్‌ విజిలెన్స్‌ అధికారులు అక్కడకు చేరుకుని జూడాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఓ వైపు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడంతో సహనం నశించి భక్తులు వైద్య విద్యార్థులతో గొడవకు దిగారు. ఈ క్రమంలో టీటీడీ విజిలెన్స్‌ అధికారి అశోక్‌కుమార్‌ గౌడ్‌ వైద్య విద్యార్థిపై దురుసుగా ప్రవర్తించడంతో పాటు కాలితో తన్నడంతో ఒక్కసారిగా జూడాల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆ అధికారి చర్యలకు నిరసనగా మరోసారి ఆందోళనకు దిగారు. ఎంతకీ వినకపోవడంతో వారిని అరెస్టు చేసి ఎమ్మార్‌పల్లిలోని పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్‌కు తరలించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top