జీతం లేని జేసీ! | Joint Collector Salary stopped | Sakshi
Sakshi News home page

జీతం లేని జేసీ!

Oct 5 2014 3:17 AM | Updated on Sep 2 2018 4:48 PM

జీతం లేని జేసీ! - Sakshi

జీతం లేని జేసీ!

ఆ శాఖ కొర్రీల ఖజానా గా మారింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఇబ్బందులనే నజరానాగా అంది స్తోంది. జాయింట్ కలెక్టర్ అయినా.. కిందిస్థాయి ఉద్యోగి అయినా తమ నిర్లక్ష్యానికి బలి కావల్సిందేనని

శ్రీకాకుళం పాత బస్టాండ్: ఆ శాఖ కొర్రీల ఖజానా గా మారింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఇబ్బందులనే నజరానాగా అంది స్తోంది. జాయింట్ కలెక్టర్ అయినా.. కిందిస్థాయి ఉద్యోగి అయినా తమ నిర్లక్ష్యానికి బలి కావల్సిందేనని ప్రత్యక్షంగా నిరూపిస్తోంది. సాక్షాత్తు జాయింట్ కలెక్టర్ జీతాన్నే నిలిపివేసింది. కలెక్టరేట్ ఉద్యోగులను ఆ జాబితాలో చేర్చింది. ఫలితంగా దసరా పండుగ ముందు జీతాల్లేక ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారు. ఖజానా శాఖ అధికారుల తీరుపై గతంలో అనేక ఫిర్యాదులు కలెక్టర్‌కు అందాయి. అయినా వారి తీరు ఏమాత్రం మారడంలేదు.
 
 ఈ నెల జీతాలు బంద్
 తాజాగా పలు శాఖల ఉద్యోగుల జీతాలు పెండింగులో పెట్టి ఇబ్బందులకు గురి చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. కలెక్టరేట్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు సెప్టెంబర్-2014 జీతాలు చెల్లించలేదు. ఈ ఉద్యోగులు బదిలీ కాలేదు, ఏ తప్పూ చేయలేదు,  సంబంధిత డ్రాయింగ్  ఆధికారి ఎప్పటి మాదిరిగానే ఈ నెల కూడా పూర్తి సమాచారంతో జీతాల బిల్లును ఖజానా శాఖకు పంపించారు. అయితే బిల్లు మాత్రం మంజూరు కాలేదు. దీనికి కారణమేమిటని ఆరా తీస్తే..  2005 నుంచి విపత్తుల నిర్వహణ, ఆర్‌ఆర్ ప్యాకేజీకి సంబందించిన నిధుల వినియోగంపై బిల్లులు సమర్పించలేదని, అందుకే జీతాలు నిలిపివేశామని ఖజానా ఉన్నతాధికారలు సెలవిస్తున్నారు. ఫలితంగా కలెక్టరేట్‌లో పనిచేస్తున్న 61 మంది ఉద్యోగులకు జీతాలు అందలేదు, దీనిపై కలెక్టరేట్ పరిపాలనాధికారి ఎం. కాళీప్రసాద్ మాట్లాడుతూ  విపత్తులు, ఎన్నికల నిర్వహణకు సీఆర్-27 ఖాతా కింద నిధులు వినియోగిస్తామని, ఈ ఖాతాకు సంబంధించి 33 బిల్లులు ఖజానా శాఖకు అందజేయాల్సి ఉండగా ఇప్పటికే 22 బిల్లులు సమర్పించామన్నారు. మిగిలిన 11 బిల్లులను 15 రోజుల్లో అందజేస్తామని ఖజానా శాఖ డీడీ సదానందరావుకు స్వయంగా తెలియజేశామని, రాతపూర్వకంగా కూడా ఇచ్చామన్నారు. అయితే అన్ని బిల్లులు  సమర్పించే వరకు జీతాలు మంజూరు చేయలేమని ఆయన చెప్పారన్నారు. ఇప్పటికే సమర్పించిన బిల్లులకు సంబంధించిఅనేక కొర్రీలు వేస్తూ మళ్లీ మళ్లీ సమర్పించమంటున్నారని ఏవో ఆవేదన వ్యక్తం చేశారు.  
 
 జేసీ జీతానికే దిక్కు లేదు
 ఉద్యోగుల సంగతి అలా ఉంచితే.. జాయింట్ కలెక్టర్ జి.వీరపాండ్యన్ జీతం బిల్లును సైతం ట్రెజరీ ఆధికారులు నిలిపివేశారు.  సెప్టెంబర్ జీతం ఇంతవరకు ఆయన ఖాతాలో జమ కాలేదు, మెడికల్ ఆలెవెన్సులు కూడా పెండింగ్‌లో పెట్టారు, దీనికి సంబంధించిన బిల్లును పూర్తిగా తీసుకొనేందుకు నిరాకరించారు. వివిధ ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ, పునరావాస కార్యక్రమాలకు నిధుల వినియోగానికి సంబంధించి బిల్లులు అందజేయనందున జేసీ జీతం నిలిపివేసినట్లు ఖజానా అధికారులు సమాచారమిచ్చారని కలెక్టరేట్ ఆధికారులు చెప్పారు. ఖజానా శాఖ కొర్రీలకు  జిల్లా మెజిస్ట్రేట్‌కి కూడా ఈ వేతన చెల్లింపులకు  ఇబ్బందులు తప్పలేదు,
 
 మరికొన్ని శాఖల్లో కూడా..
   వ్యవసాయ శాఖ జేడీకి గత ఆరు నెలలుగా జీతం అందడం లేదు.  విపత్తుల సమయంలో చేసిన ఖర్చుల బిల్లుల పెండింగే దీనికి కారణంగా చెబుతున్నారు.    విద్యాశాఖకు సంబందించి శ్రీకాకుళం మండలం  రాగోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగులకు సెప్టెంబర్ జీతాలు మంజూరు కాలేదు,  ఇన్‌చార్జి డ్రాయింగ్ ఆధికారి సంతకం చేయడం చెల్లదని ఖజానా శాఖ కొర్రీ పెట్టడమే దీనికి కారణం.
 
 సెలవులో ఖజానా డీడీ
 జీతాల నిలిపివేతపై ఖజానా శాఖ డీడీ సదానందరావు వివరణకు ప్రయత్నించగా ఆయన సెలవులో ఉన్నారు. ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న వెంకటేశ్వరరావు వద్ద ప్రస్తావించగా ఎన్నికలు, విపత్తులు, ఆర్‌ఆర్ ప్యాకేజీల నిధుల వినియోగానికి సంబంధించి బిల్లులు సమర్పించేంతవరకు సంబంధిత అధికారులు, ఉద్యోగుల జీతాలు నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించిందని వివరించారు. జేసీ జీతం, అలవెన్సుల విషయంలో ఈ నిబంధనను వర్తింపజేయాలని పే అండ్ అకౌంట్స్ ఆధికారులు ఉత్తర్వులు ఇచ్చారన్నారు. రాగోలు ఉన్నత పాఠశాల డ్రాయింగ్ ఆధికారికి ఎఫ్‌ఎసీ ఇచ్చేంతవరకు బిల్లులు మంజూరు కావని స్పష్టం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement