breaking news
Salary stopped
-
అవును పనిచేశారు.. అయినా వేతనం ఇవ్వం!
సాక్షి, అమరావతి: ఎక్కడైనా ఉద్యోగులు పనిచేయకపోతే జీతం ఇవ్వరు.. కానీ కూటమి ప్రభుత్వంలో మాత్రం పనిచేసినా వేతనం ఇవ్వరని తేలింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో కాంట్రాక్టు లెక్చరర్లు పనిచేసిన కాలానికి వేతనం ఇవ్వకుండా కూటమి సర్కారు వేధిస్తోంది. రెండు విద్యాసంవత్సరాలకు సంబంధించి మే నెలలో వారితో పనిచేయించుకున్నా జీతం అడగొద్దంటోంది. ఇప్పటికే తక్కువ వేతనాలతో ఏళ్ల తరబడి సేవలు అందిస్తున్నామని, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో రెగ్యులర్ లెక్చరర్లతో సమానంగా పనిచేస్తున్నా ఈ వివక్ష ఏంటని అడిగితే.. ‘నోవర్క్–నోపే’ ఉత్తర్వులున్నాయంటోంది.అయినప్పటికీ 2024 మే నెలకు ఈ సాకు చెప్పిన ప్రభుత్వం.. 2025 మే నెలలోను కాంట్రాక్టు లెక్చరర్లతో పనిచేయించుకుంది. వేతనం అడిగితే మొండిచేయి చూపుతోంది. గత ప్రభుత్వంలో కాంట్రాక్టు లెక్చరర్లు 10 రోజుల విరామంతో 12 నెలల వేతనం అందుకునేవారు. గతేడాది మే నెలలో పనిచేసిన కాలానికి (ఒకరోజు విరామంతో) వేతనం ఇవ్వాలని ఇంటర్ విద్యామండలి నుంచి ఆర్థికశాఖకు ఫైల్ పెట్టారు.దీనిపై ఆ శాఖ ఉన్నతాధికారులు చేసిన పనిపై పూర్తి నివేదిక (వర్క్ అవుట్‌పుట్) ఇవ్వాలని ఆర్థికశాఖ ఆదేశించింది. దీంతో తిరిగి ఇంటర్ బోర్డు అధికారులు నివేదిక సమర్పించారు. 2025 మే నెలలో కూడా కాంట్రాక్టు లెక్చరర్లతో పనిచేయించుకున్న కూటమి ప్రభుత్వం వేతనం ఇవ్వకుండా వేధిస్తోంది. మొత్తం నివేదిక విద్యాశాఖ మంత్రి వద్ద ఉన్నా నిర్ణయం తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.12 నెలలకు వేతనం ఇస్తామని చెప్పి మోసం కాంట్రాక్టు లెక్చరర్లకు 10 రోజుల విరామంతో 12 నెలల కాలానికి వేతనం ఇస్తామని 2019లో నాటి టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది. దీనికి మండలిలో ఆమోదం తెలిపినట్టు అదే ఏడాది మార్చి 5వ తేదీన క్యాబినెట్ తరఫున ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు మీడియా ముఖంగా ప్రకటించారు. కానీ మంత్రిమండలిలో ఆమోదించిన అంశంపై ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వలేదు. వైఎస్ జగన్ సీఎం కాగానే కాంట్రాక్టు లెక్చరర్లకు న్యాయం చేయాలని 2019 నుంచి 2023 వరకు అన్ని సంవత్సరాలు వరుసగా 10 రోజుల విరామంతో 12 నెలల జీతాలు చెల్లించారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాత్రం కాంట్రాక్టు లెక్చరర్లను వేధిస్తోంది.రెండు నెలలకు ఇవ్వాల్సిన వేతనం రూ.37 కోట్లేప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో రెగ్యులర్ లెక్చరర్ల కంటే కాంట్రాక్టు లెక్చరర్లే అధికం. మొత్తం 3,572 మంది కాంట్రాక్టు లెక్చరర్లు పనిచేస్తున్నారు. వీరంతా సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ, పేపర్ల మూల్యాంకనం తదితర విధుల్లో కీలకంగా ఉంటారు. వీరికి ఏటా మే నెలకు రూ.18.50 కోట్లు వేతనంగా ఇవ్వాలి. రెండేళ్లలోను మే నెలకు మొత్తం రూ.37 కోట్లు ఇవ్వాల్సి ఉన్నా.. దానిపై ప్రభుత్వం కొర్రీలు వేస్తోంది. ఆర్థికశాఖ అడిగిన అన్ని నివేదికలు ఇంటర్ బోర్డు ఇచ్చినా వేధించడం గమనార్హం. వీరికి వేతనం చెల్లిస్తే.. సాంకేతిక, డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లకు కూడా ఇవ్వాల్సి ఉంటుందని, దీంతో ప్రభుత్వంపై ఏటా రూ.150 కోట్ల భారం పడుతుందన్న భావనతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి మే నెలలో పనిచేసేది ఒక్క కాంట్రాక్టు లెక్చరర్లు మాత్రమే. -
జీతం లేని జేసీ!
శ్రీకాకుళం పాత బస్టాండ్: ఆ శాఖ కొర్రీల ఖజానా గా మారింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఇబ్బందులనే నజరానాగా అంది స్తోంది. జాయింట్ కలెక్టర్ అయినా.. కిందిస్థాయి ఉద్యోగి అయినా తమ నిర్లక్ష్యానికి బలి కావల్సిందేనని ప్రత్యక్షంగా నిరూపిస్తోంది. సాక్షాత్తు జాయింట్ కలెక్టర్ జీతాన్నే నిలిపివేసింది. కలెక్టరేట్ ఉద్యోగులను ఆ జాబితాలో చేర్చింది. ఫలితంగా దసరా పండుగ ముందు జీతాల్లేక ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారు. ఖజానా శాఖ అధికారుల తీరుపై గతంలో అనేక ఫిర్యాదులు కలెక్టర్‌కు అందాయి. అయినా వారి తీరు ఏమాత్రం మారడంలేదు. ఈ నెల జీతాలు బంద్ తాజాగా పలు శాఖల ఉద్యోగుల జీతాలు పెండింగులో పెట్టి ఇబ్బందులకు గురి చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. కలెక్టరేట్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సెప్టెంబర్-2014 జీతాలు చెల్లించలేదు. ఈ ఉద్యోగులు బదిలీ కాలేదు, ఏ తప్పూ చేయలేదు, సంబంధిత డ్రాయింగ్ ఆధికారి ఎప్పటి మాదిరిగానే ఈ నెల కూడా పూర్తి సమాచారంతో జీతాల బిల్లును ఖజానా శాఖకు పంపించారు. అయితే బిల్లు మాత్రం మంజూరు కాలేదు. దీనికి కారణమేమిటని ఆరా తీస్తే.. 2005 నుంచి విపత్తుల నిర్వహణ, ఆర్ఆర్ ప్యాకేజీకి సంబందించిన నిధుల వినియోగంపై బిల్లులు సమర్పించలేదని, అందుకే జీతాలు నిలిపివేశామని ఖజానా ఉన్నతాధికారలు సెలవిస్తున్నారు. ఫలితంగా కలెక్టరేట్లో పనిచేస్తున్న 61 మంది ఉద్యోగులకు జీతాలు అందలేదు, దీనిపై కలెక్టరేట్ పరిపాలనాధికారి ఎం. కాళీప్రసాద్ మాట్లాడుతూ విపత్తులు, ఎన్నికల నిర్వహణకు సీఆర్-27 ఖాతా కింద నిధులు వినియోగిస్తామని, ఈ ఖాతాకు సంబంధించి 33 బిల్లులు ఖజానా శాఖకు అందజేయాల్సి ఉండగా ఇప్పటికే 22 బిల్లులు సమర్పించామన్నారు. మిగిలిన 11 బిల్లులను 15 రోజుల్లో అందజేస్తామని ఖజానా శాఖ డీడీ సదానందరావుకు స్వయంగా తెలియజేశామని, రాతపూర్వకంగా కూడా ఇచ్చామన్నారు. అయితే అన్ని బిల్లులు సమర్పించే వరకు జీతాలు మంజూరు చేయలేమని ఆయన చెప్పారన్నారు. ఇప్పటికే సమర్పించిన బిల్లులకు సంబంధించిఅనేక కొర్రీలు వేస్తూ మళ్లీ మళ్లీ సమర్పించమంటున్నారని ఏవో ఆవేదన వ్యక్తం చేశారు. జేసీ జీతానికే దిక్కు లేదు ఉద్యోగుల సంగతి అలా ఉంచితే.. జాయింట్ కలెక్టర్ జి.వీరపాండ్యన్ జీతం బిల్లును సైతం ట్రెజరీ ఆధికారులు నిలిపివేశారు. సెప్టెంబర్ జీతం ఇంతవరకు ఆయన ఖాతాలో జమ కాలేదు, మెడికల్ ఆలెవెన్సులు కూడా పెండింగ్‌లో పెట్టారు, దీనికి సంబంధించిన బిల్లును పూర్తిగా తీసుకొనేందుకు నిరాకరించారు. వివిధ ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ, పునరావాస కార్యక్రమాలకు నిధుల వినియోగానికి సంబంధించి బిల్లులు అందజేయనందున జేసీ జీతం నిలిపివేసినట్లు ఖజానా అధికారులు సమాచారమిచ్చారని కలెక్టరేట్ ఆధికారులు చెప్పారు. ఖజానా శాఖ కొర్రీలకు జిల్లా మెజిస్ట్రేట్‌కి కూడా ఈ వేతన చెల్లింపులకు ఇబ్బందులు తప్పలేదు, మరికొన్ని శాఖల్లో కూడా.. వ్యవసాయ శాఖ జేడీకి గత ఆరు నెలలుగా జీతం అందడం లేదు. విపత్తుల సమయంలో చేసిన ఖర్చుల బిల్లుల పెండింగే దీనికి కారణంగా చెబుతున్నారు. విద్యాశాఖకు సంబందించి శ్రీకాకుళం మండలం రాగోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగులకు సెప్టెంబర్ జీతాలు మంజూరు కాలేదు, ఇన్చార్జి డ్రాయింగ్ ఆధికారి సంతకం చేయడం చెల్లదని ఖజానా శాఖ కొర్రీ పెట్టడమే దీనికి కారణం. సెలవులో ఖజానా డీడీ జీతాల నిలిపివేతపై ఖజానా శాఖ డీడీ సదానందరావు వివరణకు ప్రయత్నించగా ఆయన సెలవులో ఉన్నారు. ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న వెంకటేశ్వరరావు వద్ద ప్రస్తావించగా ఎన్నికలు, విపత్తులు, ఆర్ఆర్ ప్యాకేజీల నిధుల వినియోగానికి సంబంధించి బిల్లులు సమర్పించేంతవరకు సంబంధిత అధికారులు, ఉద్యోగుల జీతాలు నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించిందని వివరించారు. జేసీ జీతం, అలవెన్సుల విషయంలో ఈ నిబంధనను వర్తింపజేయాలని పే అండ్ అకౌంట్స్ ఆధికారులు ఉత్తర్వులు ఇచ్చారన్నారు. రాగోలు ఉన్నత పాఠశాల డ్రాయింగ్ ఆధికారికి ఎఫ్ఎసీ ఇచ్చేంతవరకు బిల్లులు మంజూరు కావని స్పష్టం చేశారు.


