కూటమి ప్రభుత్వంలో కొత్త విధానం
కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లకు తప్పని తిప్పలు
మే నెలకు 3,572 మంది జీతం నిలిపివేసిన ప్రభుత్వం
రెండేళ్లకు కలిపి రూ.37 కోట్లు ఇచ్చేందుకు ససేమిరా..
ఫైల్ సీఎం వద్దకు వెళ్లినా దక్కని న్యాయం
సాక్షి, అమరావతి: ఎక్కడైనా ఉద్యోగులు పనిచేయకపోతే జీతం ఇవ్వరు.. కానీ కూటమి ప్రభుత్వంలో మాత్రం పనిచేసినా వేతనం ఇవ్వరని తేలింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో కాంట్రాక్టు లెక్చరర్లు పనిచేసిన కాలానికి వేతనం ఇవ్వకుండా కూటమి సర్కారు వేధిస్తోంది. రెండు విద్యాసంవత్సరాలకు సంబంధించి మే నెలలో వారితో పనిచేయించుకున్నా జీతం అడగొద్దంటోంది. ఇప్పటికే తక్కువ వేతనాలతో ఏళ్ల తరబడి సేవలు అందిస్తున్నామని, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో రెగ్యులర్ లెక్చరర్లతో సమానంగా పనిచేస్తున్నా ఈ వివక్ష ఏంటని అడిగితే.. ‘నోవర్క్–నోపే’ ఉత్తర్వులున్నాయంటోంది.
అయినప్పటికీ 2024 మే నెలకు ఈ సాకు చెప్పిన ప్రభుత్వం.. 2025 మే నెలలోను కాంట్రాక్టు లెక్చరర్లతో పనిచేయించుకుంది. వేతనం అడిగితే మొండిచేయి చూపుతోంది. గత ప్రభుత్వంలో కాంట్రాక్టు లెక్చరర్లు 10 రోజుల విరామంతో 12 నెలల వేతనం అందుకునేవారు. గతేడాది మే నెలలో పనిచేసిన కాలానికి (ఒకరోజు విరామంతో) వేతనం ఇవ్వాలని ఇంటర్ విద్యామండలి నుంచి ఆర్థికశాఖకు ఫైల్ పెట్టారు.
దీనిపై ఆ శాఖ ఉన్నతాధికారులు చేసిన పనిపై పూర్తి నివేదిక (వర్క్ అవుట్‌పుట్) ఇవ్వాలని ఆర్థికశాఖ ఆదేశించింది. దీంతో తిరిగి ఇంటర్ బోర్డు అధికారులు నివేదిక సమర్పించారు. 2025 మే నెలలో కూడా కాంట్రాక్టు లెక్చరర్లతో పనిచేయించుకున్న కూటమి ప్రభుత్వం వేతనం ఇవ్వకుండా వేధిస్తోంది. మొత్తం నివేదిక విద్యాశాఖ మంత్రి వద్ద ఉన్నా నిర్ణయం తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
12 నెలలకు వేతనం ఇస్తామని చెప్పి మోసం
కాంట్రాక్టు లెక్చరర్లకు 10 రోజుల విరామంతో 12 నెలల కాలానికి వేతనం ఇస్తామని 2019లో నాటి టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది. దీనికి మండలిలో ఆమోదం తెలిపినట్టు అదే ఏడాది మార్చి 5వ తేదీన క్యాబినెట్ తరఫున ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు మీడియా ముఖంగా ప్రకటించారు. కానీ మంత్రిమండలిలో ఆమోదించిన అంశంపై ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వలేదు. వైఎస్ జగన్ సీఎం కాగానే కాంట్రాక్టు లెక్చరర్లకు న్యాయం చేయాలని 2019 నుంచి 2023 వరకు అన్ని సంవత్సరాలు వరుసగా 10 రోజుల విరామంతో 12 నెలల జీతాలు చెల్లించారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాత్రం కాంట్రాక్టు లెక్చరర్లను వేధిస్తోంది.
రెండు నెలలకు ఇవ్వాల్సిన వేతనం రూ.37 కోట్లే
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో రెగ్యులర్ లెక్చరర్ల కంటే కాంట్రాక్టు లెక్చరర్లే అధికం. మొత్తం 3,572 మంది కాంట్రాక్టు లెక్చరర్లు పనిచేస్తున్నారు. వీరంతా సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ, పేపర్ల మూల్యాంకనం తదితర విధుల్లో కీలకంగా ఉంటారు. వీరికి ఏటా మే నెలకు రూ.18.50 కోట్లు వేతనంగా ఇవ్వాలి. రెండేళ్లలోను మే నెలకు మొత్తం రూ.37 కోట్లు ఇవ్వాల్సి ఉన్నా.. దానిపై ప్రభుత్వం కొర్రీలు వేస్తోంది. ఆర్థికశాఖ అడిగిన అన్ని నివేదికలు ఇంటర్ బోర్డు ఇచ్చినా వేధించడం గమనార్హం. వీరికి వేతనం చెల్లిస్తే.. సాంకేతిక, డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లకు కూడా ఇవ్వాల్సి ఉంటుందని, దీంతో ప్రభుత్వంపై ఏటా రూ.150 కోట్ల భారం పడుతుందన్న భావనతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి మే నెలలో పనిచేసేది ఒక్క కాంట్రాక్టు లెక్చరర్లు మాత్రమే.


