
ఆదివారం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను శివార్లలో ఏర్పాటు చేసిన ఉగాది వేడుకల్లో పండితుడు వెంకట రామకృష్ణ శాస్త్రి పంచాంగ పఠనాన్ని వింటున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్. చిత్రంలో గట్టు శ్రీకాంత్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతలు
ప్రజాసంకల్ప యాత్ర నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల ఆశీర్వాదం, ప్రజా సంకల్పంతో ముఖ్యమంత్రి కావడం తథ్యమని పంచాంగకర్తలు భవిష్యవాణి వినిపించారు. 2019 మే నెలలో జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్పారు.
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అందించిన సువర్ణ పాలనను ప్రజలు మళ్లీ చూడబోతున్నారని పేర్కొన్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఆదివారం గుంటూరు జిల్లా కాకుమానులో జరిగిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి పురోహితులు ఆశీర్వాదం అందించారు. ప్రజాసంకల్ప యాత్ర శిబిరం వద్ద జరిగిన ఉగాది వేడుకల్లో ప్రముఖ పంచాంగకర్త శ్రీరామకృష్ణ శర్మ, నల్లపెద్ది ప్రసాదశివరామశర్మ తమ బృందంతో పాల్గొని పంచాంగ శ్రవణం చేశారు.
మహారుద్ర సహిత సహస్ర చండీయాగం నిర్వహిస్తాం
విళంబి అంటే పొడవైనదనే అర్థం వస్తుందని, అధిక మాసాలు ఎక్కువ ఉన్నందున దీన్ని పొడవైన సంవత్సరంగా భావించవచ్చని శ్రీరామకృష్ణ శర్మ తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్ 25 వరకూ జగన్‌మోహన్‌రెడ్డి జాతకంలో ఉన్న గోచార సమస్యలు పూర్తి కానున్నాయని తెలిపారు. అవి పూర్తి కాగానే జగన్ కీర్తి మరింత పెరుగుతుందని, 2019 ఎన్నికలకు ముందే ఆయనకు బుధ మహాదశ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఇదంతా తాము ముఖస్తుతి కోసం చెప్పడం లేదన్నారు. 2019లో జరగనున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 135 అసెంబ్లీ సీట్లు వస్తాయని, జగన్ ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు.
40 మంది పంచాంగకర్తలం కూర్చుని భవిష్యత్తులో జరగబోయేదాన్ని అంచనా వేశామని, ఈ అంచనాలు ఏకాభిప్రాయమని అన్నారు. తాను చెప్పింది జరగకపోతే ఇక జీవితంలో మరెక్కడా పంచాంగ శ్రవణం చేయబోనని అన్నారు. జగన్‌కు, రాష్ట్రానికి మంచి జరగాలనే ఉద్దేశంతో ఆరిమండ వరప్రసాదరెడ్డి సహకారంతో మహారుద్ర సహిత సహస్ర చండీయాగం తలపెట్టామని, రెండేళ్లపాటు యాగం నిర్వహిస్తామని, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక జగన్ పూర్ణాహుతి కోసం వస్తారని పురోహితులు శుభ వచనాలు పలికారు. గత నాలుగేళ్లుగా జగన్ ఏ కార్యక్రమం చేపట్టినా అది ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశంతోనేనని చెప్పారు.
నత్తనడకన సాగునీటి ప్రాజెక్టుల పనులు
ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురుస్తాయని, పంటల దిగుబడి కూడా అంతంతమాత్రంగానే ఉంటుందని పంచాంగకర్తలు పంచాంగ శ్రవణంలో తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదని, పనులు నత్తనడకన సాగుతాయని చెప్పారు. పంచాంగ శ్రవణం సందర్భంగా వేద పండి తులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఆశీర్వచనం ఇచ్చారు.
వేద పండితులను ఆయన దుశ్శాలు వాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతలు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, బాలశౌరి, రావి వెంకటరమణ, మేకతోటి సుచరిత, మర్రి రాజశేఖర్, లావు శ్రీకృష్ణదేవరాయలు, అప్పిరెడ్డితోపాటు పెద్దసంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
అందరికీ మంచి జరగాలి: వైఎస్ జగన్
‘‘ఉగాది పర్వదినం సందర్భంగా ఇక్కడికి వచ్చిన అక్కాచెల్లెమ్మలకు, సోదరులకు, అవ్వాతాతలకు, మిత్రులకు, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని శుభాకాంక్షలు తెలియజేస్తున్నా’’ అని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.