
సాక్షి, అమరావతి: కృత్రిమ మేధస్సు, రోబో టెక్నాలజీ వంటి అత్యాధునిక సాంకేతిక రంగాల్లోకి రూ.వేల కోట్ల పెట్టుబడులు తరలి రానున్నాయని, వాటిని అందిపుచ్చుకునే విధానాలను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించు కోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఐటీ శాఖ అధికారులకు సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ విధానాల్లోనూ ఎప్పటికప్పుడు నూతనత్వం ఉండాలని చెప్పారు. చంద్రబాబు శనివారం సచివాలయంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌తో కలసి స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డుపై సమీక్ష నిర్వహించారు.
ఇటీవలే ఫిన్‌టెక్, అగ్రిటెక్, ఎడ్యుకేషన్ ఈవెంట్లను విజయవంతం చేశామని, ప్రతినెలా ఏదో ఒక సదస్సు నిర్వహించడం ద్వారా అంతర్జాతీయ సంస్థలను ఆకట్టుకోవచ్చని తెలిపారు. అన్ని డిగ్రీ కోర్సుల్లోనూ ఐటీని ఒక సబ్జెక్టుగా ప్రవేశపెట్టాలని సూచించారు. అగ్రికల్చర్, మెడికల్ వంటి వృత్తి విద్యా కోర్సుల్లోనూ ఐటీని తప్పనిసరి చేయాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు స్థాపించేందుకు యువతకు శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
రాష్ట్రపతి పర్యటనపై సమీక్ష
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ నెల 27న రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. జన్మభూమి–మా ఊరు కార్యక్రమంలో 5 లక్షల పంట కుంటలను జాతికి అంకితం చేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.