అక్కడంతా ‘మామూలే’గా

Irregularities In Registration Office In East Godavari - Sakshi

ప్రభుత్వానికి అధికాదాయాన్ని ఆర్జించిపెట్టే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల కార్యాలయాలు అవినీతి ఆర్జనలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. జిల్లాలోని 32 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ముడుపుల బాగోతం పరాకాష్టకు చేరింది. ఆనేపథ్యంలో అవినీతి రహిత పాలన అందిస్తామంటున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అవినీతికి ఆస్కారం ఉన్న శాఖల్లో ప్రక్షాళ చర్యలు చేపట్టారు. ఆ క్రమంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ కార్యాలయాల్లో భారీ ఎత్తున స్థానచలనాలు చేశారు.

సాక్షి, రాజమహేంద్రవరం(తూర్పుగోదావరి) : అవినీతిరహిత పాలన అందించడమే ధ్యేయంగా నవ్యాంధ్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదిశగా చర్యలు చేపడుతున్నారు. అయితే ప్రభుత్వానికి అధిక ఆదాయం ఆర్జించే స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ అవినీతి నిలయంగా మారింది. ఇందులో అక్రమార్జన పతాక స్థాయికి చేరింది. దాంతో అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు ఈ శాఖలో డీఐజీ స్థాయి అధికారి నుంచి సబ్‌రిజిస్ట్రార్ల వరకు ఇటీవల స్థానచలనం కల్పించారు. 

జిల్లాలో ఇలా..
స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ పరిధిలోని రాజమండ్రి, కాకినాడ జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో 32 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో మామూళ్ల వసూలు పతాకస్థాయికి చేరుకుంది. లంచాలు తీసుకుంటూ ఒక జిల్లా రిజిస్ట్రార్, సబ్‌రిజిస్ట్రార్లు, సిబ్బంది ఏసీబీకి చిక్కిన సందర్భాలు ఉన్నాయి. అయినా జిల్లాలో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో మామూళ్ల వసూలు ఆగడం లేదు.
అనధికార సిబ్బంది.

డాక్యుమెంట్‌ రైటర్లే వసూళ్ల చక్రవర్తులు
జిల్లా వ్యాప్తంగా 32 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు సిబ్బంది కొరతతో సతమతముతున్నాయి. దాంతో సుమారు 20 మంది వరకు అనధికార సిబ్బంది వాటిలో పనిచేస్తున్నారు. వీరిని నియమించడానికి ప్రభుత్వం నుంచిగాని జిల్లా అధికారుల నుంచి గాని ఎటువంటి అనుమతులు లేకపోయినప్పటికీ సబ్‌ రిజిస్ట్రార్లు తమకు అనుకూలమైన వారిని నియమించుకుని వారితోనే మామూళ్లు వసూలు చేయిస్తున్నారని క్రయవిక్రయదారులు ఆరోపిస్తున్నారు. వీరు లేని చోట డాక్యుమెంటు రైటర్లు ఆపాత్ర పోషిస్తున్నారు.  

ప్రతీ నెల ముడుపుల రూపంలో అందుకున్న మొత్తాన్ని జిల్లా అధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు పంచుకుంటున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా భూముల ధరలు ఎక్కువగా ఉన్న రాజమహేంద్రవరం, పిడింగొయ్యి, కడియం, రాజానగరం, అమలాపురం, సర్పవరం, తుని, కాకినాడ, సామర్లకోట, పిఠాపురం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ప్రతిరోజు లక్షలాది రూపాయలు మామూళ్ల రూపంలో వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. 

అవినీతికి అడ్డుకట్ట
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రిజిస్ట్రేషన్ల శాఖలో భారీ ఎత్తున బదిలీలు చేయడంతో జిల్లాకు కొత్త అధికారులు వచ్చారు. అంతేకాకుండా ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ సొంత జిల్లా కావడంతో ఈ శాఖలో అవినీతిరహితపాలన ఈజిల్లా నుంచే శ్రీకారం చుట్టాలనే ద్యేయంతో కొత్తగా విధుల్లో చేరిన సబ్‌రిజిస్ట్రార్లు ఉన్నారు.  దీంతో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో  అవినీతికి అడ్డుకట్ట పడవచ్చని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

ప్రభుత్వానికి ఏటా జిల్లా నుంచి సుమారు రూ.600 కోట్లకు పైగా ఆదాయం రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి లభిస్తోంది. ఒక్కో డాక్యుమెంటును రిజిస్ట్రేషన్‌ చేసేందుకు ముడుపుల రూపంలో ఒక శాతం క్రయ విక్రయదారులు సమర్పించాల్సి వస్తోంది. ఆ విధంగా వారి నుంచి ఏడాదికి రూ.30 కోట్ల నుంచి రూ. 35 కోట్ల వరకు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ముడుపులు చెల్లించనిదే డాక్యుమెంటును సిబ్బందిగాని, అధికారులు గాని ముట్టడం లేదని క్రయవిక్రయదారులు ఆరోపిస్తున్నారు. 

ప్రజల్లో మార్పు రావాలి
అవినీతిరహిత పాలన జరగాలంటే ప్రజల్లో మార్పు రావాలి. క్రయవిక్రయదారులు డాక్యుమెంట్‌రైటర్లను ఆశ్రయిస్తున్నారు. వారు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఇవ్వాలంటూ వసూళ్లు చేస్తున్నారు. మా సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అనధికార సిబ్బందిని తొలగించాం. క్రయవిక్రయదారులు నేరుగా సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు వచ్చి రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. అప్పుడు అవినీతికి ఆస్కారం ఉండదు. ప్రజల్లో మార్పు వస్తేనే అవినీతిరహితపాలన సాధ్యమవుతుంది.
– షేక్‌ మౌలానా సాహెబ్, జాయింట్‌–1 సబ్‌రిజిస్ట్రార్, రాజమహేంద్రవరం 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top