రైతన్న రెక్కలకష్టం వర్షార్పణమైంది.. వేలకు వేల పెట్టుబడులు భూమిలో కలిసిపోయాయి. సాగుచేసిన పంటలు వరదలకు నాశనమయ్యాయి.
రైతన్న రెక్కలకష్టం వర్షార్పణమైంది.. వేలకు వేల పెట్టుబడులు భూమిలో కలిసిపోయాయి. సాగుచేసిన పంటలు వరదలకు నాశనమయ్యాయి. కంటికిరెప్పలా కాపాడుకున్న కాడెద్దులు కళ్లముందే కొట్టుకుపోయాయి. అప్పులబాధ నుంచి గట్టెక్కుదామని భావించిన అన్నదాతకు కన్నీళ్లే మిగిలాయి. ఈ పరిస్థితుల్లో తమ కష్టాలు వింటారని.. కాసింత పరిష్కారమైనా చూపకపోతారా! అని ఆశించిన వారి ఆశలపై కేంద్ర కరువు బృందం నీళ్లు చల్లింది. వస్తారనుకున్న అధికారులు చీకటివేళకు వచ్చారు.. దీనగాథను చెబుతామనుకుంటుండగానే మొఖంచాటేసి వెళ్లారు..!
అచ్చంపేట, న్యూస్‌లైన్: కేంద్ర కరువు బృందం పర్యటన బుధవారం రెండోరోజు కూడా మొక్కుబడిగా సాగింది. వర్షాలకు పంట కొట్టుకుపోయిన పొలాలను పరిశీలించకుండా, రైతుల గోడును వినిపించుకోకుండానే అధికారులు ముందుకు కదిలారు. ముందస్తు షెడ్యూలు ప్రకా రం జిల్లా యంత్రాంగం నిర్ణయించిన వాటిలో చాలా ప్రాంతాలను చూడకుండానే బృందం సభ్యులు వెళ్లిపోవడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
దీంతో తమ కష్టాన్ని, వరద నష్టాన్ని విన్నవించాలని భావించిన రైతులకు చివరికి నిరాశే ఎదురైంది. అచ్చంపేట మండలం బొమ్మనపల్లిలో కూలిన ఇళ్లు, సిద్దాపూర్ వద్ద కొట్టుకుపోయిన తాగునీటి పైపులైన్, మర్లపాడుతండా వద్దతెగిపోయిన ఆర్‌అండ్‌బీ రోడ్డు, ఘనపూర్, దండ్యాలతండాల వద్ద ఆర్‌అండ్‌బీ రోడ్డును చూడలేదు. తెల్కపల్లి మండలం పర్వతాపురం ఊరచెరువును, దెబ్బతిన్న పంటలు చూడా లి కానీ బృందం సభ్యులు అక్కడి రాలేదని తెలుసుకుని గౌరారం సర్పంచ్ సాయిలీలతో పాటు గ్రామస్తులు కొం దరు చంద్రవాగు బ్రిడ్జి వద్దకు వచ్చి జరిగిన నష్టం గురించి వివరిస్తూ అధికారులకు వినతిపత్రం అందజేశారు. అలాగే అచ్చంపేట మండలం చౌటపల్లిలో దెబ్బతిన్న పంటలు, పంచాయతీరాజ్ రోడ్డును పరిశీలించలేదు. అచ్చంపేట ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజలతో ముఖాముఖి నిర్వహించి విన్నపాలు తీసుకోలేదు. పర్యటనలో రూపొందించిన ఉప్పునుంతల జంపతిసాగర్ బండింగ్, దెబ్బతిన్న పంటలను పరిశీలించకుండానే ముం దుకు కదిలారు.
బృందం పర్యటన సాగిందిలా..
జిల్లాలో ఇటీవల కురిసిన వర్షానికి నష్టం అంచనాలు తెలుసుకునేందుకు వచ్చిన కేంద్ర కరువు బృందం సభ్యులు బుధవారం ఉదయం తెల్కపల్లి మండలం అనంతసాగర్ చెరువు, పరిసరప్రాంతాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. అక్కడి నుంచి బయలుదేరిన బృందం ఏజెన్సీ ప్రాంతంలోని బొమ్మనపల్లి-సిద్దాపూర్ మార్గంలో వరద తాకిడికి కొట్టుకుపోయిన మనుకుప్పలవాగు కల్వర్టును పరిశీలించారు.
భారీగా వరదలకు తెగిపోయిన సిద్దాపూర్ పాతచెరువు, దెబ్బతిన్న వరి పంటలను చూశారు. ఈ చెరువు కింద 428 ఎకరాలు ఆయకట్టు కింద రైతులు వరిసాగు చేశారని కట్ట తెగిపోవడం వల్ల 120 ఎకరాల వరిపంటలో ఇసుకమేటలు వేసిందని ఇరిగేషన్ అధికారులు బృందానికి వివరించారు. దెబ్బతిన్న పద్మరంతండా రోడ్డు పనులు వెంటనే చేపట్టాలని సర్పంచ్ సుజాత, మాజీ సర్పంచ్ రాములు అధికారులను కోరారు.
మర్లపాడుతండా కానుగులవాగు వరద ఉధృతికి దెబ్బతిన్న పంటలు, ఇసుకమేటలు వేసిన పొలాలు, కొట్టుకుపోయిన చెక్‌డ్యాం, విద్యుత్ స్తంభాలను పరిశీలించారు. జరిగిన నష్టాన్ని ఏడీఏ సరళకుమారి, ఏఓ కృష్ణమోహర్, ట్రాన్స్‌కో ఏడీ తావుర్య నాయక్‌లు బృందానికి వివరించారు. అచ్చంపేట- రంగాపూర్ ప్రధాన రహదారిలో ఈ ఏడాది వర్షాల వల్ల మూడుసార్లు కొట్టుకుపోయిన బొల్గట్‌పల్లి చంద్రవాగు తాత్కలిక కల్వర్టు, కొట్టుకుపోయిన రోడ్డు, ప్రగతిలో ఉన్నబ్రిడ్జి నిర్మాణం చూశారు. గిరిజన రైతులు లక్ష్మణ్, నేనావత్ చంద్రు, కొడవత్ శంకర్ జరిగిన పంటనష్టాన్ని సభ్యులకు వివరించారు. పంటపొలాలు పరిశీలించకుండా కేంద్ర బృందం సభ్యులు అలా వెళ్లిపోతే తమకు ఏం న్యాయం జరుగుతుందని బాధిత రైతులు పెదవివిరిచారు.