రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు అంతర్జాతీయ కంపెనీలు 

International companies for huge investments in the state - Sakshi

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి 

తొమ్మిది భారీ ప్రాజెక్టులకు సూత్రప్రాయ ఆమోదం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి పలు అంతర్జాతీయ సంస్థలు ముందుకొస్తున్నాయని పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రానికి తరలివచ్చిన పరిశ్రమల జాబితాను కొత్త ఏడాదికల్లా ప్రజల ముందు ఉంచేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలనుసారం బుధవారం సచివాలయంలోని మంత్రి చాంబర్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. జూన్‌ నుంచి అక్టోబర్‌ వరకు ఐటీ, పరిశ్రమలరంగ ప్రగతి పరిశీలించారు. అనంతరం మంత్రి మేకపాటి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. గడిచిన ఐదు నెలల్లో 12 భారీ ప్రాజెక్టులకు ప్రతిపాదనలు రాగా వీటిలో తొమ్మిదింటికి సూత్రప్రాయ ఆమోదం తెలిపినట్లు చెప్పారు. నవంబర్‌ 18న ముఖ్యమంత్రి వద్ద జరిగే సమీక్షలో ఈ ప్రాజెక్టులపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.

రాష్ట్రానికి భారీగా ప్రాజెక్టులు వస్తుంటే కొన్ని పత్రికలు, ప్రతిపక్ష నేతలు పెట్టుబడులు వెళ్లిపోతున్నాయంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాగా, ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ అధికారం చేపట్టాక రూ. 14,515 కోట్ల విలువైన తొమ్మిది ప్రాజెక్టులు ఉత్పత్తి ప్రారంభించాయని, వీటి ద్వారా 17,702 మందికి ఉపాధి లభించిందని, మరో 20 మెగా ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని సమీక్షలో అధికారులు మంత్రికి తెలిపారు. చిత్తూరు జిల్లాలో వివిధ దశల్లో ఆగిపోయిన ఆరు ప్రాజెక్టులకు మరింత సమయం ఇస్తే 20 వేల మందికి ఉపాధి లభిస్తుందని పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌ భార్గవ్‌ మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఐటీ ప్రమోషన్స్‌కు సంబంధించి ప్రత్యేక ఈవెంట్‌ క్యాలెండర్‌ను విడుదల చేయాలని ఆ శాఖ నిర్ణయించింది.

ఎలక్ట్రానిక్స్‌ విభాగాన్ని తిరిగి పరిశ్రమల శాఖలోకి తీసుకొచ్చే విషయంపై కూడా సమీక్షలో చర్చించారు. ముఖ్యమంత్రి దృష్టికి మీ సేవ ఉద్యోగుల అంశా>న్ని తీసుకెళ్లేందుకు, గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థతో వారిలో ఏర్పడ్డ  భయాందోళనలను తొలగించేందుకు ఉన్న మార్గాలను అన్వేషించాలని అధికారులను మంత్రి కోరారు. ఈ సమీక్షలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్, ప్రత్యేక కార్యదర్శి సుందర్, ఏపీ టీఎస్‌ ఎండీ నంద కిశోర్, డైరెక్టర్‌ (ఐ.టీ ప్రమోషన్స్‌) ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

టీసీఎల్‌ సమస్య పరిష్కరిస్తాం.. 
చైనాకు చెందిన టీసీఎల్‌ కంపెనీ ప్రతినిధులు సమీక్షకు ముందు మంత్రిని కలిసి చిత్తూరు జిల్లా వికృతమాల వద్ద ఏర్పాటు చేయనున్న టీవీ అసెంబ్లింగ్‌ యూనిట్‌ ప్రాజెక్టు పురోగతిని వివరించారు. విద్యుత్, నీటి, రవాణా వంటి మౌలిక వసతుల్లో సమస్యలను పరిష్కరించాల్సిందిగా కోరారు. దీనిపై స్పందించిన మంత్రి మేకపాటి.. సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి 10 రోజుల్లో్ల పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రూ. 2,200 కోట్లతో 139 ఎకరాల్లో టీసీఎల్‌ ఈ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top