విద్యార్థులకు తొలి ‘పరీక్ష’

Inter Exams Facilities Not Implemented - Sakshi

ఇంటర్‌ విద్యార్థులకు ‘తొలి’ రోజే పరీక్ష తప్పలేదు. అసౌకర్యాల నడుమ ఇంటర్‌ ప్రథమ సంవత్సర పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. విద్యార్థులకు పూర్తిస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశామని ఆర్భాటంగా అధికారులు ప్రకటనలు చేశారు. అయితే జిల్లాలోని పలు ప్రాంతాల్లో పరీక్ష సమయం అవుతున్నా ఏర్పాట్లు చేస్తూ కనిపించారు. పలు కేంద్రాల్లో తాగునీటికి సౌకర్యం లేక విద్యార్థులు అవస్థ పడడం కనిపించింది. కొన్ని ప్రాంతాల్లో సరైన వెలుతురు లేక విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు.

చీకటి గదుల్లోనే పరీక్ష రాయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఏఎన్‌ఎంలు, ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌లు కూడా అంతంత మాత్రంగానే ఏర్పాటు చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెల్లూరు నగరంలో ఎక్కడపడితే అక్కడ రోడ్లను తవ్వేయడంతో విద్యార్థులకు ట్రాఫిక్‌ సమస్యలు తప్పలేదు. గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి. ఎంత ముందుగా బయలుదేరినా.. ఆఖరి నిమిషంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునే పరిస్థితి ఏర్పడింది.

నెల్లూరు (టౌన్‌): ఇంటర్‌ పరీక్ష కేంద్రాల్లో సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. వీఆర్‌ కళాశాల, జిల్లా పరిషత్‌ హైస్కూల్, మెజార్టీ కార్పొరేట్‌ జూనియర్‌ కళాశాలల్లోని పరీక్ష కేంద్రాల్లో సరిగా వెలుతురు లేక పోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. చీకటిలోనే పరీక్ష రాసిన పరిస్థితి నెలకొంది. కొన్ని కేంద్రాల్లో నామమాత్రంగా ఒక లైటు బిగించి చేతులు దులుపుకున్నారు. ప్రతి రూముకు తాగునీటి వసతి కల్పించాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు చేపట్ట లేదు.

చాలా కేంద్రాల్లో పరీక్షకు అరగంట ముందుగా ఏర్పాట్లు చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. నగరంలోని పొదలకూరు రోడ్డులోని జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ కేంద్రలో పరీక్షకు అరగంట ముందు సీసీ కెమెరాలు బిగిస్తున్నారు. రూముల్లో కూడా కుర్చీలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. అక్కడ సిబ్బంది వాటిని పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు. ప్రతి కేంద్రంలో ఏఎన్‌ఎంతో పాటు వైద్య కిట్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే ఎక్కడా అవి కనిపించలేదు. పరీక్ష ప్రారంభమైనా కూడా ఏఎన్‌ఎం ఎవరూ రాకపోవడం గమనార్హం. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు సైతం నామమాత్రపు విధులు నిర్వహించారు. పరీక్ష ప్రారంభానికి ముందు మాత్రమే ఒక కానిస్టేబుల్‌ రావడం విశేషం.

నెల్లూరులో ట్రాఫిక్‌ కష్టాలు 
అభివృద్ధి పేరుతో అధికారులు నగరంలో ఎక్కడపడితే అక్కడ రోడ్లను తవ్వేశారు. ఏ ప్రాంతంలోనూ పూర్తిస్థాయిలో పనులు చేసిన పరిస్థితి లేదు. దీంతో ఉదయం సమయంలో ఒకవైపు పరీక్షకు హాజరయ్యే విద్యార్థులతో వాహనాలు, మరో వైపు పాఠశాలలకు విద్యార్థులను తీసుకు వెళ్లే వాహనాలతో ట్రాఫిక్‌ జామ్‌ అయింది. దీంతో పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు టెన్షన్‌ పడ్డారు. ప్రధానంగా స్టోన్‌హౌస్‌పేట, ఆత్మకూరు బస్టాండ్, మినీబైపాస్, వీఆర్సీ, ఆర్టీసీ తదితర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఆయా కూడళ్లలో పోలీసులు కనిపించలేదు. ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు పోలీసుశాఖ ముందస్తు చర్యలు తీసుకోలేదన్న విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. పరీక్ష ముగిసిన తర్వాత కూడా విద్యార్థులకు ట్రాఫిక్‌ కష్టాలు తప్పలేదు. చాలా మంది తల్లిదండ్రులు బైక్‌లతోనే విద్యార్థులను పరీక్ష కేంద్రాలకు తీసుకెళ్లిన పరిస్థితి ఉంది.

కేంద్రాల వద్ద కోలాహలం..
ఆలయాలు, ఇంటర్‌ పరీక్ష కేంద్రాల వద్ద కోలాహలం కనిపించింది. దేవాలయాల్లో విద్యార్థులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.  పరీక్ష కేంద్రాలకు విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు, బంధువులు కూడా రావడంతో రద్దీగా కనిపించింది. విద్యార్థులు హాల్‌ టికెట్‌ నంబర్లను కళాశాల బయట డిస్‌ప్లేలో ఉంచారు. ఈ నేపథ్యంలో నంబర్లు చూసుకునేందుకు విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు గమిగూడారు. విద్యార్ధులు పరీక్ష రాసేందుకు గదిలోకి వెళ్లగా తల్లిదండ్రులు, బంధువులు పరీక్ష కేంద్రాల వద్ద బయట నిరీక్షించారు.

మాస్‌ కాపీయింగ్‌ ఆరోపణలు 
ఇంటర్‌ ప్రథమ సంవత్సర పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌క పాల్పడ్డారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా కార్పొరేట్, ప్రైవేట్‌ యాజమాన్యాలే మాస్‌ కాపీయింగ్‌కు తెరలేపారన్న ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా నారాయణ, శ్రీచైతన్య, తోటపల్లిగూడూరు, చేజర్ల, అల్లూరు, సౌత్‌మోపూరు, రాపూరు, ఉదయగిరి తదితర ప్రాంతాల్లో జోరుగా మాస్‌ కాపీయింగ్‌ జరిగిందని తెలిసింది. 

820 మంది విద్యార్థులు గైర్హాజరు
ఇంటర్‌ ప్రథమ సంవత్సర పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగాయి. తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం సబ్జెక్టులకు సంబంధించిన పరీక్ష జరిగింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 90 కేంద్రాల్లో నిర్వహించారు.  జిల్లా వ్యాప్తంగా 27610 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 26790 మంది హాజరయ్యారు. 820 మంది విద్యార్ధులు గైర్హాజరయ్యారు. జనరల్‌కు సంబంధించి 26510 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 25793 మంది హాజరయ్యారు. 717 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. అదే విధంగా ఒకేషనల్‌కు సంబంధించి 1100 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 997మంది హాజరయ్యారు. 103 మంది విద్యార్ధులు గైర్హాజరయ్యారు. ఆర్‌ఐఓ సత్యనారాయణ డీకేడబ్ల్యూ, వీఆర్‌ కళాశాలలతో పాటు మరో రెండు కళాశాలలను తనిఖీలు నిర్వహించారు. సిటింగ్, స్క్వాడ్‌ అధికారులు జిల్లాలో 63 కేంద్రాలను పరిశీలించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top