ఆగని ఇసుక దోపిడీ | Inexpensive Sand Exploitation | Sakshi
Sakshi News home page

ఆగని ఇసుక దోపిడీ

Mar 19 2019 11:57 AM | Updated on Mar 19 2019 11:59 AM

Inexpensive Sand Exploitation - Sakshi

ఉసులుమర్రు ర్యాంపు వద్దకు గోదావరిలో నుంచి వస్తున్న వందలాది ట్రాక్టర్లు 

సాక్షి, పెరవలి: జిల్లాలో ఇసుక మాఫియాకు అడ్డాగా ఉన్న పెరవలి మండలంలో తెలుగుతమ్ముళ్లు బరితెగించారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నా తమ ఇసుక దందా మాత్రం ఆపడం లేదు. ఎక్కడికక్కడ ఇసుక నిల్వలు వేసి అధిక ధరలకు అమ్మకాలు సాగిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం తమకుపట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఉచిత ఇసుక విధానంలో ఇసుకను నిల్వచేయకూడదని నిబంధనలు ఉన్నా అధికారపార్టీ నాయకులకు, అధికారులకు ఇవేమీ పట్టడం లేదు. గతంలో నిబంధనలకు విరుద్ధంగా గోదావరికి తూట్లు పొడిచినప్పుడు కూడా అధికార యంత్రాంగం ఇలాగే ప్రేక్షకపాత్ర పోషించింది. 
 

పత్తాలేని అధికారులు
ఉచిత ఇసుక విధానంలో ఎక్కడా నిల్వలు చేయకూడదని అలా చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించిన అధికారుల ప్రకటనలు ఆర్భాటానికే పరిమితమవుతున్నాయి. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన రెవెన్యూ, పోలీస్, మైనింగ్‌ డిపార్టుమెంటు అధికారులు పట్టించుకోకపోవడంతో దళారీలు మరింత రెచ్చిపోతున్నారు. 


ఎక్కడికక్కడ నిల్వలు
నియోజకవర్గంలో నిడదవోలు మండలంలో పెండ్యాల, పురుషోత్తపల్లి, కోరుపల్లి,  పెరవలి మండలంలో ఉసులుమర్రు, కానూరు, నడుపల్లి, కానూరు అగ్రహారం, తీపర్రు గ్రామాల్లో వందలాది లారీల నిల్వలు ఉన్నా అధికారులు కన్నెత్తి చూడటంలేదు. స్థానికులు  ఈ లారీల మోత భరించలేక అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవటంలేదని వాపోతున్నారు. రోడ్డు పక్కన, పుంతరోడ్లు, లేఅవుట్‌లలో వేస్తున్నారు. ఇలా వేసినందుకు ఆయా శాఖల అధికారులకు ముడుపులు అందుతున్నట్టు సమాచారం.


రోజుకు రూ.30 వేల పైగా ఆదాయం
ఇసుక గుట్టల నుంచి యూనిట్‌కి రూ.1000 చొప్పున వసూలు చేస్తున్న దళారీలు ఒకలారీకి రూ.3 వేలు మిగలడంతో తెలుగు తమ్ముళ్లు అంతా ఇసుక దందానే కొనసాగిస్తున్నారు. రోజుకి 10 లారీలు చొప్పున ఒక్కో నాయకుడు అక్రమంగా ఇసుకను విక్రయిస్తున్నాడు. అంటే ఒక్కొక్కరూ రోజుకు రూ.30 వేల వరకు ఇసుక దోపిడీలో సంపాదిస్తున్నారు. 


అడ్డూఅదుపూ లేకుండా తోలకాలు
అధికార పార్టీ నాయకుల వాహనాలకు అడ్డు చెప్పే ధైర్యం అధికారులకు లేకపోవడంతో వీటిపై ఎలాంటి ఆంక్షలు ఉండటం లేదు. నేరుగా ర్యాంపులోకి వెళ్లి ఇష్టమొచ్చినంత లోడ్‌ చేసుకుని వెళ్లిపోతున్నారు. దీనిపై కూలీలు కూడా మండిపడుతున్నారు. నిబంధనల కంటే అధికంగా లోడ్‌ చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. 


నిబంధనలకు తూట్లు
రెండు యూనిట్లు మించి వాహనాల్లో ఇసుక తరలించకూడదని నిబంధనలు ఉన్నా తెలుగు తమ్ముళ్లు చేస్తున్న వ్యాపారానికి వినియోగిస్తున్న వాహనాలు అన్ని 5 యూనిట్ల బండ్లే కావడం విశేషం. వీటితో దర్జాగా రోడ్లుపై రవాణా చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. 5 యూనిట్ల వాహనాల్లో ఇసుక తరలించకూడదని అలా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్న అధికారులు మాటలు కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. ఈ వాహనాల ఎగుమతులకు దళారీలు పొక్లెయినర్లను వినియోగిస్తున్నా అధికారులకు పట్టడం లేదు. కానూరులో ఒక వ్యక్తి అక్రమ నిల్వలపై నేరుగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తే అతనిపై దళారీలు పరువునష్టం దావా వేసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. 


మామూళ్ల మత్తులో అధికారులు
అక్రమంగా నిల్వ చేసుకున్న ఇసుక గుట్టల జోలికి అధికారులు రాకుండా ఉండేందుకు రెవెన్యూ, పోలీసులకు భారీ మొత్తంలో మామూళ్లు అందుతున్నట్టు సమాచారం. అందుకే అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ నిల్వలకు గాను 10 రోజులకు రెవెన్యూ అధికారులకు రూ.3 వేల చొప్పున ఇస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement