సమరయోధుల పురిటిగడ్డ నాగుల్లంక

Independence Movement Leaders In Nagullanka Village - Sakshi

సాక్షి, పి.గన్నవరం : స్వాతంత్య్ర సంగ్రామంలో పి.గన్నవరం మండలం నాగుల్లంక గ్రామం ప్రత్యేకతను సంతరించుకుంది. 22 మంది పోరాట యోధులను స్వాతంత్య్ర ఉద్యమానికి అందించిన ఘనత ఈ గ్రామానికి దక్కుతుంది. నాగుల్లంకకు చెందిన ఉద్యమకారులు స్వాతంత్య్ర పోరాటంలో కీలకపాత్ర వహించి చరిత్రలో నిలిచారు. వీరిలో పలువురు జైలుశిక్ష కూడా అనుభవించారు. దీంతో పలువురికి నాటి ప్రభుత్వాలు తామ్రపత్రాలను అందించాయి. స్వాతంత్య్ర పోరాటంలో వీరి త్యాగానికి చిహ్నంగా 2002లో అప్పటి ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమా నాగుల్లంకలో ‘స్వాతంత్య్ర సమర యోధుల స్మారక స్థూపాన్ని’ ఆవిష్కరించారు.

స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న ఆరుమిల్లి వెంకటరత్నం, ఆరుమిల్లి విశ్వేశ్వరర రావు, ఆరుమిల్లి సుబ్బారావు, అడబాల నర్శింహ మూర్తి, గ్రంధి సూరన్న, ఆరుమిల్లి చౌదరి, ఆరుమిల్లి తాతయ్య, బద్దే ప్రకాశ రావు, గ్రంధి శ్రీరామ మూర్తి, గ్రంధి మూలాస్వామి, గ్రంధి సత్యం, కడలి పద్దయ్య, శ్రీఘాకోళపు వీరరాఘవులు, వలవల వీరన్న, మద్దా పెరుమాళ్లస్వామి, చిట్టినీడి మంగయ్య నాయుడు, ఆరుమిల్లి వెంకన్న, మీనపల్లి వెంకటరత్నం, చెన్ను ముత్యం, ఆకుల రఘుపతి, అద్దేపల్లి నర్సింహ మూర్తి, గద్దే లచ్చన్న పేర్లను ఈ స్థూపంపై చెక్కించారు. అప్పటి నుంచి ప్రతి ఆగస్టు 15న ఈ స్థూపం వద్ద గ్రామస్తులు స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. తమ గ్రామానికి చెందిన  ఉద్యమకారులను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top