‘డేగల’పై ఐటీ అధికారుల కన్ను

Income Tax raids on TDP leader Degala Prabhakar - Sakshi

 రెండు రోజులుగా కొనసాగుతున్న దాడులు

 ఆయన ఇంటిలోనే తాడికొండ ఎమ్మెల్యే కార్యాలయం

 డేగల ఇల్లు, ఫార్మశీల్లో విలువైన డాక్యుమెంట్లు లభ్యం

 బినామీ పేర్లతో 20 వరకు మెడికల్‌ షాపుల నిర్వహణ!

సాక్షి, గుంటూరు: గుంటూరులో పన్ను ఎగవేతదారులైన బడాబాబుల ఇళ్లు, వ్యాపారాలపై ఐటీ అధికారులు రెండు రోజులుగా సోదాలు చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఫిరంగిపురం మండల అధ్యక్షుడు డేగల ప్రభాకర్‌ ఇల్లు, ఫార్మసీ కార్యాలయాల్లో బుధ, గురువారాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో రియల్‌ ఎస్టేట్‌కు చెందిన అత్యంత విలువైన డాక్యుమెంట్లతో పాటు, భారీగా ఆస్తులు, బ్యాంకు పాస్‌పుస్తకాలు, వ్యాపార సంబంధిత డాక్యుమెంట్లు బయటపడినట్లు తెలుస్తోంది. లక్ష్మీపురం, కొత్తపేట, పెదకాకాని రోడ్లలోని వ్యాపార సముదాయాలతో పాటు లాల్‌పురం రోడ్డులోని వెంచర్లకు సంబంధించిన కార్యాలయాలు, ఇళ్లపై ఐటీ అధికారులు దాడులు చేసి సోదాలు చేస్తున్నారు.

డేగలకు చెందిన సెవన్‌హిల్స్‌ ఫార్మసీ సముదాయాన్ని నవంబరు 1న ప్రారంభిస్తున్న మంత్రి కామినేని, పక్కన డేగల ప్రభాకర్, కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ రామానుజయ, మద్దాళి గిరి తదితరులు

ఆదాయ పన్ను ఎగవేత దారుల జాబితాలో డేగల పేరు ఉండటంతో గత కొన్ని రోజులుగా నిఘా ఉంచిన ఐటీ అధికారులు బుధవారం మధ్యాహ్నం నుంచి ఏక కాలంలో డేగలతో పాటు ఆయన భాగస్వాముల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేస్తున్నారు. నగరంలో అత్యంత రద్దీగా ఉండే కొత్తపేటలో సెవన్‌హిల్స్‌ ఫార్మసీ పేరుతో అత్యంత అధునాతన సౌకర్యాలతో కూడిన ఫార్మసీ భవనాన్ని 2 నెలల క్రితం ఆర్భాటంగా ప్రారంభించారు. ఆ కార్యక్రమంలో మంత్రి డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌తో పాటు, అధికార పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. డేగల ప్రభాకర్‌ తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌కు సన్నిహితుడు. డేగలకు చెందిన భవనంలోనే శ్రావణ్‌కుమార్‌ ప్రస్తుతం తన కార్యాలయాన్ని సైతం నడుపుతున్నారు. ఇటీవల గుంటూరు నగర టీడీపీ అధ్యక్ష పదవికి సైతం డేగల పోటీ పడ్డాడు. అధికార పార్టీకి చెందిన డేగల ప్రభాకర్‌ వ్యాపార సముదాయాలపై ఐటీ దాడులు జరగడం నగరంలో చర్చనీయాంశమైంది.

అనతి కాలంలోనే.. కోట్లకు పడగలెత్తిన డేగల
ఫిరంగిపురం మండలం 113 త్యాళ్లూరుకు చెందిన డేగల ప్రభాకర్‌ సామాన్య కుటుంబంలో జన్మించాడు. పదిహేనేళ్ల క్రితం గుంటూరులోని మెడికల్‌ షాపులో గుమాస్తాగా పనిచేసిన డేగల రెండేళ్లలో సొంతంగా మెడికల్‌ షాపును పెట్టారు. అనంతరం ప్రాప్రగండ డిస్ట్రిబ్యూషన్‌ పేరుతో డీలర్‌షీప్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం గుంటూరులోని సుమారు 20 ఆస్పత్రుల్లో ఉన్న మెడికల్‌ షాపులు డేగల బినామీ పేర్లతో నిర్వహిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం డేగల ప్రభాకర్‌ భార్య 113 త్యాళ్లూరు గ్రామ సర్పంచ్‌గా ఉన్నారు. కేంద్రం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న తరువాత మెడికల్‌ షాపుల్లో పాత నోట్లు తీసుకునేందుకు అనుమతులు ఇచ్చింది. ఆ సమయంలో గుంటూరుకు చెందిన పలువురు వైద్యులు ఇతని బినామీలకు చెందిన మెడికల్‌ షాపుల్లో భారీ ఎత్తున డబ్బులు మార్చారనే ఆరోపణలు వినిపించాయి. పలు రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లలో డేగలకు భాగస్వామ్యం ఉన్నట్లు విచారణలో తేలినట్లు తెలిసింది.


ఐటీ సోదాలు జరుగుతుండటంతో మూసివేసిన డేగలకు చెందిన  సెవన్‌హిల్స్‌ ఫార్మసీ సముదాయం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top