పుణె కరెన్సీ కేసులో హైదరాబాద్‌ లింకు !

Hyderabad Police Crime Branch Reached Pune For Toy Currency Case - Sakshi

వారం క్రితం రూ.87 కోట్ల టాయ్‌ కరెన్సీ స్వాధీనం

ట్రస్టీలను మోసం చేయడానికి కుట్ర పన్నిన ముఠా

ఆర్మీ జవాన్‌ సహా ఆరుగురు నిందితుల అరెస్టు

బొమ్మ డాలర్లు సిటీలో ఖరీదు చేసినట్లు గుర్తింపు

దర్యాప్తు కోసం పుణెకు క్రైమ్‌ బ్రాంచ్‌ టీమ్‌

సాక్షి, సిటీబ్యూరో: మహారాష్ట్రలోని పుణెలో వెలుగులోకి వచ్చిన భారీ టాయ్‌ కరెన్సీ కేసులో హైదరాబాద్‌ కోణం బయటపడింది. ఈ ముఠా టాయ్‌ అమెరికన్‌ డాలర్లను నగరం నుంచే ఖరీదు చేసినట్లు పుణె క్రైమ్‌ బ్రాంచ్‌ గుర్తించింది. దీంతో తదుపరి దర్యాప్తులో భాగంగా ఓ ప్రత్యేక బృందం మంగళవారం హైదరాబాద్‌కు చేరుకుంది. ఈ గ్యాంగ్‌ చేతిలో మోసపోయిన సంస్థల్లో సిటీకి చెందినవీ ఉన్నాయా? అనే కోణంలోనూ ఆరా తీస్తోంది. పుణె పోలీసులతో పాటు మిలటరీ ఇంటెలిజెన్స్‌ అధికారులు సంయుక్తంగా ఈ నెల 10న ఓ ఆపరేషన్‌ నిర్వహించారు. పుణెలోని విమంతల్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని విమన్‌నగర్‌ సంజయ్‌ పార్క్‌ ఏరియాలో దాడి చేశారు. ఈ నేపథ్యంలో ఆర్మీ జవాన్‌ షేక్‌ ఆలం గులాబ్‌ ఖాన్‌తో పాటు సునిల్‌ భద్రీనాథ్‌ శ్రద్ధ, రితేష్‌ రత్నాకర్, తుఫిల్‌ అహ్మద్‌ మహ్మద్‌ ఇషార్‌ ఖాన్, అబ్దుల్‌ ఘనీ రహ్మతుల్లా ఖాన్, అబ్దుల్‌ రెహ్మాన్‌ అబ్దుల్‌ ఘనీ ఖాన్‌లను పట్టుకున్నారు.

వీరి నుంచి రూ.87 కోట్ల విలువైన భారత్, అమెరికా టాయ్‌ కరెన్సీలు స్వాధీనం చేసుకున్నారు. పుణెలోని ఆర్మీ యూనిట్‌లో పని చేస్తున్న గులాబ్‌ ఖాన్‌ ఈ ముఠాకు సూత్రధారు అని మిలటరీ ఇంటెలిజెన్స్‌కు అందిన సమాచారం మేరకు ఈ దాడి జరిగినట్లు పుణె క్రైమ్‌ బ్రాంచ్‌ ప్రకటించింది. ఈ టాయ్‌ కరెన్సీ కట్టలకు ముందు, వెనుక అసలు నోట్లను పొందుపరిచారు. ఇలా వివిధ డినామినేషన్స్‌లో ఉన్న రూ.2.09 లక్షలు కరెన్సీని వాడారు. ఈ కేసు దర్యాప్తు కోసం పుణె క్రైమ్‌ బ్రాంచ్‌ నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. న్యాయస్థానం అనుమతితో నిందితుల్ని కస్టడీలోకి తీసుకున్న క్రైమ్‌ బ్రాంచ్‌ వివిధ కోణాల్లో ప్రశ్నించింది. ఈ నేపథ్యంలోనే దేశవిదేశాల్లో ఉన్న అనేక సంస్థల నుంచి ఫండ్స్‌ ఇప్పిస్తామంటూ ట్రస్టీలను వీరు మోసం చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. భారీ స్థాయిలో నల్లధనం ఉన్న దాతలు, కంపెనీలు ఆ మొత్తాలను ఫండ్‌గా ఇస్తాయంటూ నమ్మబలికే వారనీ సమాచారం. ఈ కరెన్సీతో వీడియోలు చిత్రీకరించే వాళ్ళు. ప్రతి వీడియోలోనూ ఆ రోజు న్యూస్‌ పేపర్‌ కనిపించేలా చేసి తాజావని నమ్మించే వారు. పుణె క్రైమ్‌ బ్రాంచ్‌ పరిశీలించిన వీడియోల్లో కొన్ని ప్రైవేట్‌ సంస్థలు, మల్టీ నేషనల్‌ కంపెనీల పేర్లు ప్రస్తావించినట్లు తెలిసింది.

రెండు బృందాలుగా..
తమకు కమీషన్‌ కావాలంటూ డిమాండ్‌ చేసి ఆ మొత్తం కాజేసేవారని, ఆపై ఎలాంటి ఫండ్‌ ఇప్పించకుండా మోసం చేసేవాళ్ళని క్రైమ్‌ బ్రాంచ్‌ తెలిపింది. ఈ గ్యాంగ్‌లోని సభ్యులు రెండు బృందాలుగా ఏర్పడి ఒకరి భారత్‌ కరెన్సీ, మరొకరు అమెరికన్‌ డాలర్లు ఫండ్స్‌గా ఇప్పిస్తామంటూ మోసం చేసేవారని క్రైమ్‌ బ్రాంచ్‌ తేల్చింది. గులాబ్‌ ఖాన్‌ ప్రధాన దళారీగా, మిగిలిన వారు డోనర్లుగా అవతారం ఎత్తి మోసాలకు పాల్పడేవాళ్లు. ఇలా కథలు చెప్పి, కరెన్సీ వీడియోలు చూపి ఇప్పటి వరకు 20–25 సంస్థల నుంచి అందినకాడికి దండుకున్నారని అనుమానిస్తోంది. దీనికోసం పుణేలోని సంజయ్‌ పార్క్‌ ఏరియాలో గత ఏడాది అక్టోబర్‌లో ఓ పాత బంగ్లాను అద్దెకు తీసుకున్నారు. ఇందులోనే ముఠాతో పాటు టాయ్‌ కరెన్సీ చిక్కింది. ఈ ముఠాను సోమవారం పుణే కోర్టులో హాజరుపరిచిన క్రైమ్‌ తదుపరి దర్యాప్తు నిమిత్తం ఈ నెల 20 వరకు కస్టడీలోకి తీసుకుంది. విచారణలో భాగంగా వీరికి ఈ టాయ్‌ కరెన్సీ ఎక్కడ నుంచి వచ్చిందనే అంశంపై దృష్టి పెట్టింది. ఫలితంగా ముంబైలోని క్రాఫోర్డ్‌ మార్కెట్‌ నుంచి భారత్‌ టాయ్‌ కరెన్సీ, హైదరాబాద్‌ నుంచి అమెరికన్‌ టాయ్‌ డాలర్లు ఖరీదు చేసినట్లు తేలింది.

టాయ్‌ డాలర్లపై ఫోకస్‌
రూ.4.7 కోట్ల విలువైన ఈ టాయ్‌ డాలర్లను ఎందుకు తయారు చేశారనే దానిపై   క్రైమ్‌ బ్రాంచ్‌ దృష్టి పెట్టింది. చిన్నారులు ఆడుకోవడానికి ఇలాంటి టాయ్‌ కరెన్సీ విక్రయిస్తూ ఉంటారు. అయితే ఈ స్థాయిలో ముద్రించరని క్రైమ్‌ బ్రాంచ్‌ అధికారులు చెప్తున్నారు. దీంతో ఈ ముద్రణ చేసిన వారికీ గ్యాంగ్‌తో సంబంధాలు ఉన్నాయా? లేక డబ్బు కోసమే ఇలా చేశారా? అనే దానిపై దృష్టి పెట్టారు. ఈ సందేహాలు నివృతి చేసుకోవడానికి ఓ ప్రత్యేక బృందం మంగళవారం సిటీకి చేరుకుంది. మరోపక్క ఈ గ్యాంగ్‌ లీడర్‌ గులాబ్‌ ఖాన్‌ తాను హైదరాబాద్‌కు చెందిన నిజాం నవాబు వారసుడిని అంటూ అనేక మందికి చెప్పాడని, దానికి ఆధారంగా తమ బంగ్లా అంటూ కొన్ని ఫొటోలను చూపాడని క్రైమ్‌ బ్రాంచ్‌ తేల్చింది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top