‘స్మగ్లర్’ వేట! | hunting for smuggler's | Sakshi
Sakshi News home page

‘స్మగ్లర్’ వేట!

Sep 28 2013 4:52 AM | Updated on Aug 21 2018 5:44 PM

ఇందూరును కేంద్రంగా చేసుకుని పెద్ద ఎత్తున గంజాయి రవాణా కు పాల్పడుతున్న నగరానికి చెందిన ఓ బడా స్మగ్లర్ కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు.

 సాక్షి, నిజామాబాద్ :
 ఇందూరును కేంద్రంగా చేసుకుని పెద్ద ఎత్తున గంజాయి రవాణా కు పాల్పడుతున్న నగరానికి చెందిన ఓ బడా స్మగ్లర్ కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. సివిల్ పోలీసులతో పాటు, జీఆర్‌పీ పోలీసులూ ఇందులో భాగస్వాములయ్యారు. గంజాయి రవాణాలో ఆరితేరిన ఈ స్మగ్లర్ మహారాష్ట్రలో తలదాచుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. కొన్నేళ్లుగా యథేచ్ఛగా దందా కొనసాగిస్తున్న ఈ కేటుగాడికి పోలీసుశాఖలోని కొందరు అధికారులు, సిబ్బంది పరోక్షంగా సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో ఉన్నతాధికారులు ఇతడిని పట్టుకునేందుకు
 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ కేసు దర్యాప్తు తీరును అదనపు డీజీ స్థాయి అధికారి ఒకరు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిసింది. పోలీసుల సహకారం ఉందని అనుమానిస్తున్న నేపథ్యంలో కేసు దర్యాప్తు విషయంలో ఉన్నతాధికారులు గోప్యంగా వ్యవహరిస్తున్నారు. ఎలాంటి వివరాలు బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
 రైల్వే కేసులో ప్రమేయం?
 ఇటీవల రైలులో రవాణా అవుతున్న గంజాయిని జీఆర్‌పీ పోలీసులు పట్టుకున్నారు. అయితే ఆ గంజాయిని రైల్వే పోలీసులే కాజేశారు. దీనిని తీవ్రంగా పరిగణించిన అధికారులు ప్రధాన నిందితులైన ఎస్‌ఐ హన్మాండ్లు, హెడ్ కానిస్టేబుల్ సయ్యద్‌ఖాన్‌లపై ఎన్‌డీపీఎస్ చట్టంతో పాటు, పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వారిని అరెస్టు చేశారు. ఈ కేసులోనూ నగరానికి చెందిన సదరు గంజాయి స్మగ్లర్ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మూడో నిందితునిగా ఆ స్మగ్లర్‌ను చేర్చి విచారణ జరుపుతున్నారు.
 
 ‘మహా’ ముఠాలతో సంబంధాలు..
 పెద్దఎత్తున గంజాయి స్మగ్లింగ్ కార్యకలాపాలు సాగించే మహా రాష్ట్రకు చెందిన ముఠాలతో జిల్లాకు చెందిన గంజాయి స్మగ్లర్‌కు సంబంధాలున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో గంజాయి సాగు చేస్తున్న వారి నుంచి, రాష్ట్రంలో వివిధ చోట్ల నుంచి సేకరించిన గంజాయిని మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్, షిర్డీ, యావత్‌మాల్, పాండ్రకోడ వంటి ప్రాంతాలకు రవాణా చేస్తున్నట్లు సమాచారం.
 
 సాధారణం నుంచి..
 ఇన్నాళ్లు సాధారణ గంజాయినే రవాణా చేసిన సదరు స్మగ్లర్ ఇటీవలి కాలంలో తన పంథాను మార్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. అత్యంత విలువ చేసే మేలు రకం గంజాయినే రవాణా చేస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. తనకున్న మందీ మార్బలంతో, బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్ చేసిన వాహనాల్లో యథేచ్ఛగా గంజాయిని రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీ నేతల అండదండలుండడంతో ఇతడి కార్యకలాపాలను అడ్డుకునేవారు కరువయ్యారు. ఇటీవల ఓ ప్రముఖ నేత ఆధ్వర్యంలో సదరు స్మగ్లర్ రాజకీయ రంగ ప్రవేశం కూడా చేశారు. తన పలుకుబడిని ఉపయోగించుకుంటూ ఎలాగైనా  కేసుల నుంచి బయటపడేందుకు అతడు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement