తొలి ‘స్పందన’కు అర్జీల వెల్లువ

Huge Applications for Spandhana Programme - Sakshi

అన్ని జిల్లాల్లోనూ కనీవినీ ఎరుగని సంఖ్యలో అందిన వినతులు

సమస్య పరిష్కార గడువు తేదీ వేసి అర్జీదారులకు రశీదులు

నెల్లూరులో దివ్యాంగుడికి అప్పటికప్పుడు ట్రై సైకిల్‌ పంపిణీ

సాక్షి నెట్‌వర్క్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్పందన’ కార్యక్రమానికి అన్ని జిల్లాల్లో అనూహ్య స్పందన లభించింది. సోమవారం నిర్వహించిన కార్యక్రమానికి గతంలో ఎన్నడూ లేనివిధంగా వినతులు వెల్లువెత్తాయి. ప్రతిచోటా వచ్చిన ప్రతి అర్జీదారుడినీ పలకరించి.. వారికొచ్చిన సమస్యేమిటో అధికారులు తెలుసుకున్నారు. సమస్యను ఎప్పటిలోగా పరిష్కరించగలమో ఆ తేదీని కూడా పేర్కొంటూ రసీదులు ఇవ్వడంతో అర్జీదారులు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఈ తరహాలో అధికారులు స్పందించే వారు కాదని, తీసుకున్న అర్జీలు ఏం చేసేవారో కూడా తెలిసేది కాదనీ వినతులిచ్చేందుకు వచ్చిన వారు చెప్పారు. తొలిసారి ప్రతి అర్జీకి పరిష్కార గడువు తేదీని కూడా నిర్దేశిస్తూ రసీదు ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. విశాఖపట్నం కలెక్టరేట్‌లో ముందెన్నడూ లేనివిధంగా 513 అర్జీలు అందగా.. డివిజన్, గ్రామీణ స్థాయిల్లో 1,050కి పైగా దరఖాస్తులు వచ్చాయి. డివిజన్, మండల స్థాయిల్లో ఆర్డీఓలు, తహసీల్దార్లు వినతులు స్వీకరించారు. శ్రీకాకుళం కలెక్టరేట్‌లో స్పందనకు 354 వినతులు వచ్చాయి.

ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌కు అవకాశం లేని వినతులు మరో 98 వచ్చాయి. మండలాలు, రెవెన్యూ డివిజన్‌ కార్యాలయాల్లో నిర్వహించిన కార్యక్రమానికి సుమారు 720 వరకు అర్జీలు వచ్చాయి. విజయనగరం కలెక్టరేట్, పార్వతీపురం ఐటీడీఏతోపాటు అన్ని తహసీల్దార్‌ కార్యాలయాల్లో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్‌తోపాటు ఆర్డీవో, తహసీల్దార్, ఐటీడీఏ, జిల్లా ఎస్పీ, మండల పోలీస్‌ స్టేషన్లలో స్పందన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా సుమారు 660 అర్జీలు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్‌లో 360 ఫిర్యాదులు అందాయి. జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి సుమారు 120 ఫిర్యాదులు అందాయి. కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘స్పందన’కు 253 అర్జీలు వచ్చాయి. గుంటూరు జిల్లాలో స్పందన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.

అచ్చంపేట మండలంలో వృద్ధురాలు పట్టాదార్‌ పాస్‌ పుస్తకం కోసం వీఆర్వోకు రూ.50 వేలు లంచం ఇచ్చి ఏడాదైనా ఆమె సమస్య పరిష్కారం కాలేదు. స్పందన కార్యక్రమంలో ఎమ్మెల్యే నంబూరు శంకరరావుకు మొరపెట్టుకోవడంతో ఆయన వీఆర్వోను పిలిచి మందలించి రెండు రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు. జెడ్పీ కార్యాలయంలో నిర్వహించిన కలెక్టర్‌ గ్రీవెన్స్‌కు 600 ఫిర్యాదులు, తెనాలి ఆర్డీఓ కార్యాలయంలో 22 ఫిర్యాదులు అందాయి. రూరల్‌ ఎస్పీ కార్యాలయంలో స్పందన కార్యక్రమానికి 80కు పైగా అర్జీలు వచ్చాయి. ఒంగోలు కలెక్టరేట్‌లో స్పందన కార్యక్రమానికి ప్రజలు పోటెత్తారు. వివిధ సమస్యలపై మొత్తం 375 అర్జీలు స్వీకరించినట్టు అధికారులు తెలిపారు. అనంతపురం జిల్లాలో నిర్వహించిన కార్యక్రమానికి 1,293 అర్జీలు వచ్చాయి. జిల్లా కేంద్రంలో 653 అర్జీలు అందాయి.

కర్నూలు కలెక్టరేట్‌లో స్పందనకు 1,127 దరఖాస్తులు రాగా.. నమోదుకు వీలులేని దరఖాస్తులు కూడా భారీగా అందాయి. కడప కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందనకు దాదాపు 500 మందికి పైగా వచ్చి సమస్యలను విన్నవించుకున్నారు. చిత్తూరు కలెక్టరేట్, తిరుపతి, మదనపల్లిలోని సబ్‌ కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలతోపాటు అన్ని తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల్లో స్పందన కార్యక్రమానికి మొత్తం 2,528 వినతులు వచ్చాయి. తిరుపతి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి 996 అర్జీలు రాగా.. అందులో 950 మంది నివాస స్థలాల కోసం వచ్చిన వారే ఉన్నారు.

అప్పటికప్పుడు ట్రై సైకిల్‌ అందజేత
నెల్లూరు నగరానికి చెందిన దివ్యాంగుడు మోహన్‌ ట్రై సైకిల్‌ కోసం నాలుగు నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేకపోయింది. చివరకు స్పందన కార్యక్రమానికి హాజరై కలెక్టర్‌ ఎంవీ శేషగిరిబాబుకు తన గోడు వెళ్లబోసుకున్నాడు. అతడికి అప్పటికప్పుడు ట్రై సైకిల్‌ అందజేశారు. ‘స్పందన’ కార్యక్రమంలో ఇంత వేగంగా సమస్య పరిష్కారం అవుతుందని తాను ఊహించలేదని మోహన్‌ వ్యాఖ్యానించాడు. తక్షణ స్పందనపై హర్షం వ్యక్తం చేశాడు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top