అర్హులందరికీ ఇళ్ల స్థలాలు 

Homes for all deserving people - Sakshi

వచ్చే ఐదేళ్లలో ఇళ్లు లేనివారందరికీ ఇళ్లు కట్టిస్తాం : సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అర్హులందరికీ ఇంటి స్థలం ఇచ్చి తీరుతామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో నివాస స్థలాలు లేని 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలివ్వాలంటే రూ.40 వేల కోట్లు కావాలని రెవెన్యూ శాఖ తయారు చేసిన గణాంకాలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. సరైన అంచనాలు, ప్రణాళికలు లేకుండా ఇలాంటి అంచనాలు వేసి భయపెట్టొద్దని హితవు పలికారు. ఇచ్చిన హామీని తక్కువ ఖర్చుతో అమలు చేసే మార్గాలు చూడాలన్నారు. 25 లక్షల ఇళ్ల స్థల పట్టాల జారీకి రూ.40 వేల కోట్లు అవుతుందని లెక్కలు వేయడమంటే ఇక దాన్ని ముట్టుకోవద్దని చెప్పడమేనని, ఇలా భయపడేలా చేస్తారా? అంటూ అసహనం వ్యక్తం చేశారు. 25 లక్షల మందికి ఇళ్ల స్థల పట్టాలు ఇవ్వడానికి 83,833 ఎకరాలు అవసరమని, ఇందుకు రూ.40 వేల కోట్లు అవసరమవుతాయని రెవెన్యూ శాఖ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ సిద్ధం చేసింది.

రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చేందుకు సిద్ధం కాగానే ముఖ్యమంత్రి కలుగజేసుకుని ఆ గణాంకాలు అవసరం లేదని, పక్కన పడేయాలని ఆదేశించారు. ‘రాష్ట్రంలో ఇంటి స్థలం లేని అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం ఇచ్చి తీరుతాం. 25 లక్షల మంది మహిళల పేరుతో నివాస స్థలాలు పంపిణీ చేస్తామని చెప్పాం. వచ్చే ఉగాది నాడు పండుగలా నివాస స్థలాలు పంపిణీ చేస్తాం. గత పాలకుల్లాగా పట్టాలు ఇచ్చి స్థలాలెక్కడో చూపని పరిస్థితి ఉండకూడదు. ఏయే గ్రామాల్లో ఎంతమందికి ఇంటి స్థలాలు లేవో గ్రామ వలంటీర్లు లెక్క తీస్తారు. ఆయా గ్రామాల్లో వారికి పట్టాలు ఇవ్వడానికి ఎంత భూమి కావాలో.. ప్రభుత్వ భూమి ఎంత ఉందో చూడండి. ఎక్కడైనా కొంత తక్కువ ఉంటే కొనుగోలు చేద్దాం.

ఎకరా రూ.20 లక్షలు అని, రూ.40 లక్షలు అని ఏవేవో లెక్కలు వేస్తే ఎలా?’ అని సీఎం ప్రశ్నించారు. దీంతో మన్మోహన్‌సింగ్‌ పట్టణ ప్రాంతాల్లో స్థలం కొరత ఉన్నందున మల్టీ స్టోరీడ్‌ భవనాలు ఇద్దామని, గ్రామాల్లో ఇళ్ల స్థలాలు ఇద్దామని ప్రతిపాదించారు. దీనికి స్పందించిన సీఎం పట్టణ ప్రాంతాల్లో జీ ప్లస్‌ 3, జీ ప్లస్‌ 4కు అనుగుణంగా నంబర్‌ ఆఫ్‌ ప్లాట్లు ప్లాన్‌ చేసుకుని అన్‌ డివైడెడ్‌ షేర్‌కు పట్టాలు ఇవ్వాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం స్థలాలు ఇద్దామన్నారు. కాగా పట్టణ గృహ నిర్మాణంలో గతంలో భారీ స్కామ్‌ జరిగిందని సీఎం వైఎస్‌ జగన్‌ ఎత్తి చూపారు. ‘300 చదరపు అడుగుల ఇంటి నిర్మాణానికి అవసరమైన ఇసుక ఉచితమే. సబ్సిడీతో సిమెంటు వస్తోంది. అలాంటప్పుడు చదరపు అడుగుకు రూ.1,100 మించి కాదు. వాస్తవం ఇది కాగా.. గత ప్రభుత్వం చదరపు అడుగుకు రూ.2,200 పెట్టి స్కామ్‌గా మార్చింది. ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు, కేంద్ర ప్రభుత్వం 1.50 లక్షలు కలిపి రూ.3 లక్షలు ఇస్తున్నాయి. ఇంటి నిర్మాణానికి ఇది సరిపోతుంది. కానీ గత పాలకులు దీన్ని రూ.6 లక్షలకు పెంచారు. ఇంత ఎందుకవుతుందో నాకు అర్థం కావడం లేదు. రివర్స్‌ టెండరింగ్‌కు వెళదాం’ అని సీఎం పేర్కొన్నారు.

మానవత్వంతో ముందుకెళ్దాం
గిరిజన ప్రాంతాల్లో ఎస్సీలకు, ఇతరులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం లేదని, ఇవ్వాలన్నా చట్టం అంగీకరించదనే విషయాన్ని ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్పశ్రీవాణి ప్రస్తావించారు. ఈ అంశంపై గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ముఖేష్‌ కుమార్‌ మీనా కలుగజేసుకుని 1/70 చట్టం అమల్లో ఉన్న ప్రాంతాల్లో గిరిజనేతరులకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి వీలులేదని తెలిపారు. మంత్రి మోపిదేవి వెంకటరమణ జోక్యం చేసుకుని కోస్తాలో భూముల ధరలు ఎక్కువగా ఉన్నాయని గ్రామాల పక్కనే అటవీ ప్రాంతం ఉన్నందున ఐదు ఎకరాల వరకూ ఇళ్ల స్థలాలకు వినియోగించుకునేలా చట్ట సవరణ చేసే విషయం పరిశీలించాలని కోరారు. ‘రమణన్న చెప్పినట్లుగా చేద్దాం. ముఖేష్‌ అన్నా (ముఖేష్‌ కుమార్‌ మీనాను ఉద్దేశించి) ముందు గిరిజన ప్రాంతాల్లో గిరిజనులకు పట్టాలు ఇవ్వండి. మిగిలినవారికి ఎలా ఇవ్వాలో ఆలోచిద్దాం’ అని సీఎం పేర్కొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top