ఎమ్మెల్యే బాలయ్య ఇంటి వద్ద హైడ్రామా! | High drama at MLA Balakrishna home! | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే బాలయ్య ఇంటి వద్ద హైడ్రామా!

May 24 2015 4:09 AM | Updated on Aug 25 2018 4:51 PM

పట్టణంలోని చౌడేశ్వరీకాలనీలో ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటివద్ద శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో హైడ్రామా చోటుచేసుకుంది.

పలువురిని అదుపులోకి
తీసుకున్న పోలీసులు

 
 హిందూపురం అర్బన్ : పట్టణంలోని చౌడేశ్వరీకాలనీలో ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటివద్ద శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో హైడ్రామా చోటుచేసుకుంది. మారుతి ఎర్టికా కారులో ఆరుగురు వ్యక్తులు నేరుగా వచ్చి ఎమ్మెల్యే ఇంటి ముందు అగారు. ఇంటివాచ్‌మెన్‌తో మాట్లాడి కాలింగ్ బిల్లు కొట్టారు. వారిని చూసిన ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి శేఖర్ తనపై గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేయడానికి వచ్చారని డీఎస్పీకి ఫోన్‌చేసి చెప్పారు. అంతే  ఆగమేఘాలపై సీఐలు, ఎస్సైలు సాయుధ పోలీసులు ఎమ్మెల్యే ఇంటి వద్దకు వచ్చారు.

అక్కడున్నవారిని చుట్టుముట్టి వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్లి విచారణ చేపట్టారు. పోలీసుల అదుపులోనున్నవారు మాట్లాడుతూ తాము మదనపల్లికి చెందినవారమని చెప్పారు.  హిందూపురంలోని సిరాజ్ అనే వ్యక్తి నుంచి సుమారు రూ.4 లక్షలు తమకు  డబ్బు రావాల్సి ఉందన్నారు. ఈ విషయంపై టీడీపీ నాయకుడితో పంచాయితీ చేసి డబ్బు వసూలు చేసుకోడానికి వచ్చామన్నారు.   పెనుకొండ రోడ్డు గుండా వస్తూ టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలు చూసి టీడీపీ నాయకుడి ఇళ్లుగా భావించి ఆ ఇంటి వద్దకు వెళ్లామే గానీ మరో ఉద్దేశం కాదని వారు వివరించారు.

 ఇదిలా ఉండగా  చౌడేశ్వరీ కాలనీలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న  మరో నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మదనపల్లికి చెందిన వ్యక్తులు, అదుపులో ఉన్న యువకులకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు విచారణలు చేపట్టారు. మదనపల్లి   వ్యక్తులు తాము టీడీపీకి చెందిన నాయకులమేనని, తమవద్ద ఉన్న పార్టీ సభ్యత్వ ఐడీని కూడా పోలీసులకు చూపించారు.

పూర్తిస్థాయిలో విచారణ చేసిన పోలీసులు మదనపల్లికి చెందిన షేక్‌ఇనాయతుల్లాగౌస్, వజీర్, గౌస్‌లాజం, అంజామ్‌అలీ, మహబూబ్‌బాష, స్థానిక ఆబాద్‌పేటకు చెందిన జబివుల్లాలను తహశీల్దార్ వద్ద బైండోవర్ చేశారు. వారితోపాటు చౌడేశ్వరిదేవి కాలనీలో అదుపులోకి తీసుకున్న మారుతిరెడ్డి, వెంకటేష్, చెన్నకేశవరెడ్డి, మనోహార్‌లను కూడా తహశీల్దార్ వద్ద బెండోవర్ చేశారు. డెప్యూటీ తహశీల్దార్ వారికి రూ.40వేల వ్యక్తిగత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement