హై అలర్ట్ | High Alert | Sakshi
Sakshi News home page

హై అలర్ట్

Mar 4 2014 3:26 AM | Updated on Oct 16 2018 6:33 PM

మున్సి‘పోల్’, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో పోలీసు శాఖ అలర్ట్ అయింది.

మున్సి‘పోల్’, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో పోలీసు శాఖ అలర్ట్ అయింది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టింది. ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలను అంచనా వేయడంతో పాటు, మద్యం దుకాణాలపై దృష్టి సారించారు. ఎప్పటికప్పుడు ముఖ్య అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు.
 

 మహబూబ్‌నగర్ క్రైం:

 ఎన్నికల సంఘం ఆదేశించక ముందు శాంతి భద్రతలపై జిల్లా పోలీసు బాస్ దృష్టి కేంద్రీకరించా రు. ఎన్నికల్లో ఖాకీలకు ఎలాంటి మచ్చ అంటుకోకుండా తగిన కసరత్తు చేస్తున్నారు. ప్రజలు ఓటు హక్కును నిర్భయంగా వినియోగించేందుకు శాంతి యుత వాతావరణాన్ని ఉండేలా కృషి చేస్తున్నారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పెరిగిపోతున్న నేర ప్రవృత్తి, ఉపయోగించే కండ, ధన బలంపై పోలీసు యంత్రాంగం అంచనా వేసేందుకు సిద్ధమవుతోంది. గతంలో జరిగిన ఎన్నికలకు సంబంధించి నేరాలపై దృష్టి పెట్టి, జిల్లాలో పీఎస్‌ల వారీగా జాబితాను తయారు చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ అడిగిన వెంటనే ముందుంచేందుకు గత రెండు ఎన్నికల్లో జరిగిన నేరాలపై చిట్టా తయారు చేస్తున్నారు.
 

 ఆయుధాలు, మద్యం దుకాణాలపై ఆరా...

 జిల్లాలో ఆయుధాలు విక్రయించే దుకాణాలు, ముందు గుండు విక్రయాలు, వినియోగదారులపై దృష్టి పెట్టారు. లెసైన్స్ లేని వారి జాబితాను సిద్ధం చేశారు. ఆయుధాలు మందు గుండు సామగ్రి రవాణాతో పాటు లెసైన్స్ కలిగిన వారిపై ఏవైనా కేసులు నమోదయ్యాయా అని ఆరా తీస్తున్నారు. జిల్లాలో ఉన్న క్వారీలు, అందులోని నిల్వల సమాచారం సేకరిస్తున్నారు. అక్రమ సారా దుకాణాలు, బెల్టు షాపులు, కల్తీ కల్లు కేంద్రాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. వీటికి సంబంధించిన సమాచారం పోలీసుల వద్ద ఉంది. ఇప్పటికే కలెక్టర్ గిరిజాశంకర్ అనుమతిలేని మద్యం దుకాణాలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో పోలీసు, ఎక్సైజ్ శాఖలు ఆపనిలోనే ఉన్నారు.
 

 సమస్యాత్మక గ్రామాలపై అంచనా...  

 జిల్లా సమస్యాత్మక గ్రామాలను గుర్తించేందుకు చురుగ్గా పని చేస్తున్నారు. వ్యక్తిగత కక్షలు, రాజకీయ కక్షలపై ఆరా తీస్తున్నారు. కుల ఆధిపత్య పోరు ఏవిధంగా ఉందనే సమాచారం సేకరిస్తున్నారు. గ్రామాల సమచారాన్ని ఇచ్చేందుకు అవసరమైన వ్యక్తులను ఏర్పాటు చేసుకుని పనిలో నిమగ్నమయ్యారు. ఎప్పుడూ గ్రామాలను సందర్శించని పోలీసులు ప్రస్తుతం పల్లెబాట పట్టి, అక్కడ మైత్రి సంఘాలను ఏర్పాటు చేసేయత్నంలో ఉన్నారు. గత ఎన్నికల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన వారిపై కూడా నిఘా పెంచారు. గ్రామాల వారీగా ఉన్న ముద్దాయిల జాబితాల దుమ్ముదులుపుతున్నారు. నేర చరిత, రౌడీ షీటర్లు జాబితాను తయారు చేస్తున్నారు. పాత నేరస్తుల కదలికలను గమనిస్తున్నారు. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ప్రాంతాలు, సమస్యాత్మక గ్రామాల బందోబస్తుపై ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నారు. మొత్తానికి పోలీసు శాఖ ముందే కసర త్తు ప్రారంభించడం అభినందనీయం.  
 

నేటి నుంచి జిల్లాలో 30 పోలీసు యాక్ట్

 జిల్లాలో మంగళవారం నుంచి 30 పోలీసు యాక్ట్‌ను అమలు చేయాల్సిందిగా ఎస్పీ నాగేంద్రకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో జిల్లా పోలీసులు చర్యలు చేపట్టాలన్నారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్లు, ఇతర అధికారుల కార్యాలయాల్లో హైఫ్రీక్వెన్సి వైర్‌లెస్ సెట్లను ఏర్పాటు పూర్తి చేయాలన్నారు. పోలీసుల అనుమతి లేనిదే ఎలాంటి సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు నిర్వహించరాదని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణలో పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు కూడా సహకరించాలని ఎస్పీ కోరారు.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement