విద్యా సంవత్సరం చివరి దశలో.. అదీ పదో తరగతి, ఇతర వార్షిక పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో పెద్దసంఖ్యలో ఉన్నత పాఠశాలల
వీరఘట్టం: విద్యా సంవత్సరం చివరి దశలో.. అదీ పదో తరగతి, ఇతర వార్షిక పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో పెద్దసంఖ్యలో ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులను డిప్యుటేషన్‌పై ఇతర పాఠశాలలకు పంపించడంపై ఉపాధ్యాయ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. జిల్లాలోని పలు ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లుగా పని చేస్తున్న 141 మందిని డిప్యుటేషన్‌పై బదిలీ చేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. గత నెల 22న జారీ చేసినట్లు చెబుతున్న ఈ ఉత్తర్వులు సోమవారం మండల విద్యాశాఖ అధికారులకు అందాయి. డిప్యుటేషన్ వేసినవారంతా మంగళవారం నుంచే కొత్త విధుల్లో చేరాలని స్పష్టం చేసినట్లు తెలిసింది. పాలకొండ డివిజన్‌లో 24 మంది, టెక్కలి డివిజన్‌లో 81 మంది, శ్రీకాకుళం డివిజన్‌లో 36 మందిని వర్క్ అడ్జస్ట్‌మెంట్ పేరుతో డిప్యుటేషన్‌పై ఇతర పాఠశాలలకు బదిలీ చేసినట్లు సమాచారం. విద్యార్థులు ఎక్కువగా ఉండి ఉపాధ్యాయులు లేని పాఠశాలలకు వీరిని డిప్యూట్ చేశారు. ఇది ఈ ఒక్క విద్యా సంవత్సరానికే పరిమితమని, వేసవి సెలవుల అనంతరం వీరంతా తిరిగి ప్రస్తుతం పని చేస్తున్న పాఠశాలల్లోనే చేరాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.
పెదవి విరుస్తున్న ఉపాధ్యాయులు
విద్యా సంవత్సరం ప్రారంభంలోనే రేషనలైజేషన్ ప్రకారం బదిలీలు చేయాల్సిందిపోయి, విద్యా సంవత్సరం చివరి దశలో డిప్యుటేషన్‌పై పంపడంపై ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరో 54 రోజుల్లో పదోతరగతి పరీక్షలు జరగనున్నాయని, ఈ తరుణంలో కొత్త పాఠశాలల కు వెళ్లి ఏం బోధించగలమంటున్నారు. కాగా పదోతరగతి బోధించే ఉపాధ్యాయులను కొన్ని చోట్ల ఎనిమిదో తరగతికి నియమించారని.. ఇలా బోధించడం కొంత ఇబ్బందిగా ఉంటుందని, ఉన్న పళంగా ఒక మండలం నుంచి వేరే మండలానికి వెళ్లడం కూడా కష్టమేనని పలువురు ఉపాధ్యాయులు వ్యాఖ్యానిస్తున్నారు.