విద్యాధరికి చేరలేక | Health cooperate suicide | Sakshi
Sakshi News home page

విద్యాధరికి చేరలేక

Aug 12 2015 3:01 AM | Updated on Nov 6 2018 7:56 PM

ఓ భగవంతుడా... ఈ రోజు చనిపోవాలనుకున్నా అందుకే నీ సమాధానం కోసం నీ ముందు చీటి వేశా.. నీ అనుమతి లభించింది.

నేలరాలిన విద్యాకుసుమం
ఆరోగ్యం సహకరించక ఆత్మహత్య
కన్నీటి పర్యంతమైన కుటుంబసభ్యులు
ఘటనా స్థలంలో సూసైడ్‌నోట్

 
 ఓ భగవంతుడా... ఈ రోజు చనిపోవాలనుకున్నా అందుకే నీ సమాధానం కోసం నీ ముందు చీటి వేశా.. నీ అనుమతి లభించింది. చదువంటే నాకు చాలా ఇష్టం. కానీ చదువుకునేందుకు ఆరోగ్యం సహకరించడంలేదు. కళ్ళు కనిపించడం లేదు. చేతులు పనిచేయడం లేదు. బాధతో తల పగిలిపోతోంది. ఉన్నత లక్ష్యాలను చేరాలన్న ఆశ నెరవేరడం లేదు. అందుకే శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోతున్నా... ఇదీ ఓ బీఈడీ విద్యార్థిని నిర్ణయం. ఆ విషయాన్ని సూసైడ్‌నోట్‌లో రాసి క్షణంలోనే తనువు చాలించింది.
 - పీఎన్‌కాలనీ
 
ఉపాధ్యాయురాలు కావాలని ఎన్నో కలలు కన్నది. తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చాలని తపనపడింది. కానీ ఆరోగ్యం సహకరించలేదు. విషయం కన్నవారికి చెప్పుకోలేకపోయింది. ఒత్తిడి ఎక్కువైంది. ఫలితాలు అనుకూలంగా రావని గ్రహించింది. ఇక ప్రాణం తీసుకోవడమే పరిష్కారమనుకుంది. ఉదయాన్నే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇదీ ఎచ్చెర్లలోని వేంకటేశ్వర బీఈడీ కళాశాలలో చదువున్న విద్యాధరి కథ. పొందూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న చింతమనేని గోవర్థనరావు, భార్య మంజుల, కుమారుడు సంతోష్, కుమార్తె విద్యాధరి(22)తో కలసి పట్టణంలోని ఎల్‌బీఎస్‌కాలనీలో నివాసం ఉంటున్నారు. కుమార్తె విద్యాధరి ఎచ్చెర్లలోని వేంకటేశ్వర బీఈడీ కళాశాలలో ఫైనల్ ఎగ్జామ్ రాస్తోంది. సోమవారం మొదటి పరీక్షకు హాజరైంది.
 
 సాయంత్రం ఇంటికి చేరిన ఆమె మరునాటి పరీక్షకు సన్నద్ధమవుతోంది. రాత్రి భోజనానంతరం తనగదిలోకి వెళ్లిపోయింది. మంగళవారం వేకువఝామున ఉదయం నాలుగు గంటలకే లేచి చదువుంది. ఆ సమయంలో తండ్రిని పలకరించింది. ఆమె చదువుకుంటోంది కదా అని ఆయన బయటకు వెళ్లారు. తిరిగి ఆరుగంటల సమయంలో ఎంత పిలిచినా ఆమె బయటకు రాకపోవడంతో తల్లిదండ్రులు, అన్న సంతోష్ కిటికీలోనుంచి గదిలోకి చూడగా విద్యాధరి ఉరివేసుకుని ఉండటం చూసి షాక్‌తిన్నారు. వెంటనే గదితలుపులు విరగ్గొట్టి చూడగా అప్పటికే ఆమె మృతిచెందిందని గ్రహించి గుండెలవిసేలా రోదించారు. చుదువుపై ఎంతో మక్కవగల తమ కుమార్తె ఈ విధంగా తనువు చాలించడాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు.
 
 కేసు నమోదు

 విషయం తెలుసుకున్న ఒకటవ పట్టన ఎస్సై ఇ.చిన్నంనాయుడు సంఘటనా స్థలానికి చేరుకుని మృతిపై ఆరా తీశారు. ఆమె పెట్టిన సూసైడ్ నోట్‌ను రికార్డు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం  రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉంటే ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉన్న విద్యాధరి తన సూసైడ్ నోట్‌లో ఇష్టమైన స్నేహితులకు, ఉపాధ్యాయులకు తమ కుటుంబ సభ్యులకు క్షమాపణ చెప్పడం అక్కడివారిని మరింత కలచివేసింది. తన మృతికి ఎవరూ కారణం కాదనీ స్పష్టం చేసింది. సహచర విద్యార్థినీ, విద్యార్థులు కన్నీరు పెట్టుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement