
సాక్షి, న్యూఢిల్లీ: విజయవాడ, విశాఖపట్నం నగరాలలో మెట్రో రైలు నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి తమకు సవరించిన ప్రతిపాదనలు అందలేదని పట్టణాభివృద్ధి శాఖమంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. రాజ్యసభలో బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. విజయవాడ, విశాఖపట్నం నగరాలలో మెట్రోరైలు నిర్మాణానికి సంబంధించి 2015 జూన్, డిసెంబర్ నెలల్లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు అందాయని మంత్రి చెప్పారు.
అయితే 2017లో ప్రభుత్వం మెట్రోరైలు వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించి కొత్త విధానాన్ని అమలులోకి తీసుకువచ్చిందన్నారు. దానికి అనుగుణంగా సవరించిన ప్రతిపాదనలు సమర్పించాల్సిందిగా కోరుతూ పాత ప్రతిపాదనలను రాష్ట్రానికి తిప్పి పంపించినట్లు మంత్రి తెలిపారు.
కొత్త మెట్రో రైలు విధానానికి అనుగుణంగా ప్రతిపాదనలు పంపించిన భోపాల్, ఇండోర్ నగరాల్లో మెట్రో రైలు వ్యవస్థ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని మంత్రి చెప్పారు. భోపాల్ నగరంలో 27 కిలోమీటర్ల మెట్రో రైలు నిర్మాణానికి రూ.6941 కోట్లు, ఇండోర్‌లో 31 కిలోమీటర్ల మెట్రో రైలు కోసం రూ.7500 కోట్ల అంచనా వ్యయంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనలను ఆమోదించామన్నారు. భోపాల్ మెట్రోకు రూ.4657 కోట్లు, ఇండోర్ మెట్రోకు రూ.4476 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వ వాటాగా ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించినట్లు మంత్రి తెలిపారు.