హమాలీలకు పని భద్రత కల్పించాలి | Hamalila to provide job security | Sakshi
Sakshi News home page

హమాలీలకు పని భద్రత కల్పించాలి

Sep 21 2013 3:44 AM | Updated on Sep 1 2017 10:53 PM

బేవరేజస్ కార్పొరేషన్‌లో పని చేస్తున్న హమాలీలకు పని భద్రత కల్పించాలని డిమాండ్ చే స్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నానిర్వహించారు.

ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: బేవరేజస్ కార్పొరేషన్‌లో పని చేస్తున్న హమాలీలకు పని భద్రత కల్పించాలని డిమాండ్ చే స్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హమాలీలు కలెక్టరేట్ ఎదుట చేపట్టిన దీక్షలు శుక్రవారానికి పదో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన హమాలీలు, సీఐటీయూ నాయకులు కలెక్టరేట్ వద్ద ఉన్న దీక్ష శిబిరానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రదర్శనగా కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్దకు చేరుకుని అక్కడ బైఠాయించారు.
 
 బేవరేజస్ కార్పొరేషన్ ఐఎంఎఫ్‌ఎల్  గౌడన్లలో టెండర్ విధానాన్ని రద్దుచేయాలని, హమాలీలకు పనిభద్రత కల్పించాలని, గుర్తింపు కార్డులు జారీ చేయాలని,పీఎఫ్ సౌకర్యం కల్పించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఐటీయూ జిల్లా కార్యదర్శి బత్తుల గణపతి మాట్లాడుతూ హమాలీలకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. 20 సంవత్సరాలుగా పని చేస్తున్న హమాలీలను వెళ్లగొట్టేందుకు టెండర్ విధానాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇది సరికాదని అన్నారు.
 
 సమస్యలు పరిష్కరించాలని ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వానికి మొరపెట్టుకున్న ఫలితం లేదని అన్నారు. సివిల్ సప్లయీస్ కార్పొరేషన్‌లో పని చేస్తున్న కార్మికులకు పీఎఫ్‌తో పాటు యూనిఫాం, జనశ్రీ బీమా పథకం, బోనస్, దహన సంస్కారాలకు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. దిగుమతి రేటును రూ.5 లకు పెంచాలని, డిపోల వద్ద కనీస సౌకర్యాలు కల్పించే వరకు ఉద్యమం ఆగదన్నారు.


 ఈ కార్యక్రమంలో సీఐటీయు జిల్లా నాయకులు భూక్యా శ్రీను, విష్ణువర్ధన్, నర్సింహరావు, కుమారి, హమాలీల సంఘం నాయకులు మట్టయ్య, కిరణ్‌కుమార్, రామారావు, శ్రీనివాస్, రాంబాబు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement