అమ్మ బాబోయ్‌!

Gunda Lakshmi Devi Corruption Special Story - Sakshi

శ్రీకాకుళం నియోజకవర్గంలో

‘అమ్మ’ అనుచరుల హవా

చెప్పేది నీతి మాటలు.. నడిచేది అవినీతి బాటలు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి తీరుకు సరిపోయే సూక్తి ఇది. ప్రభుత్వ పథకాలను తెలుగు తమ్ముళ్లకు మేతగా వేస్తూనే.. వారి అవినీతి ఆకలిని పరోక్షంగా సమర్థిస్తూ అక్రమాలను పెంచి పోషిస్తున్నారామె. జిల్లా కేంద్రంలో నాలుగున్నరేళ్లుగా ‘అమ్మ’ ఆదేశంతోనే తమ్ముళ్లు ఊళ్లపై పడి అక్రమాలకు తెగబడ్డారన్నది జనం మాట. చిన్న చిన్న సంక్షేమ పథకాల నుంచి పెద్ద పెద్ద కట్టడాల వరకు అన్నింటిలోనూ అధికార పార్టీ కార్యకర్తలు       దోపిడీకి పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అనుచరుల వ్యవహారం రచ్చకెక్కింది. నియోజకవర్గంలో గత నాలుగున్నరేళ్లుగా ‘అమ్మ’ ఆదేశాలే పరమావధిగా ఆమె ముఖ్య అనుచరులు ఇష్టానుసారంగా ప్రభుత్వ పథకాలతో పాటు సంక్షేమ పథకాలను వదిలిపెట్టకుండా అక్రమాలకు తెగబడుతున్నారు. ఈ అక్రమాల వ్యవహారాల్లో ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి పాత్ర పరోక్షంగా ఉందనేలా ఆరోపణలు తీవ్రమయ్యాయి. ఆమె అండదండలతోనే నగర పార్టీ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, శ్రీకాకు ళం, గార మండలాల ముఖ్య నేతలు ప్రతి అభివృద్ధి అంశంతో పాటు సంక్షేమ పథకాలను సైతం వదిలిపెట్టకుండా అక్రమాలకు తెరలేపారు. తీరంలోని ఇసుక, మట్టి, రోడ్లు, కాలువలతో పాటు పేదల ఇళ్లను కూడా రాజకీయం చేస్తూ దోచుకున్నారు.

తమ కుటుంబానికి నీతి తప్ప అవినీతి మచ్చ లేదంటూ బాహాటంగా ప్రకటనలిస్తున్న ‘గుండ’ నేతలు, తెరవెనుక మాత్రం తమ అనుచరుల అవినీతిని అద్భుతంగా ప్రోత్సహిస్తున్నారు. ‘ నేను అండగా ఉంటా...దోచేసుకోండని..’ ధీమాగా చెబుతూనే అధికారుల చేతులకు చర్యలకు కళ్లెం వేస్తున్నారు. పేరుకు, ప్రకటనల్లోనే నీతి వాక్యాలు చెబుతూ అడ్డదారిలో అవినీతి చేస్తూ ప్రజాధనాన్ని బొక్కేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక రాజకీయంగా చూస్తే ఓ మంత్రి అచ్చెన్నకు వ్యతిరేకంగా, మరో మంత్రి కళాకు అనుకూలంగా ఎంపీ రామ్మోహన్నాయుడును వెంట తిప్పుకుంటూ తమ వారి ‘అవినీతి కథ’ ను నడిపిస్తూ ‘అమ్మ’ ముందుకు సాగుతున్నారు. జిల్లా కేంద్రంలో సహ జ వనరులను కూడా అక్రమాలకు అడ్డాలుగా మార్చేసి, తమ అనుచర వర్గాలకు ఆయాచితంగా లబ్ధి చేకూరేలా చేయడంతో తెలుగు తమ్ముళ్లు అవినీతి కుమ్ముడు ఇప్పుడు నియోజకవర్గంలో హాట్‌ టాపిక్‌గా మారింది. అధికారం వచ్చిన తొలినాళ్లలో అభివృద్ధిలో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉన్న ఎమ్మెల్యే లక్ష్మీదేవి ఇప్పుడు టాప్‌టెన్‌లో కూడా లేరని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి.

నీరు–చెట్టు పేరిట అవినీతి
రాష్ట్రంలో చంద్రబాబు అధికారం చేపట్టిన నాటి నుంచి తెలుగు తమ్ముళ్ల అవినీతి ఆకలి తీర్చేందుకు నీరు–చెట్టు పథకమంటూ అక్రమాల పనులు చేపట్టారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్ర నియోజకవర్గంలో శ్రీకాకుళం, గార మండలాల పరిధిలో లక్షలాది రూపాయలతో జలవనరుల శాఖ ఆ«ధ్వర్యంలో పనులు చేసినట్లుగా చూపించి నిధులు బొక్కేశారు. అలాగే ఉపాధి పనుల క్రమంలో కూడా రోడ్లు, పలు భవనాల నిర్మాణాల్లో కమీషన్లు దండుకున్నారు. ఇందులో ఎమ్మెల్యే లక్ష్మీదేవి అనుచరులే బినామీ కాంట్రాక్టర్ల అవతారమెత్తి జేబులు నింపుకున్నారు. అలాగే శ్రీకాకుళం కార్పోరేషన్‌లో కూడా లక్షలాది రూపాయలతో సీసీ రోడ్లు, ప్రధాన రోడ్డు విస్తరణ పనులను చేపట్టారు. ఇందులో కూడా తమ అనుచరులకే కాంట్రాక్టులు దక్కేలా చేస్తూ కమీషన్లు మింగారని ఆరోపణలు విన్పిస్తున్నాయి. కార్పొరేషన్‌లో ఉన్న 50 డివిజన్లలో పలు అభివృద్ధి పనుల్లో కూడా అంతా తామై నడిపిస్తూ పనుల్లో వాటాల బేరాలు చేశారని, ఇందులో ఎమ్మెల్యే వెంట ఉన్న ఇద్దరు ము ఖ్య అనుచరుల దౌర్జన్యం దారుణంగా ప్రభావం చూపించింది. అలాగే అరసవల్లి కూడలి నుంచి సూర్యమహల్‌ కూడలి వరకు రోడ్డు విస్తరణ పనుల్లో కూడా అక్రమాలకు దిగారనే ఆరోపణలు వినిపించాయి.

ఆగని జన్మభూమి కమిటీ ఆగడాలు
తెలుగు తమ్ముళ్లు ప్రతి సంక్షేమ పథకం అమల్లోనూ తమ ప్రాధాన్యతను చూపిస్తూ, ఆఖరికి అధికారులపై కూడా తమ ఆధిపత్యం చెలాయించారు. గత నాలుగేళ్ల నుంచి జన్మభూమి కమిటీల పేరిట శ్రీకాకుళం, గార మండలాల్లో ప్రతి పంచాయతీలోనూ తెలుగు తమ్ముళ్లు పేదలకు అందాల్సిన పథకాల అమల్లో అక్రమాలకు తెగబడ్డారు. పింఛన్లు, ఇళ్లు, రేషన్‌ కార్డులు ఇలా ప్రతి వ్యవహారంలోనూ ఈ కమిటీ సభ్యుల పాత్ర వివాదాలు తెచ్చిపెట్టింది. ప్రతి సంక్షేమ పథకం అమలుకు ఒక్కో రేటును నిర్ణయిస్తూ అక్రమ వసూళ్లు చేపట్టిన ఈ కమిటీ తమ్ముళ్లు.. ఇష్టానుసారంగా పేదలు, సామాన్యుల వద్ద సొమ్ములు దోచుకున్నారు. అలాగే శ్రీకాకుళం కార్పొరేషన్‌లో తీరు చూస్తే ఈ ఆగడాలు మరింత అధికమయ్యాయి. మొత్తం 50 డివిజన్లలోనూ ఈ కమిటీ సభ్యుల దౌర్జన్యాలు పెరిగిపోయాయి.

నగర పార్టీ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్‌ తదితర ఎమ్మెల్యే అనుచరులు ప్రతి అంశంలోనూ అక్రమాలు చేస్తూ వస్తున్నారు. ఇదంతా తనకు తెలిసే జరుగుతున్నా ఏమాత్రం స్పందించకుండా, పరోక్షంగా ప్రోత్సహిస్తూ ఎమ్మెల్యే అక్రమాలకు ఊతమిచ్చారన్న ఆరోపణలు జోరందుకున్నాయి. జిల్లాలో టీడీపీ ప్రాతినిధ్యం వహిస్తున్న సుమారు 8 నియోజకవర్గాల్లోనూ ఐదుగురు ఎమ్మెల్యేలతో పాటు ఇద్దరు మంత్రులు ఒక ప్రభుత్వ విప్‌ హయాంలో కూడా ఇలాగే తెలుగు తమ్ముళ్లు టీడీపీ ముఖ్య నేతల అండదండలతో అవినీతిలో ఓ కుమ్ముడు కుమ్మేస్తున్నారు. ఈ వ్యవహారాలపై జనం తీవ్రంగా విమర్శిస్తున్నారు.

ఇసుక అక్రమాలకు ప్రోత్సాహం
శ్రీకాకుళం, గార రూరల్‌ ప్రాంతాల్లో ఇసుక అక్రమాలకు ఎమ్మెల్యే లక్ష్మీదేవి ప్రధాన అండదండగా నిలబడ్డారని చెప్పవచ్చు. ముఖ్యంగా భైరి, పొన్నాం, భట్టేరు, కళ్లేపల్లి తదితర ప్రాంతాల్లో ఇసుకను అక్రమంగా తరలించడంతో లక్షల్లో చేతులు మారాయి. ఎమ్మెల్యే అనుచరులు ఇసుకాసురులుగా మారిపోయి మైనింగ్, పోలీసు అధికారులపై ఒత్తిళ్లు తెప్పిస్తూ అక్రమంగా విశాఖకు ఇసుకను తరలించడంతో పాటు స్థానిక అవసరాలకు కూడా ‘ఉచితం’ మాటున అక్రమాలకు తెగబడ్డారు. ఈక్రమంలో పలు వాహనాలను పోలీసులు, మైన్స్‌ శాఖాధికారులు పట్టుకున్నప్పటికీ, ఎమ్మెల్యే లక్ష్మీదేవి ఇంటి నుంచి ఫోన్‌ సమాచారం రావడంతో పలు వాహనాలను తప్పించడం పరిపాటిగా మారింది. తెలుగు తమ్ముళ్లు ఇదే ధీమాతో యథేచ్ఛగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు.

అక్రమార్కుల చేతిలో హుద్‌హుద్‌ ఇళ్లు
2014లో హుద్‌హుద్‌ తుపాన్‌తో నష్టపోయిన బాధితులకు జిల్లా కేంద్రంలో కంపోస్ట్‌ కాలనీలో మొత్తం 192 ఇళ్లను మంజూరు చేశారు. అయితే ఇందులో అసలైన బాధితులకు ఒక్క ఇళ్లు కూడా దక్కకపోగా, మొత్తం ఇళ్లన్నీ అక్రమార్కులకు, అమ్మ అనుచరులకే దక్కాయి. ఈ విషయాన్ని ముందుగా ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చి ఆ జాబితాను కూడా ప్రచురించిన సంగతి విదితమే. ఈ ఇళ్ల నిర్మాణాలు పూర్తయి సుమారు మూడేళ్లు దాటుతున్నా ఇప్పటికీ అర్హుల జాబితాను విడుదల చేయకుండా ఎమ్మెల్యే లక్ష్మీదేవి అనుచరులు చక్రం తిప్పారు. ఇందులో సుమారు వందకు పైగా ఇళ్లును ఆమె అనుచరులకు కట్టబెట్టడం ద్వారా నిజమైన అర్హులకు ఇళ్లు అందని పరిస్థితి నెలకొంది. ఇళ్లు కేటాయించేందుకు డబ్బులు వసూళ్లు చేసి, అక్రమాలకు తెగబడ్డారని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి.

అలాగే కొందరు టీడీపీ ముఖ్య కార్యకర్తలు ఈ ఇళ్లను రూ.5లక్షల నుంచి రూ.8 లక్షల వరకు బేరం పెట్టేసి అమ్ముకున్నారన్న నిజాలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. టీడీపీ డివిజన్ల నేతలు తమ బినామీ పేర్లతో ఇళ్లు దక్కించుకోవడం జరిగింది. ఈ వ్యవహారంలో తమకు, తమ కుటుంబానికి ఏమాత్రం సంబంధం లేదంటూ ప్రకటించిన ఎమ్మెల్యే, ఇళ్ల జాబితా బయటకు రావడంతో ఏం చెయ్యాలో తోచక ప్రతిపక్ష నేతలపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇందులో భాగంగానే కొందరు విలేకరులకు కూడా ఇళ్లను కేటాయించడంతో ఈ విషయాన్ని మరుగున పడేసేలా ఎత్తులు వేశారు. హుద్‌హుద్‌ అర్హుల జాబితాలో సుమారు 40 మంది వరకు విలేకరులకు, వారి బినామీ పేర్లతో కేటాయించడం వివాదాస్పదమైంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top