వంద పడకల ఆస్పత్రిగా ఈఎస్‌ఐ

Gummanuru Jayaram Speech In Chittoor - Sakshi

కార్మిక వైద్యబీమాను టీడీపీ ప్రభుత్వం విచ్ఛిన్నం చేసింది

సీఎం కార్మికులకు పెద్దపీట వేస్తున్నారు

మంత్రి గుమ్మనూరు జయరాం

సాక్షి, తిరుపతి : తిరుపతిలోని ఈఎస్‌ఐ ఆసుపత్రిని 100 పడకల వరకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం వేగవంతంగా కృషి చేస్తుందని కార్మికశాఖా మంత్రి గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. తిరుమలకు వచ్చిన మంత్రి జయరాం మంగళవారం ఈఎస్‌ఐ ఆస్పత్రిని సందర్శించారు. అన్ని విభాగాలను పరిశీలించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐదేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం కార్మిక బీమా, వైద్యాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. ఆధునిక భవనం ఉన్నా మౌలిక వసతులు కల్పించకుండా ఈఎస్‌ఐ ఆస్పత్రిని నిర్లక్ష్యం చేశారన్నారు. వైద్యులు, టెక్నీషియన్లు, సిబ్బంది కొరత ఆస్పత్రిని వేధిస్తోందన్నారు. వీటిని అన్నింటినీ అధిగమించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధంగా ఉన్నారన్నారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఈఎస్‌ఐకి కొత్త వైభవాన్ని తీసుకొస్తామన్నారు. ఏళ్ల తరబడి ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది కనీస వేతనాలకు నోచుకోవడం లేదన్నారు. ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్‌ సిబ్బందికి మేలు జరిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఆస్పత్రిలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని రోగుల నుంచి ఫిర్యాదులు వచ్చాయన్నారు.

దీనిపై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ఎక్స్‌రే, స్కానింగ్‌ సెంటర్‌లను తక్షణం నూతన భవనంలో రోగులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. మందులు లేవని రోగుల నుంచి అధిక ఫిర్యాదులు వచ్చాయన్నారు. అన్నిరకాల వ్యాధులకు సంబంధించిన మందులను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించామన్నారు. మౌలిక వసతులు, సిబ్బంది, వైద్యులు, టెక్నీషియన్ల అవసరం మేరకు ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్‌ కార్మికులు మంత్రిని కలసి పీఎఫ్‌ అమలు చేయడం లేదని ఫిర్యాదు చేశారు. ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్‌ సిబ్బంది తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని మంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో ఈఎస్‌ఐ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సి.రమేష్‌కుమార్, ఇన్‌చార్జ్‌ ఆర్‌ఎంఓ డాక్టర్‌ రమణ కిషోర్, కర్నూలు జాయింట్‌ లేబర్‌ కమిషనర్‌ శ్రీనివాస్, సీనియర్‌ డాక్టర్లు బాలశంకర్‌రెడ్డి, భాస్కర్‌రావు, ఆసుపత్రి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల ప్రతినిధులు భూపాల్, రామాంజులు, పద్మజ పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top