గ్రీవెన్స్‌సెల్‌కు 205 వినతులు | Grievance Cell 205 requests | Sakshi
Sakshi News home page

గ్రీవెన్స్‌సెల్‌కు 205 వినతులు

Feb 4 2014 2:53 AM | Updated on Sep 2 2017 3:18 AM

కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌కు అర్జీదారులు పోటెత్తారు. వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ మొత్తం 205

 విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్ :కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌కు అర్జీదారులు పోటెత్తారు. వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ మొత్తం 205 వినతులు అందాయి. కార్యక్రమాన్ని కలెక్టర్ కాంతిలాల్‌దండే, ఏజేసీ యూసీజీ నాగేశ్వరరావు, డీఆర్‌ఓ బి.హేమసుందరవెంకటరావు నిర్వహించారు. వచ్చిన వినతుల్లో కొన్ని ముఖ్యమైనవి...
 
  విద్యార్థుల సమస్యలు పరిష్కరించండి
 విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించాలని నెల్లిమర్ల మండలం కొండవెలగాడ గ్రామ మాజీ సర్పంచ్ జి.అప్పలనాయుడు ఆధ్వర్యంలో పలువురు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన పథక నిర్వహణకు గదిలేక పోయినా ఎంఈఓ సైతం పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని వివరించారు. 
 
  పైసలిస్తేనే పని...
 తమ గ్రామ పంచాయతీ సెక్రటరీ పైసలిస్తేనే పని చేస్తానని బహిరంగంగా చెప్పడంతో పాటూ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని దత్తిరాజేరు మండలం పెదమానాపురం ఉపసర్పంచ్ కె.కనకరాజు ఆధ్వర్యంలో పలువురు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. దీనిపై కలెక్టర్ తీవ్రస్థాయిలో స్పందించారు. తక్షణమే విచారణ చేపట్టి నివేదిక అందజేయాలని డీఎల్‌పీఓ మోహనరావును ఆదేశించారు. 
 
  అడ్డగోలుగా ‘దీపం’ పంపిణీ..
 జిల్లాలో ‘దీపం’ కనెక్షన్లకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక అడ్డగోలుగా జరుగుతోందని మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దన్నానపేట గ్రామంలో సర్పంచ్‌కు తెలియకుండానే గ్రామ సభ నిర్వహించినట్లు ప్రకటించారంటే ఎంపికలో ఉన్న పారదర్శకత స్పష్టమవుతోందన్నారు. 
 
  తమను కొనసాగించాలంటూ..
  గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు మెరుగుపర్చడానికి కృషి చేస్తున్న తమను విధుల్లో కొనసాగించాలని కోరుతూ ఆర్‌డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో పని చేస్తున్న మండల కోఆర్డినేటర్లు వినతిపత్రం అందజేశారు. 
 
  ఇళ్లు మంజూరు చేయాలంటూ..
 చెవిటి, మూగ వారికి ఇళ్లు మంజూరు చేయాలని కోరుతూ జిల్లా చెవిటి, మూగ సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతపత్రం అందజేశారు. నివాసాకి సరైన సౌకర్యం లేక తీవ్రఅవస్థలు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు. 
 
  జిల్లాకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి..
 రాష్ట్రంలో వెనుకబడిన విజయనగరం జిల్లాకు ప్రత్యేక బడ్జెట్ వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. వ్యవసాయం, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడానికి చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నాయకుడు మర్రాపు సూర్యనారాయణ తదితరులు కోరారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement